Brahmastra: ఫ్లాప్ టాక్ వచ్చినా.. ఆ హిట్ సినిమా రికార్డు బద్దలు..

ABN , First Publish Date - 2022-09-18T17:52:25+05:30 IST

బాలీవుడ్‌‌తో దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం ‘బ్రహ్మాస్త (Brahmastra) పార్ట్ వన్: శివ’...

Brahmastra: ఫ్లాప్ టాక్ వచ్చినా.. ఆ హిట్ సినిమా రికార్డు బద్దలు..

బాలీవుడ్‌‌తో దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం ‘బ్రహ్మాస్త (Brahmastra) పార్ట్ వన్: శివ’. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహారించాడు. దాదాపు రూ.410 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలై ఫ్లాప్ టాక్‌ని మూటగట్టుకుంది. అయినా.. బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టుకుంటూ వెళుతోంది. ఇంతకుముందే మొదటి మూడు రోజుల్లో దాదాపు రూ.125 కోట్లు కొల్లగొట్టిన మొదటి బాలీవుడ్ చిత్రంగా నిలవగా.. తాజాగా మరో హిట్ సినిమా రికార్డుని ఈ ఫ్లాప్ సినిమా బద్దలు కొట్టింది.


ఈ ఫాంటసీ అడ్వెంచర్ ఇతిహాసం కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘భూల్ భూలయ్యా 2 (Bhool Bhulaiyaa 2)’ జీవితకాల కలెక్షన్లను అధిగమించింది. ‘ది కాశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files)’ మూవీ తర్వాత ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో హిందీ చిత్రంగా నిలిచింది. దీనికి సంబంధించి వివరాలను ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కాడెల్ ట్విట్టర్‌లో తాజాగా షేర్ చేశాడు. ఈ మూవీ రెండో శనివారం 45 నుంచి 50% గణనీయమైన వృద్ధితో రూ.14.50 నుంచి రూ.15.50 కోట్లు వసూలు చేసిందని అంచనా వేశాడు.


సుమిత్ చేసిన ట్వీట్‌లో.. ‘బ్రహ్మాస్త మూవీ రెండో శనివారం కలెక్షన్లలో 45 నుంచి 50% వరకూ గణనీయమైన వృద్ధిని చూపించింది. అంచనాల ప్రకారం రిలీజైన తొమ్మిదో రోజు రూ.14.50-15.50 కోట్ల నికర వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ భూల్ భూలయ్యా 2 మూవీ జీవిత కాల కలెక్షన్లని దాటేసి ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో హిందీ చిత్రంగా నిలిచింది’ అని రాసుకొచ్చాడు.


కాగా.. భారీ వీఎఫ్‌ఎక్స్‌తో గ్రాండియర్‌గా తెరకెక్కిన భారీ బడ్జెట్ ఫాంటసీ చిత్రం మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అది ఈ ఏడాది మేలో విడుదలైన భూల్ భూలయ్యా 2 జీవితకాల వసూళ్లు రూ.266 కోట్ల కంటే ఎక్కువ. దీనికంటే ముందు రూ.340 కోట్లతో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మొదటి స్థానంలో ఉంది. అలాగే భారతదేశం విషయానికి వస్తే.. ‘భూల్ భూలయ్యా 2’ దేశవ్యాప్తంగా రూ.185 కోట్లు రాబట్టగా.. ‘బ్రహ్మాస్త’ కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.197 కోట్లు కొల్లగొట్టింది. కాగా.. ఈ సినిమా కంటే ముందే రూ.297 కోట్లతో ది కాశ్మీర్ ఫైల్స్ మాత్రమే ఉంది. ఈ అస్త్రవర్స్‌లోని రెండో భాగం ‘బ్రహ్మాస్త్ర పార్ట్ టూ:దేవ్’ ని డిసెంబర్ 2025లో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.



Updated Date - 2022-09-18T17:52:25+05:30 IST