‘అల వైకుంఠపురములో’ థియేటర్స్‌లో విడుదలయితే.. ‘షాహ్‌జాదా’ నుంచి తప్పుకుంటానన్న బాలీవుడ్ యంగ్ హీరో

ABN , First Publish Date - 2022-01-25T17:00:19+05:30 IST

ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రిమేక్ చేయడం మామూలే...

‘అల వైకుంఠపురములో’ థియేటర్స్‌లో విడుదలయితే.. ‘షాహ్‌జాదా’ నుంచి తప్పుకుంటానన్న బాలీవుడ్ యంగ్ హీరో

ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రిమేక్ చేయడం మామూలే. అలా సౌత్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఎన్నో సినిమాలు బాలీవుడ్‌లో కూడా రిమేక్ అయ్యాయి. తాజాగా టాలీవుడ్‌లో రెండేళ్ల క్రితం మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా సైతం అక్కడ ‘షాహ్‌జాదా’గా రిమేక్ అవుతోంది. ఆ సినిమాలో బాలీవుడ్ యువ నటుడు కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు.


అయితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’.. అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హిందీ ప్రేక్షకులైతే బ్రహ్మరథం పట్టారు. దీంతో అక్కడ కూడా ఐకాన్ స్టార్‌కి మంచి పాపులారిటీ వచ్చింది. దీంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి రెండేళ్ల క్రితం వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్స్‌లో విడుదల చేయాలని ప్రొడ్యూసర్ మనీష్ షా అనుకున్నారు. నిజానికి దీన్ని జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ ‘షాహ్‌జాదా’ నిర్మాతలతో చర్చల తర్వాత ఆ ప్రయత్నాన్ని ఆపేశారు.


‘ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్‌ని థియేటర్స్‌లో విడుదల చేయడానికి ‘షాహ్‌జాదా’ నిర్మాతలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తే సినిమా నుంచి తప్పుకుంటానని కార్తీక్ ఆర్యన్ అన్నాడట. అదే జరిగితే మాకు దాదాపు రూ. 40 కోట్ల నష్టం వాటిల్లుతుందని నిర్మాతలు చెబుతున్నారు. ఒక నిర్మాతగా మరో నిర్మాతకు నష్టాలు తెచ్చే పనిని చేయడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే అల వైకుంఠపురంలో సినిమా డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేయకుండా ఆపేశాము’ అని మనీష్ షా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


‘ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపేయడం వల్ల నాకు దాదాపు 20 కోట్ల వరకు నష్టం వచ్చింది. అందులో కేవలం డబ్బింగ్ కోసమే రూ.2 కోట్లు ఖర్చు చేశాను. అల వైకుంఠపురములో సినిమాను ‘పుష్ప’ కంటే భారీగా విడుదల చేయాలని భావించాను. కానీ ‘షాహ్‌జాదా’ నిర్మాతలైన అల్లు అరవింద్, అమన్ గిల్‌కు జరగబోయే నష్టం గురించి ఆలోచించి నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను. అయితే నాకు జరుగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈ డబ్బింగ్ సినిమాను ఛానెల్‌లో మాత్రం విడుదల చేస్తున్నాను’ అంటూ మనీష్ షా చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-01-25T17:00:19+05:30 IST