ఆయన్ని కొట్టడం కరెక్టే.. ఆ హాలీవుడ్ హీరో నా షోలో పాల్గొనాలి: కంగనా రనౌత్

ABN , First Publish Date - 2022-03-29T16:33:26+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులు అందరూ ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక ఇటీవలే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే...

ఆయన్ని కొట్టడం కరెక్టే.. ఆ హాలీవుడ్ హీరో నా షోలో పాల్గొనాలి: కంగనా రనౌత్

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులు అందరూ ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక ఇటీవలే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఎప్పుడూ ఎంతో సరదాగా సాగే ఈ ఉత్సవంలో ఈసారి మాత్రం ఓ అపశృతి చోటు చేసుకుంది. అదే ఈ వేడుకని హోస్ట్ చేస్తున్న నటుడు క్రిస్ రాక్‌ని స్టార్ హీరో విల్ స్మిత్ లాగిపెట్టికొట్టడం. ఈ ఘటనపై బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో స్పందించింది.


ఆస్కార్ వేడుకని హోస్ట్ చేస్తున్న క్రిస్ రాక్, అక్కడే ఉన్న నటుడు విల్ స్మిత్ భార్య జడా పింకెట్ స్మిత్‌ గురించి జోక్ చేశాడు. ఆమె అలోపెసియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ఉన్నవారికి జుట్టు ఊడిపోతుంది. దీంతో జడా గుండుతోనే ఈ వేడుకకి హాజరైంది. ఇది గమనించిన క్రిస్ ఆమెని ‘జి.ఐ.జాన్’ చిత్రంలోని ఓ పాత్రతో పోల్చుతూ.. ఆ మూవీ సిక్వేల్‌లో మీరు నటించాలి అంటూ జోక్ చేశాడు. భార్య వ్యాధి గురించి జోక్ చేయడం విల్ స్మిత్ కోపానికి కారణమైంది. దీంతో ఆయన వేదికపైకి వెళ్లి క్రిస్‌ని చెంప మీద కొట్టాడు. దీంతో షాక్ గురైన హోస్ట్ ఏం చేయాలో తెలియక నిల్చుండిపోయాడు. అయితే అనంతరం ఈ ఘటనపై క్రిస్‌కి విల్‌స్మిత్ వేదికపైనే క్షమాపణలు తెలిపాడు. 


దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు రెండుగా చీలిపోయి కొందరు విల్‌స్మిత్‌కి సపోర్టు చేస్తుండగా.. కొందరు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా కంగనా రనౌత్ కూడా స్పందిస్తూ విల్‌స్మిత్‌కి సపోర్టు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామ పెట్టిన స్టోరీలో.. ‘ఫూల్స్ నవ్వించడానికి ఎవడైనా ఇడియట్ మా అమ్మ లేక సోదరికి ఉన్న వ్యాధిని ఉపయోగించుకుంటే.. నేను విల్‌స్మిత్‌లాగే చేస్తా. గట్టిగా బదులిస్తా. ఆయన త్వరలోనే నా లాకప్ షోకి కంటెస్టెంట్‌గా వస్తాడని ఆశిస్తున్నా’ అంటూ రాసుకొచ్చింది. దానికి లాఫింగ్ ఎమోజీ సైతం జోడించింది.



Updated Date - 2022-03-29T16:33:26+05:30 IST