Naga Chaitanya: షూటింగ్ పూర్తయిందని తెలిసి.. చాలా బాధపడ్డా!

ABN , First Publish Date - 2022-07-31T01:39:19+05:30 IST

వయాకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్షన్స్ బ్యానర్లపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ‌ఖాన్ (Aamir Khan) టైటిల్‌లో పాత్రలో నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). కరీనా కపూర్ (Kareena Kapoor) హీరోయిన్‌గా

Naga Chaitanya: షూటింగ్ పూర్తయిందని తెలిసి.. చాలా బాధపడ్డా!

వయాకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్షన్స్ బ్యానర్లపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ‌ఖాన్ (Aamir Khan) టైటిల్‌లో పాత్రలో నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). కరీనా కపూర్ (Kareena Kapoor) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు నాగచైతన్య (Naga Chaitanya) ఓ కీలక పాత్రలో నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా.. ‘లాల్ సింగ్ చడ్డా’ సెట్స్‌లో జరిగిన విశేషాలతో కొన్ని వీడియోలను మేకర్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తన జర్నీని తెలుపుతున్న నాగచైతన్య వీడియోని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేసింది. ఈ వీడియోలో తన పేరు వెనుక ఉన్న సంగతులే కాకుండా.. అనేక విషయాలను చైతూ చెప్పుకొచ్చారు. 


‘బోడి బాలరాజు’ (Balaraju Bodi) పేరు ఎలా వచ్చిందంటే..

‘‘ఈ స్టోరీ నా దగ్గరకు వచ్చినప్పుడు నా పాత్ర పేరు బాల. బోడిపాలెం నుంచి ఆర్మీలో చేరిన ఒక యువకుడి పాత్ర ఇది. మాములుగా చాలా మంది పేర్ల ముందు ఊరి పేరు ఇంటి పేరుగా ఉండటం మనం గమనిస్తుంటాం. అలా.. నా పేరు బోడి బాలరాజు అయింది. బాలరాజు కంటే ముందు బాలకృష్ణ, బలరాం.. ఇలా కొన్ని పేర్లు పరిశీలించడం జరిగింది. కానీ ఆమిర్ ఖాన్‌గారితో సహా యూనిట్ మొత్తానికి బాలరాజు అనే సౌండ్ బాగా నచ్చేసింది. తాతగారు ఇదే పేరుతో ఓ సినిమా చేయడం అనేది నిజంగా ఓ మ్యాజిక్. లుక్ విషయంలో ఆ సినిమాలోని తాతగారి లుక్‌ని రిఫరెన్స్‌గా తీసుకోవడం జరిగింది. అలా ఈ చిత్రంలో నా పేరు బోడి బాలరాజు‌ అని ఫైనల్ అయింది. ఆ తర్వాత నా లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. సౌత్ ఇండియన్ లుక్ వచ్చేలా.. యూనిట్ అంతా కృషి చేసింది’’.


షూటింగ్ పూర్తయిందని తెలిసి చాలా బాధపడ్డా..

‘‘ఈ సినిమా షూటింగ్‌‌లో పాల్గొన్నప్పుడు నన్ను నేను మరిచిపోయా. ప్రతి క్షణాన్ని ఎంతగానో ఆస్వాదించాను. నిజంగా చెప్పాలంటే ఒక కొత్త ప్రపంచాన్ని చూశా. కార్గిల్, శ్రీనగర్ షెడ్యూల్స్ నాకు చాలా ప్రత్యేకమైనవి. ఆన్ స్ర్కీన్.. ఆఫ్ స్క్రీన్.. ఈ సినిమాకు సంబంధించి ప్రతీది నాకు మ్యాజికలే. ఇక షూటింగ్ అయిపోయి ప్యాకప్ చెప్పే సమయంలో నాకు చాలా బాధగా అనిపించింది..’’.. అని నాగచైతన్య ఈ సినిమాతో తనకున్న మెమరీస్‌ని ఈ వీడియోలో పంచుకున్నారు.


ఇదే వీడియోలో చైతూ గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘చైతూతో కలిసి ఈ సినిమా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎటువంటి షాట్ చేయడానికైనా చైతన్య సిద్ధంగా ఉంటాడు. యూనిట్‌తో చక్కగా కలిసిపోయేవాడు. చైతూ తల్లిదండ్రులకు (నాగార్జున, లక్ష్మీ) ఫోన్ చేసి.. గర్వపడే కొడుకుని కన్నారని తెలిపాను. చైతూకి మంచి మనసుంది’’ అని తెలపగా.. ‘‘హిందీలో మొదటి చిత్రం చేస్తూ కూడా నాగచైతన్య ఎక్కడా ఇబ్బంది పడలేదు. హిందీ వచ్చిన నటులు కూడా కొన్నిసార్లు ఇబ్బందిపడుతుంటారు. కానీ చైతూలో ఆ ఇబ్బంది చూడలేదు. కామ్ గోయింగ్ పర్సన్’’ అని దర్శకుడు అద్వైత్ చందన్ అన్నారు. ఇంకా ఈ వీడియోలో చైతూ గురించి హెయిర్ డిజైనర్ అవన్ కాంట్రక్టర్, మేకప్ డిజైనర్ తరన్నుమ్ ఖాన్, కాస్ట్యూమ్ డిజైనర్ మాక్సిమా బసు కూడా చైతూతో తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. కాగా, తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు.





Updated Date - 2022-07-31T01:39:19+05:30 IST