కారుకురుచ్చి అరుణాచలం శతజయంతికి శతగాత్రాల నివాళి

ABN , First Publish Date - 2022-02-23T17:20:37+05:30 IST

సన్నాయి నాదస్వరమే మన దేశానికి, ముఖ్యంగా మన దక్షిణాదికి సుప్రభాతపు మేలుకొలుపు. గుమ్మానికి తోరణం, కర్ణపేయమైన నాదస్వరం ఉంటేనే అది మనకి శుభదినం. అటువంటి పరమ పవిత్రమైన నాదస్వర మహా విద్వాంసుడు కారుకురుచ్చి

కారుకురుచ్చి అరుణాచలం శతజయంతికి శతగాత్రాల నివాళి

సన్నాయి నాదస్వరమే మన దేశానికి, ముఖ్యంగా మన దక్షిణాదికి సుప్రభాతపు మేలుకొలుపు. గుమ్మానికి తోరణం, కర్ణపేయమైన నాదస్వరం ఉంటేనే అది మనకి శుభదినం. అటువంటి పరమ పవిత్రమైన నాదస్వర మహా విద్వాంసుడు కారుకురుచ్చి అరుణాచలం శతజయంతి సందర్భంగా తమిళనాడులో 100 మంది గాయనీగాయకులు ఒక ప్రసిద్ధ గీతాన్ని ఆలపించి ఆయనకి నివాళులు అర్పించారు. మహానటి సావిత్రి, జెమిని గణేశన్ జంటగా 1962 లో ఎమ్వీ రామన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా 'కొంజుం సలంగై'- తెలుగులోకి ‘మురిపించే మువ్వలు’ పేరిట డబ్ అయ్యింది. 'సింగారా వేలనె దేవా'( తెలుగులో 'నీ లీల పాడెద దేవా...') అనే సుప్రసిద్ధమైన పాటకి నాదస్వరాన్ని కూర్చిన  కారుకురుచ్చి అరుణాచలంకు ఘననివాళిగా ఆ పాటని 100 మంది గాయనీగాయకులు పాడారు.


కారుకురుచ్చి అరుణాచలం - అంటే ఈ తరానికి తెలియకపోవచ్చు. వినోదానికి, విజ్ఞానానికీ రేడియోనే ప్రధానసాధకంగా చేసుకున్న నిన్నటి తరం సంగీతాభిమానులకి ‘రేడియో సంగీత్ సమ్మేళన్’ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మద్రాసు ‘సంగీతోత్సవం’ కచ్చేరీలు ఎంత ప్రియమో,  కారుకురుచ్చి అరుణాచలం, టి.ఆర్.మహాలింగం, చెంబై వైద్యనాథ భాగవతార్ వంటి మహామహుల సంగీతం అంతే ప్రాణం. అలనాటి సినిమాలకి కూడా అరుణాచలం తన నాదస్వరామృతాన్ని పంచారు.


'కొంజుం సలంగై' మహానటి సావిత్రి వందో సినిమా. కథానాయకుడు నాదస్వర విద్వాంసుడు. అతని సన్నాయి సంగీతం నాయిక గాత్రంతో పోటీపడుతుంది. అతనికి ఏమాత్రం తగ్గకుండా, నాదస్వరానికి పోటీగా స్వరాన్ని నిలబెట్టగలిగిన గాయని కోసం సాగిన అన్వేషణ- అప్పుడప్పుడే నేపథ్యగాయనిగా నిలదొక్కుకుంటున్న 23 ఏళ్ళ ఎస్ జానకి దగ్గర ఆగింది. గొంతులో ఆర్తి, నివేదన ఏమాత్రం తగ్గకుండా, సన్నాయితో పోటీ పడుతూ అటు తమిళం లోనూ, ఇటు తెలుగులోనూ పాడగలిగే సుస్వరాల గాయని మన జానకమ్మే మరి. తమిళంలో 'సింగారా వేలనె దేవా'- కురుచ్చి మనిముత్తు బాలసుబ్రమణియం రచిస్తే,  తెలుగులో 'నీ లీల పాడెద దేవా...' ఆరుద్ర రాశారు. ఎస్ ఎం సుబ్బయ్య నాయుడు స్వరకర్త. ఆ పాటకి కారుకురుచ్చి అరుణాచలం నాదస్వరమే ప్రాణం. ఆ పాటని ఆలపించడమే ఆ నాదస్వర  విద్వాంసునికి శతజయంతి నివాళి అని  భావించిన తమిళ గాయనీగాయకుల బృందం పూనుకొని ఆలపించింది.



Updated Date - 2022-02-23T17:20:37+05:30 IST