ఇందులో ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం: నిర్మాత సి. క‌ళ్యాణ్‌

ABN , First Publish Date - 2021-12-08T23:16:09+05:30 IST

ప్రస్తుతం సినీ పరిశ్రమకి ఒక తండ్రి ఇక్కడ ఉన్నారు.. మరో తండ్రి అక్కడ ఉన్నారు. ఏ కష్టం వచ్చినా ముందుగా ఈ తండ్రి వద్దకే వెళ్తున్నాం. సినిమా వాళ్లదంతా ఏ రోజు హడావిడి ఆ రోజుదే. ఇద్దరు సీఎంలను ఒకే చోటకు తీసుకొచ్చి..

ఇందులో ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం: నిర్మాత సి. క‌ళ్యాణ్‌

ఎన్ని జీవోలు వచ్చినా సరే ప్రేక్షకుడికి సినిమా కావాలని అఖండ నిరూపించిందని, సినిమా అనేది చిన్న పరిశ్రమే కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని అన్నారు నిర్మాత సి. క‌ళ్యాణ్‌. సి.కె. స్ర్కీన్స్ బ్యానర్‌పై స‌త్య‌దేవ్ హీరోగా గోపీ గణేష్‌ ద‌ర్శ‌క‌త్వంలో ‘గాడ్సే’ అనే చిత్రాన్ని ఆయన నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. డిసెంబ‌రు 9 నిర్మాత సి. క‌ళ్యాణ్ పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా ఆయన ‘గాడ్సే’ చిత్ర వివరాలతో పాటు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై మీడియాతో ముచ్చ‌టించారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం సినీ పరిశ్రమకి ఒక తండ్రి ఇక్కడ ఉన్నారు.. మరో తండ్రి అక్కడ ఉన్నారు. ఏ కష్టం వచ్చినా ముందుగా ఈ తండ్రి వద్దకే వెళ్తున్నాం. సినిమా వాళ్లదంతా ఏ రోజు హడావిడి ఆ రోజుదే. ఇద్దరు సీఎంలను ఒకే చోటకు తీసుకొచ్చి సత్కరిద్దామని అనుకున్నాం. కానీ అది కుదర్లేదు. ముందుకు నడిపించే వ్యక్తి లేకుండాపోయారు. పరిశ్రమ మీద ఎలాంటి రూల్స్ తెచ్చినా సినిమా వాళ్లు ముందుకు రారు. ఈ రోజు 39డి అనే కొత్త సెక్షన్ రాబోతోంది. అందరూ కలిసి రండి పోరాడుదామంటే ఎవ్వరూ రావడం లేదు. ఎవ్వరి డబ్బులు వారికి వచ్చేస్తున్నాయ్.. ఎటొచ్చి నిర్మాతలకే కదా? నష్టం. కష్టం వచ్చినప్పుడే దాసరిగారు లేని లోటు తెలుస్తోందని అంటున్నారు. ఒకప్పుడు నిర్మాతలు ఇలా ఉండేవారు కాదు. ఇప్పుడు మాత్రం హిట్ కాంబినేషన్‌కే డిమాండ్ ఉంది. ఇప్పుడంతా ఫిగర్స్ గేమ్.


గాడ్సే సినిమా నేటితో షూటింగ్ పూర్త‌య్యింది. జనవరి 26న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా తర్వాత ఈ చిత్ర దర్శకుడు గోపీ గణేష్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక నా హీరో సత్యదేవ్‌తోనూ ఇంకో సినిమా చేస్తాను. గాడ్సే తరువాత సత్యదేవ్‌కు చాలా మంచి పేరు వస్తుంది. సినిమా చూశాను. ఇంత మంచి సినిమాకు నిర్మాతగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. అందరినీ మేల్కొలిపే చిత్రం. ఇందులో అందరి సమస్యలు చూపిస్తాం. అమ్మనాన్నలు కష్టపడి చదివిస్తే.. చదువుకుని ఏదో చేద్దామని అనుకుని ఏం చేయకుండా స్ట్రగుల్ అయ్యే ప్రతీ ఒక్కడి సమస్య. ప్రభుత్వాలు ఎలా ఆడుకుంటున్నాయ్.. నిరుద్యోగం ఏంటి? ప్రభుత్వాలను ప్రశ్నించే పాయింట్ మీద వస్తుంది. దర్శకుడు ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశాడో.. హీరో అంత అద్భుతంగా చేశాడు. ఇద్ద‌రికీ మంచి పేరు వస్తుంది. గాడ్సే క్యారెక్టర్ కొత్త‌గా ఉంటుంది. తమిళ నాడు నాకు ఓ మంచి బహుమతి ఇచ్చింది. ఆ గిఫ్ట్ ఏమిటో త్వరలోనే మీ అందరితో పంచుకుంటాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన కళ్యాణ్ ఏం చేయబోతోన్నాడో చూపిస్తాను. మా బ్యాన‌ర్‌లో రానా న‌టిస్తున్న 1945 సినిమాకి సంబంధించి వారంలో టీజర్, రెండు మూడు రోజుల్లో ఫస్ట్ లుక్ వస్తుంది. అది పీరియాడిక్ డ్రామా. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది...’’ అని తెలిపారు. 

Updated Date - 2021-12-08T23:16:09+05:30 IST