అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone). ఫ్రాన్స్‌లో జరుగుతున్న ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’ (Cannes Film Festival)కు ఆమె జ్యూరీ మెంబర్‌గా వ్యవహరిస్తుంది. సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తులను ధరించి ఈ వేడుకలో ఆమె సందడి చేసింది. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంది. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధాన మిచ్చింది.
కరోనా అనంతరం ప్రజల అభిరుచుల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు థియేటర్స్‌కు రావడం లేదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో మీడియా.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ (OTT Platforms) వల్ల సినీ ఇండస్ట్రీకి ముప్పు ఉందా ఆమెను ప్రశ్నించింది. రెండు రకాల ప్రేక్షకులు ఉంటారని దీపిక సమాధానమిచ్చింది. కొంత మంది వెండి తెర మీద సినిమాలు చూడటానికీ ఇష్టపడతారని, అటువంటి వారి వల్ల థియేటర్స్ బతుకుతాయని చెప్పింది. మరికొంత మంది ఇంట్లోనే కూర్చుని సౌకర్యవంతంగా చిత్రాలు చూస్తారని పేర్కొంది. ప్రేక్షకులకు ఇంట్లో కూర్చుని మూవీస్ చూసే అవకాశంతో పాటు, థియేటర్స్‌కు వెళ్లే అవకాశం ఉందని వెల్లడించింది. ఓటీటీలతో సినీ ఇండస్ట్రీకీ ముప్పుందని తాను అనుకోవడం లేదని స్పష్టం చేసింది. ఫిల్మ్ మేకర్స్ మార్పులకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలని తెలిపింది. ‘‘కొన్ని కథలను ఓటీటీలోనే, కొత్త ఫార్మాట్‌లో చెప్పవచ్చు. మీరు డిజిటల్ ప్లాట్‌ఫాం కోసం సినిమాను నిర్మిస్తుంటే ఆ కథను కొత్తగా చెప్పాలి. ఆ విధంగా కథలను చెప్పడం మంచిదనే నా అభిప్రాయం. ఓటీటీల వల్ల దర్శకులు, నిర్మాతలు, రైటర్స్, నటులకు అవకాశాలు పెరుగుతాయని నా అభిప్రాయం. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను అవకాశంగా మాత్రమే చూస్తాను. వాటి వల్ల సినీ ఇండస్ట్రీకీ ఎటువంటి ముప్పు ఉండదు’’ అని దీపికా పదుకొణె చెప్పింది.