Case filed: ఒకే కారణంతో ఆమీర్‌ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, తాప్సీ పన్ను ‘శభాష్ మిథు’పై కేసులు.. అదేంటంటే..

ABN , First Publish Date - 2022-08-24T23:03:04+05:30 IST

ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా(Laal Singh Chaddha)’, తాప్సీ పన్ను ‘శభాష్ మిథు(Shabaash Mithu)’ ఒకే కారణంతో కేసులు నమోదైయ్యాయి...

Case filed: ఒకే కారణంతో ఆమీర్‌ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, తాప్సీ పన్ను ‘శభాష్ మిథు’పై కేసులు.. అదేంటంటే..

ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా(Laal Singh Chaddha)’, తాప్సీ పన్ను ‘శభాష్ మిథు(Shabaash Mithu)’ ఒకే కారణంతో కేసులు నమోదైయ్యాయి. ఆ సినిమాల్లో దివ్యాంగులను ఎగతాళి చేసినందుకుగానూ ఆ రెండు చిత్రాలపై వికలాంగుల కమిషనర్‌ కోర్టులో రెండు చిత్రాలపై ఫిర్యాదు దాఖలైంది. డాక్టర్స్ విత్ డిజేబిలిటీస్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ సతేంద్ర సింగ్ (Satendra Singh) ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఆయన కూడా 70% లోకోమోటర్ వైకల్యంతో బాధపడుతున్నారు. వికలాంగుల హక్కుల చట్టం 2016లోని నిబంధనలను ఉల్లంఘిస్తూ దివ్యాంగులను కించపరిచే డైలాగ్స్, సన్నివేశాలు ఆ రెండు సినిమాల్లో ఉన్నట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.


డాక్టర్ సతేంద్ర సింగ్ ఫిర్యాదు చేసిన తర్వాత ఆ మూవీస్ మేకర్స్‌కి వికలాంగుల కమిషనర్ కోర్టు జారీ చేసిన నోటీసు కాపీని పంచుకున్నారు. అయితే సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఈ విషయంపై ఎటువంటి ధృవీకరణను అందించలేదు. నోటీసు ప్రకారం, లాల్ సింగ్ చడ్డా, శభాష్ మిథు డైరెక్టర్లు, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసుపై స్పందించాలని కోర్టు ఆదేశించింది.


ఈ రెండు చిత్రాల్లో ‘లాంగ్డే/లాంగ్డీ (అంటే తెలుగులో వికలాంగుడు)’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఫిర్యాదులో ప్రశ్నించింది. ఫిర్యాదుదారు ప్రకారం.. ఆ పదాన్ని వైకల్యాన్ని సూచించడానికి బదులుగా ఉద్దేశపూర్వకంగా ఒకరిని కించపరిచేందుకు ఉపయోగిస్తారు. అందుకే 30 రోజుల్లోగా తమ స్పందనలను సమర్పించాలని మేకర్స్‌ను కోర్టు ఆదేశించింది.


‘లాల్ సింగ్ చడ్డా’లో ఆమీర్ డిసబుల్డ్ పర్సన్‌గా నటించాడు. అందులో ఓ సన్నివేశంలో భాగంగా.. ఓ రౌడీ గుంపు ఆమీర్‌తో గొడవపడుతుంది. అందులో భాగంగా.. ఆ గుంపులో ఒకడు ‘పకడ్ లాంగ్డే కో(తెలుగులో వికలాంగుడిని పట్టుకోండి)’ అని అంటాడు. అలాగే.. భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు మాజీ టెస్ట్, వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా రూపొందించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘శభాష్ మిథు’. అందులో ప్రధానపాత్రలో తాప్సీ పన్ను నటించింది. ఈ చిత్రంలోని ఒక పాటలో.. ‘అత్కి జో తంగడి, గోల్ గట్టం ఖలీ, హో గయీ లంగడి (నేను త్రిప్పినట్లు ప్రపంచం తిరుగుతుంది, కుంటపడదు)’ అని ఉంటుంది. ఈ రెండింటి ఆధారంగా దివ్యాంగులను కించపరిచారని సతేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - 2022-08-24T23:03:04+05:30 IST