ఆ నిర్మాత అన్న మాటలకి.. ఆరు నెలలు అద్దంలో చూసుకోలేకపోయా : విద్యాబాలన్

ABN , First Publish Date - 2022-03-18T18:08:09+05:30 IST

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో విద్యాబాలన్ ఒకరు. అందులో ఎటువంటి సందేహం..

ఆ నిర్మాత అన్న మాటలకి.. ఆరు నెలలు అద్దంలో చూసుకోలేకపోయా : విద్యాబాలన్

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో విద్యాబాలన్ ఒకరు. అందులో ఎటువంటి సందేహం లేదు. 2011లో నటి సిల్క్ స్మిత బయోపిక్‌గా వచ్చిన ‘ది డర్టీ పిక్చర్’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించింది. అనంతరం వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. ఈ భామ నటించిన తాజా చిత్రం ‘జల్సా’. మార్చి 18న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదలైంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్య్వూలో కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది.


విద్యాబాలన్ మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నన్ను చాలా సినిమాల నుంచి తొలగించారు. అలా దాదాపు 13 మూవీస్ వరకు కోల్పోయాను. అందులో ఓ ప్రొడ్యూసర్ అయితే సినిమా నుంచి తొలగించడమే కాకుండా నాతో చాలా చెడ్డగా ప్రవర్తించాడు. ఆయన అన్న మాటలు నాపై నాకు నమ్మకం కొల్పోయేలా చేశాయి. ఎంతలా అంటే.. నేను అందంగా ఉండనని అనుకుని, దాదాపు ఆరు నెలల వరకు అద్దంలో చూసుకోవడానికి భయపడ్డాను. అయితే ఇటీవల వారిలో చాలామంది నాకు కాల్ చేసి సినిమా చేయమని అడిగారు. అయితే వారి ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాను’ అంటూ చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా విద్యా ఇంకా మాట్లాడుతూ.. ‘నన్ను సినిమాల్లోంచి తొలగిస్తున్న సమయంలోనే కె.బాలచందర్‌తో రెండు సినిమాలకు సైన్ చేశాను. వాటి నుంచి కూడా నన్ను తొలగించారని గ్రహించాను. అయితే దాని గురించి వారు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఆ సినిమాల షూటింగ్ కోసం మేము న్యూజిలాండ్ వెళ్లాల్సి ఉంది. కానీ పాస్‌పోర్ట్ అడగలేదు. దాంతో నన్ను ఆ సినిమాల నుంచి తొలగించిన విషయం అర్థమైంది. చివరికీ మా అమ్మ ఫోన్ చేస్తే నన్ను మూవీలో నుంచి తీసేశారనే విషయాన్ని బాలచందర్ కూతురు చెప్పింది.


ఓసారైతే నన్ను సినిమా నుంచి తీసేశారనే కోపంతో మారిన్ డ్రైమ్ నుంచి బాంద్రా వరకు నడుచుకుంటూ వెళ్లాను. చాలాసేపు ఏడ్చాను. అప్పుడు జరిగిన విషయాల్లో కొన్ని మాత్రమే గుర్తు ఉన్నాయి. ఆ మూడు సంవత్సరాల్లో ఏం చేద్దామన్నా ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. చాలా కష్టంగా గడిచింది’ అని తెలిపింది.

Updated Date - 2022-03-18T18:08:09+05:30 IST