Brahmaji: అది ఆయన గ్రాటిట్యూడ్‌

ABN , First Publish Date - 2022-08-15T23:54:50+05:30 IST

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీకి.. బ్రహ్మాజీకి పరిచయం ఎలా ఏర్పడింది. ఇద్దరూ స్నేహితులు ఎలా అయ్యారు. ఇప్పటికీ బ్రహ్మాజీ అంటే కృష్ణవంశీకి కృతజ్ఞతాభావం ఎందుకు? బ్రహ్మాజీ హీరో ఎలా అయ్యారు? ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు బ్రహ్మాజీ. తాజాగా ఆయన ‘ఓపెన్‌ హార్డ్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణవంశీ గురించి బ్రహ్మాజీ చెప్పుకొచ్చిన సంగతులివి...

Brahmaji: అది ఆయన గ్రాటిట్యూడ్‌

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీకి.. బ్రహ్మాజీకి (Brahmaji)పరిచయం ఎలా ఏర్పడింది. 

ఇద్దరూ స్నేహితులు ఎలా అయ్యారు. 

ఇప్పటికీ బ్రహ్మాజీ అంటే కృష్ణవంశీకి(Krishna vamsi) కృతజ్ఞతాభావం ఎందుకు? 

బ్రహ్మాజీ హీరో ఎలా అయ్యారు? 

ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు బ్రహ్మాజీ. 

తాజాగా ఆయన ‘ఓపెన్‌ హార్డ్‌ విత్‌ ఆర్కే’ (Open heart with rk)కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణవంశీ గురించి బ్రహ్మాజీ చెప్పుకొచ్చిన సంగతులివి...


చెన్నైలో ఓ ఆసక్తికరమైన బిల్డింగ్‌ ఉండేది. అందులో వందల గదులు ఉండేవి. దాన్ని పూర్ణ కళ్యాణమండపం అంటారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ శిక్షణ కోసం కోర్సులు చదివేవాళ్లతో పాటు సినిమా వాళ్లు అక్కడ ఉండేవారు. చిన్న బాత్రూమ్‌ సైజ్‌ ఉండే రూమ్స్‌లో ఎల్‌ షేప్‌లో బెడ్‌ ఉండేది. ఒక్కో గదిలో ఇద్దరం ఉండేవాళ్లం. ఒక్కోరు 125 రూపాయలు చెల్లించేవాళ్లం. ఇకపోతే.. పాండీబజార్‌లో ఓ అడ్డాకు కృష్ణవంశీ వచ్చేవాడు. అక్కడే ఆయనతో పరిచయం. సాయంత్రంపూట కబుర్లు చెప్పుకునేవాళ్లం. దీంతోపాటు వంశీ వాళ్లది తాడేపల్లిగూడెం కాబట్టి.. మేం దగ్గరయ్యాం. అన్నపూర్ణ సంస్థవాళ్లు ‘శివ’ చిత్రం కోసం కొత్తవారికి అవకాశం ఇస్తున్నారని ఓసారి కృష్ణవంశీ నాకు చెప్పారు. నా బైక్‌లో కృష్ణవంశీని ఎక్కించుకుని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లా. కళ్లజోడు పెట్టుకున్న ఒకతను శివనాగేశ్వరరావు గారితో టీ తాగి లోపలికి వెళ్తున్నాడు. శివనాగేశ్వరావుతో మన స్నేహితుడే అని వంశీ నా గురించి చెబితే ఫొటోలు ఆయనకు ఇచ్చా. ఆర్జీవీగారు ‘ఫొటోలతో ఉపయోగం ఏముంది. ఆడిషన్‌ చేయించండి’ అన్నారట. ఒకరోజు అక్కడికి వెళితే దర్శకుడు తేజ.. ఆడిషన్‌ తీసుకుని తర్వాత చెబుతామన్నారు. మరో రోజు  పిలిచి.. ‘చిన్న వేషం’ ఉందన్నారు. అలా ఆ సినిమాకు నటుడిగా నేను.. అసిస్టెంట్‌ డైరక్టర్‌గా వంశీ చేరాడు. అప్పుడే ‘దర్శకుడయ్యాక మంచి వేషం కచ్చితంగా ఇస్తాన’న్నారు. అలా ‘గులాబి’లో వేషం ఇచ్చారు.




కొందరైతే అలా చెప్పరు...

చెన్నైలో కృష్ణవంశీ చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంటినుంచి డబ్బులొచ్చేవి కాబట్టి నేను హ్యాపీ. ఓరోజు కృష్ణ వంశీ నా దగ్గరకు వచ్చినప్పుడు భోజనం చేయమన్నా. నాతోపాటే తిన్నాడు. అప్పటికి తను రెండు రోజుల నుంచి  భోజనం చేయలేదట. ఆ విషయం నాకు తెలీదు. వాస్తవానికి నేను ఆ రోజు భోజనం పెట్టడం పెద్ద గొప్పేమీ కాదు. అది రుణం అనుకుంటే నన్ను పిలిచి ఓ అవకాశం ఇచ్చి సరిపెట్టుకోవచ్చు. నన్ను గుర్తు పెట్టుకున్నాడు. ఏకంగా నన్ను హీరోగా పెట్టి ‘సింధూరం’ సినిమా చేశారు. అది ఆయన గ్రాటిట్యూడ్‌. చాలా మంది ఇలాంటి విషయాలను బయటికి చెప్పడానికి ఇష్టపడరు. పుట్టడమే జమీందార్లుగా పుట్టామంటారు. ఆ రోజు భోజనం పెట్టిన విషయం ఈ రోజుకీ గుర్తు గుర్తుపెట్టుకున్నారు. కొందరైతే మంచి పొజిషన్‌కి వచ్చాక అవాయిడ్‌ చేస్తారు. కానీ కృష్ణ వంశీ అలా చేయలేదు. మంచి ఆఫర్లు ఇచ్చాడు. ఇప్పటికీ నాతో స్నేహం కొనసాగిస్తూనే ఉన్నాడు. 


Updated Date - 2022-08-15T23:54:50+05:30 IST