Shah Rukh Khan, Atlee కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు ఎవరూ ఊహించని టైటిల్.. ఆర్మీ నేపథ్యంలోనే..!

ABN , First Publish Date - 2022-06-02T19:24:58+05:30 IST

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్‌కి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. అందుకే ఈ నటుడ్ని అభిమానులు..

Shah Rukh Khan, Atlee కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు ఎవరూ ఊహించని టైటిల్.. ఆర్మీ నేపథ్యంలోనే..!

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్‌కి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. అందుకే ఈ నటుడ్ని అభిమానులు ప్రేమగా కింగ్ ఖాన్, బాద్ షా పిలుచుకుంటూ ఉంటారు. అంతటి అభిమానగణం ఉన్న ఈ స్టార్ హీరో గతకొంతకాలంగా తీసిన సినిమాలు వరుసగా ఫ్లాప్‌లుగా నిలిచాయి. ఈ తరుణంలో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ నటుడు ఇప్పటికే ‘పఠాన్’ అనే సినిమా చేస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నటుడు తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే.


‘రాజారాణి’ వంటి సూపర్ హిట్‌తో సినీ పరిశ్రమకి పరిచయమై.. వరుసగా బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతూ తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సాధించిన దర్శకుడు అట్లీ. దీంతో ఈ తమిళ దర్శకుడు, బాలీవుడ్ స్టార్ షారుఖ్ కాంబినేషన్‌లో రానున్న సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే.. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చిన చాలా వేగంగా వైరల్‌గా మారుతోంది. ఈ తరుణంలో ఈ మూవీ టైటిల్ గురించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అదే ఈ మూవీ పేరు ‘జవాన్’ అని. ఈ సినిమా టైటిల్ కోసం దాదాపు 25కి పైగా పేర్లను పరిశీలించిన షారుఖ్, అట్లీ చివరికీ ‘జవాన్’ అనే పేరుకి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్‌ని బట్టి కథ ఆర్మీ నేపథ్యంలో ఉండనున్నట్లు అర్థమవుతోంది.


ఓ ప్రత్యేక టీజర్‌ని విడుదల చేయడం ద్వారా ఈ టైటిల్‌ని ప్రకటించేందుకు చిత్రబృందం  సిద్ధమవుతోందని సమాచారం. దాదాపు 1 నిమిషం 34 సెకన్లు ఉండే ఆ టీజర్‌‌లో షారుఖ్‌ లుక్ అభిమానుల అంచనాలకి తగినట్లుగా ఉంటుందని వినికిడి. అంతేకాకుండా.. ఇప్పటి వరకూ చూడని మాస్ అవతారంలో షారుఖ్‌ని చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని 2023లో విడుదల చేయాలని మూవీ టీం భావిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో నయనతార, సాన్యా మల్హోత్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Updated Date - 2022-06-02T19:24:58+05:30 IST