Bollywood : బ్రహ్మాస్త్రం.. బ్రహ్మాండాస్త్రమైంది !

ABN , First Publish Date - 2022-09-12T16:00:39+05:30 IST

కాలం మారుతున్న కొద్దీ డబ్బు విలువ తగ్గుతుంది. కానీ బాక్సాఫీస్ వసూళ్ళ విషయంలో మాత్రం రోజు రోజుకూ లెక్క పెరగడమే తప్ప.. తగ్గడం అన్నది ఉండదు. అయితే కరోనా కారణంగా హిందీ సినిమాల పరిస్థితి దీనికి భిన్నంగా తయారైంది. అక్కడ ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ 30 నుంచి 40 కోట్లు రావడం చాలా కామన్.

Bollywood : బ్రహ్మాస్త్రం.. బ్రహ్మాండాస్త్రమైంది !

కాలం మారుతున్న కొద్దీ డబ్బు విలువ తగ్గుతుంది. కానీ బాక్సాఫీస్ వసూళ్ళ విషయంలో మాత్రం రోజు రోజుకూ లెక్క పెరగడమే తప్ప.. తగ్గడం అన్నది ఉండదు. అయితే కరోనా కారణంగా హిందీ సినిమాల పరిస్థితి దీనికి భిన్నంగా తయారైంది. అక్కడ ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ 30 నుంచి 40 కోట్లు రావడం చాలా కామన్. కానీ కరోనా తర్వాత ఓడలు బళ్ళయిన సామెతను గుర్తుకు తెస్తోంది బాలీవుడ్ (Bollywood). తొలిరోజు వసూళ్ళు మరీ దారుణంగా 10, 20 శాతానికి పడిపోయాయి. 10 కోట్లు దాటితేనే మురిసిపోయే పరిస్థితి ఇప్పుడు. దానికి తోడు.. ‘బాహుబలి (Bahubali), కేజీఎఫ్ (KGF), ఆర్.ఆర్.ఆర్ (RRR), పుష్ప (Pushpa), కార్తికేయ 2 (Karthikeya 2)’ లాంటి సినిమాలు బాలీవుడ్ జనం కుళ్ళుకొనే రేంజ్‌లో భారీ వసూళ్ళు సాధించాయి. కారణాలు పక్కన పెడితే.. మళ్ళీ బాలీవుడ్‌కు పూర్వవైభవం రాదేమోననే భయాలు పట్టుకున్నాయి. 


కానీ ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) సినిమా బాలీవుడ్‌ను మళ్ళీ తలెత్తుకొనేలా చేసింది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ కలుపుకొని దాదాపు రూ. 75 కోట్లు వసూళ్ళు రాబట్టింది ‘బ్రహ్మాస్త్ర’. రెండో రోజు కూడా తగ్గలేదు. డివైడ్ టాక్ ను తట్టుకొని నిలబడ్డ ఈ సినిమా శనివారం ఓవరాల్ గా రూ. 50 కోట్ల వరకూ వసూళ్ళు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల వారి అంచనా. ఆదివారం కూడా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరిగాయి. తొలి రోజులకు దీటుగా మూడో రోజు వసూళ్ళు వచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఆల్రెడీ రూ. 100 కోట్ల మార్కును దాటేసి ఇప్పుడు రూ. 200 కోట్ల వైపుకు దూసుకుపోతోంది. వీకెండ్ అయ్యాకా మేజర్ డ్రాప్స్ లేకపోతే సినిమా పుంజుకున్నట్టే లెక్క. 


విడుదలకు ముందు బ్యాయ్ కాట్ బ్యాచ్ నుంచి విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొని, రిలీజ్ తర్వాత డివైడ్ టాక్ ను తట్టుకొని సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోందంటే గొప్ప విషయమే. ‘బ్రహ్మాస్త్ర’ రిజల్ట్ కచ్చితంగా బాలీవుడ్ కు గొప్ప రిలీఫ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. రణబీర్ కపూర్ (Ranabeer Kapoor), ఆలియాభట్ (Alia Bhatt), అమితాబ్ బచ్చన్ (Amitab Bachan), నాగార్జున (Nagarjuna) తదితరులు నటించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ (Ayan Mukharji) తెరకెక్కించాడు. మూడు భాగాల ఫ్రాంచైజీలో మొదటి భాగంగా విడుదలైన ‘శివ’ (Shiva) .. మిగతా రెండు భాగాలు తెరకెక్కడానికి మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు.  మొత్తం మీద సౌత్ దెబ్బకు విలవిలలాడిన బాలీవుడ్‌కు ‘బ్రహ్మాస్త్రం’ సినిమా బ్రహ్మాండాస్త్రంగా పనిచేసిందన్నమాట. 

Updated Date - 2022-09-12T16:00:39+05:30 IST