రూ.3000 కోట్ల టార్గెట్.. థియేటర్లలో క్యూ కడుతున్న సినిమాలు.. సీన్ రిపీట్ కాబోతోందా..?

ABN , First Publish Date - 2021-12-03T16:43:41+05:30 IST

కరోనా... ఈ పేరు పోయిన సంవత్సరం మొదట్లో అందరికీ కొత్తే. కానీ, ఇప్పుడు అందరి జీవితాల్లో భాగమైపోయింది. ఒకప్పుడు భయపడ్డంతగా ఇప్పుడు బెదిరిపోవటం కూడా మానేశారు జనాలు. కానీ, కరోనా సత్తా తగ్గిందా? లేదు!

రూ.3000 కోట్ల టార్గెట్.. థియేటర్లలో క్యూ కడుతున్న సినిమాలు.. సీన్ రిపీట్ కాబోతోందా..?

కరోనా... ఈ పేరు పోయిన సంవత్సరం మొదట్లో అందరికీ కొత్తే. కానీ, ఇప్పుడు అందరి జీవితాల్లో భాగమైపోయింది. ఒకప్పుడు భయపడ్డంతగా ఇప్పుడు బెదిరిపోవటం కూడా మానేశారు జనాలు. కానీ, కరోనా సత్తా తగ్గిందా? లేదు! మళ్లీ మళ్లీ పేర్లు మార్చుకుని వచ్చేస్తోంది. కోవిడ్ 19 కాస్తా డెల్టా వేరియెంట్ అయింది. ఇఫ్పుడు ఓమిక్రాన్‌గా వణుకు పుట్టిస్తోంది. మరి ఇప్పటికే రెండు లాక్ డౌన్లు పూర్తయ్యాయి. మూడో లాక్ డౌన్ కూడా తప్పదా? ఆ సంగతి మనం ఇప్పుడే చెప్పలేం. కానీ, మరోసారి రోడ్లన్నీ నిర్మానుష్యం అయితే సినిమా రంగానికి ‘హారర్ సినిమా’ కనిపించటం గ్యారెంటీ! ఇంకోసారి థియేటర్లు మూత పడితే భారతీయ సినిమాకి కలిగే నష్టం ఎంత? కొందరి అంచనా ప్రకారం మూడు వేల కోట్ల పైమాటేనట!


అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్ జంటగా రూపొందిన ‘సూర్యవంశీ’ దేశ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలై మంచి కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఆ జోష్‌ను కంటిన్యూ చేసే బాధ్యత వరుసగా విడుదల కానున్న సినిమాలపై ఉంది. 2021 చివరి నెల డిసెంబర్‌లో... మొదటి సినిమాగా ‘తడప్’ విడుదలవుతోంది. డిసెంబర్ 3న బాక్సాఫీస్‌ని చేరే ఈ చిత్రం మన ‘ఆర్ఎక్స్ 100’కి హిందీ రీమేక్. సీనియర్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘తడప్’పై 70 కోట్లకు వరకూ వసూలు చేస్తుందని అంచనాలున్నాయి. 


డిసెంబర్ 10వ తేదీన ‘ఛంఢీఘర్ కరే ఆశికీ’ 45 కోట్ల అంచనాతో బరిలోకి దిగబోతోంది. 16వ తేదీన రిలీజ్ అవుతోన్న హాలీవుడ్ మూవీ ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ 125 కోట్ల వరకూ రాబట్టవచ్చు. అలాగే, 24న ‘83’, 31న ‘జెర్సీ’ సినిమాలు జనం ముందుకొస్తున్నాయి. వీటిపై కూడా 150 కోట్ల చొప్పున అంచనాలున్నాయి. 


2022 జనవరిలో ‘ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, పృథ్వీరాజ్’ లాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిపై కూడా 150 నుంచీ 200 కోట్ల మధ్య కలెక్షన్స్ అంచనాలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో ‘బధాయి దో, గంగూభాయ్ కతియావాడి, జయేశ్ భాయ్ జోర్దార్’ సినిమాలు క్యూలో ఉన్నాయి. ఈ సినిమాలు 75-100 కోట్ల ఎక్స్‌పెక్టేషన్స్‌తో రూపొందాయి. మార్చ్ విషయానికి వస్తే... ‘బచ్చన్ పాండే, షంషేరా, భూల్ భులయ్యా 2, అనేక్‘ సినిమాలు 100 నుంచీ 200 కోట్ల క్లబ్‌లో చేరే సూచనలున్నాయి. అయితే, ఈ లెక్కలన్నీ ఆయా సినిమాలకు వచ్చే పాజిటివ్ టాక్ మీదే ఆధారపడి ఉంటాయి. తొలి ఆటకే నెగటివ్ టాక్ వస్తే... ఇప్పుడు వినిపిస్తోన్న అంచనాల్లో సగం కూడా వసూలు చేయకపోవచ్చు...


సినిమా ఇండస్ట్రీకి బాక్సాఫీస్ సమ్మర్ సీజన్‌గా భావించే ఏప్రెల్ నెలలో చాలా సినిమాలే వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ‘ధక్కడ్, కేజీఎఫ్2, లాల్ సింగ్ చద్దా, హీరోపంతి 2, రన్‌వే 34’ ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఏప్రెల్ రిలీజెస్. వీటిపై కనిష్టంగా 60 కోట్ల నుంచీ గరిష్టంగా 200 కోట్లు బాలీవుడ్ బాక్సాఫీస్ ఆశిస్తోంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ సినిమాలు మరింతగా కూడా వసూలు చేయవచ్చు. మె నెలలో ‘మిషన్ మజ్నూ, మైదాన్’ బరిలో దిగనుండగా, జూన్‌లో ‘జుగ్ జుగ్ జీయో’ ఆడియన్స్‌ను అలరించనుంది. ఈ సినిమాలపై 70 కోట్ల మొదలు 125 కోట్ల దాకా అంచనాలు వినిపిస్తున్నాయి. 


2021 డిసెంబర్ నుంచీ 2022 జూన్ దాకా చాలా క్రేజీ సినిమాలే క్యూలో ఉన్నాయి. అయితే, వీటిపై జరగాల్సిన బిజినెస్ మొత్తం 3 వేల కోట్లకు పైమాటే. సినిమాల కలెక్షన్స్ అలా ఖచ్చితంగా ఇంత అంటూ చెప్పలేం కానీ... అటుఇటుగా నెక్ట్స్ సిక్స్ మంత్స్‌లో బాలీవుడ్ మూడు వేల కోట్లు బాక్సాఫీస్ నుంచీ రాబట్టుకోవాలి. అప్పుడే మున్ముందు పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. లేదంటే మరోసారి ఓటీటీల దూకుడు పెరిగిపోవచ్చు. మధ్యలో ఓమిక్రాన్ లాంటి గండాలు ఎదురై మూడో లాక్ డౌన్ అడ్డుపడితే థియేటర్ల పరిస్థితి మరింత దయనీయం అవుతుంది. వీలైనన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ బాట పట్టేస్తాయి. అలా జరగకూడదనే ప్రస్తుతం పరిశ్రమలోని వారు కోరుకుంటున్నారు. చూద్దాం మరి, రాబోయే రోజులు హిందీ వెండితెరకి ఎలా కొనసాగనున్నాయో...   

Updated Date - 2021-12-03T16:43:41+05:30 IST