‘భీమ్లా నాయక్’ దెబ్బకి తలొగ్గిన ‘బుక్ మై షో’.. జోరుగా బుకింగ్స్

ABN , First Publish Date - 2022-02-22T23:35:14+05:30 IST

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’.. ‘భీమ్లా నాయక్’ దెబ్బకి దిగిరాక తప్పలేదు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ‘బుక్ మై షో’ ద్వారా కాకుండా.. డైరెక్ట్‌గా థియేటర్ల వద్దే టికెట్ తీసుకోవాలని..

‘భీమ్లా నాయక్’ దెబ్బకి తలొగ్గిన ‘బుక్ మై షో’.. జోరుగా బుకింగ్స్

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’.. ‘భీమ్లా నాయక్’ దెబ్బకి దిగిరాక తప్పలేదు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ‘బుక్ మై షో’ ద్వారా కాకుండా.. డైరెక్ట్‌గా థియేటర్ల వద్దే టికెట్ తీసుకోవాలని.. చిత్ర నైజాం డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనికి కారణం సర్వీస్ ఛార్జెస్, ఇంటర్నెట్ హ్యాండిలింగ్ ఛార్జెస్ అంటూ.. టికెట్ ధరకి అదనంగా ‘బుక్ మై షో’  11 శాతం ఛార్జీలు వసూలు చేస్తుండటంతో.. ప్రేక్షకులకు ఇది భారం అవుతుంది. దీనిని తగ్గించుకోవాలంటూ డిస్ట్రిబ్యూటర్లు కోరినా.. ‘బుక్ మై షో’ సంస్థ పట్టించుకోలేదు. దీంతో నైజాం ఏరియా వైజ్‌గా ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ‘బుక్ మై షో’ ద్వారా కాకుండా డైరెక్ట్‌గా థియేటర్ల కౌంటర్లలోనే టికెట్లు అమ్మాలని నిర్మాత దిల్ రాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు.


ఈ నిర్ణయంతో ప్రేక్షకులు కాస్త ఇబ్బంది పడినప్పటికీ టికెట్ భారం తగ్గుతుందనే ఆలోచనతో పాటు, బుక్ మై షో‌ సంస్థకి కూడా తగిన గుణపాఠం చెప్పినట్లు అవుతుందని భావించిన దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి నానా కష్టాలు పడుతుంటే.. మధ్యలో ఇలా ఆ ఛార్జీ, ఈ ఛార్జీ అంటూ మరింత భారం మోపడం భావ్యం కాదనేది వారి అభిప్రాయం. అయితే పూర్తిగా ఆ ఛార్జీలను తీసివేయమనేం చెప్పలేదు.. కాస్త తగ్గించుకోమని మాత్రం కోరారు. అయితే ‘బుక్ మై షో’ సంస్థ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. థియేటర్లలోనే టికెట్లు అమ్మేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ విషయం ప్రేక్షకులకు కూడా చేరువయ్యేలా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. 


దీంతో.. ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాన్ని మిస్ అయితే.. భారీగా నష్టపోవడం ఖాయం అని భావించిన ‘బుక్ మై షో’ సంస్థ.. తలొంచక తప్పలేదు. నిర్మాత దిల్ రాజుతో చర్చలు జరపడమే కాకుండా.. ఆయన విధించిన డిమాండ్స్‌కి కూడా ‘బుక్ మై షో’ సంస్థ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. సర్వీస్ ఛార్జీలను 11 శాతం కాకుండా, థియేటర్లని బట్టి 5 లేదంటే 6 శాతానికి తగ్గించేలా ‘బుక్ మై షో’ సంస్థ అంగీకరించినట్లుగా సమాచారం. చర్చలు సఫలం అవడంతో.. వెంటనే ఆ సంస్థ ‘భీమ్లా నాయక్’కు బుకింగ్స్ ఓపెన్ చేసింది. అలా ఓపెన్ చేశారో లేదో.. హాట్ కేకులా అన్నీ ‘సోల్డ్ అవుట్’ బోర్డులే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘బుక్ మై షో’లో ‘భీమ్లా నాయక్’‌కు యమా జోరుగా బుకింగ్స్ నడుస్తున్నాయి. ‘బుక్ మై షో’ బుకింగ్ ఓపెన్ అవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం నైజాం వరకేనా.. లేక అంతటా వర్తిస్తుందా? అనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు.

Updated Date - 2022-02-22T23:35:14+05:30 IST