రవితేజ ‘ఖిలాడి’ సినిమాపై బాలీవుడ్ నిర్మాత కేసు

ABN , First Publish Date - 2022-02-13T22:52:31+05:30 IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఖిలాడి’. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తెలుగుతో

రవితేజ ‘ఖిలాడి’ సినిమాపై బాలీవుడ్ నిర్మాత కేసు

మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఖిలాడి’. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడిదే ఈ సినిమాకు పెద్ద సమస్యగా మారింది. ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్.. ‘ఖిలాడి’ చిత్ర మేకర్స్‌పై కేసు నమోదు చేశారు. దీనికి కారణం ఇదే టైటిల్‌తో ఆయన బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌తో చిత్రం చేసి ఉండటం. ‘ఖిలాడి’ టైటిల్‌తో దక్షిణాదిలో సినిమా తెరకెక్కిస్తున్నట్లుగా తనకు తెలియదని, తెలిసి ఉంటే ముందే సంప్రదించి ఉండేవాడినని రతన్ జైన్ తెలిపారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్షయ్ కుమార్‌తో ‘ఖిలాడి’‌ టైటిల్‌తో మేము సినిమా చేయడం జరిగింది. అది పెద్ద విజయం సాధించింది. ఇదే టైటిల్‌తో సౌత్‌లో చిత్రం చేస్తున్నట్లుగా నాకు తెలియదు. తెలిసి ఉంటే ముందే సంప్రదించేవాడిని. మొన్న ట్రైలర్ చూసిన తర్వాతే తెలిసింది. అయినా సరే, నేను డబ్బులు ఆశించడం లేదు. మా ‘ఖిలాడి’ చిత్ర ప్రతిష్ట గురించే ఆలోచిస్తున్నాను. సౌత్‌లో లోకల్ అసోసియేషన్స్‌లో టైటిల్ రిజిస్టర్ చేయించి, అదే టైటిల్‌తో బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేస్తున్నారు. సిబీఎఫ్‌సీ అనుమతితోనే హిందీ టైటిల్స్‌కి దగ్గరగా డబ్బింగ్ చిత్రాలను విడుదల చేస్తున్నారు. కానీ ఇక్కడి సినిమాల ప్రతిష్టను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు విడుదలైన ‘ఖిలాడి’ చిత్రం కేవలం సౌత్‌లోనే విడుదల అనుకున్నాను.. కానీ నార్త్‌లో కూడా విడుదల చేశారు. అందుకే ఈ సినిమా టైటిల్‌ను మార్చాలని కోర్టును సంప్రదించడం జరిగింది..’’ అని తెలిపారు. అయితే, ఇప్పటికే సినిమా విడుదలవడంతో.. కోర్టు కూడా ఏమీ చేయలేమని తెలపడంతో.. కనీసం ఓటీటీ రిలీజ్‌ని అయినా ఆపాలని రతన్ జైన్ కోర్టుని కోరినట్లుగా సమాచారం. కాగా, ఈ వివాదంపై రవితేజ ‘ఖిలాడి’ చిత్రయూనిట్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

Updated Date - 2022-02-13T22:52:31+05:30 IST