కాపురమే ముద్దు... పెళ్లి వద్దంటోన్న... బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్!

ABN , First Publish Date - 2022-02-15T02:33:42+05:30 IST

విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్

కాపురమే ముద్దు... పెళ్లి వద్దంటోన్న... బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్!

విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్. అతడు కొంత కాలంగా గాబ్రియెల్ల దెమిత్రియాడెస్‌తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతడికి అరిక్ అని పేరు పెట్టారు. జంటగా జీవిస్తున్నప్పటికి తమకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అర్జున్ తెలిపాడు. తమ బంధానికి ఎటువంటి స్టాంప్ అవసరం లేదని కూడా వెల్లడించాడు. తాజాగా ఈ బీ టౌన్ అందగాడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తమ బంధం గురించి వివరించాడు. 


గతంలోనే తమ వివాహం అయిందని అర్జున్ రాంపాల్ తెలిపాడు. తమ మనసులు ఎప్పుడో కలిశాయని చెప్పాడు. అంతకంటే ఏం కావాలన్నాడు. ఒక కాగితం మీద సంతకం పెట్టి తమ బంధాన్ని అధికారికం చేయాలా అని అడిగాడు? ‘‘మేం ఇద్దరం ఆ విధంగా ఆలోచించం. గాబ్రియెల్లాకు కూడా అటువంటి వివాహం ఇష్టం లేదు’’ అని అర్జున్ రాంపాల్ చెప్పాడు. అనంతరం గాబ్రియెల్ల కూడా మాట్లాడింది. 


పెళ్లి అనేది అందమైన విషయం అని గాబ్రియెల్ల చెప్పింది. అయితే, చాలా మంది పెళ్లి చేసుకున్న వారికి అదొక గొప్ప విషయం కావచ్చు... కానీ, వివాహం వద్దనుకున్న వారికి... అది తప్పనిసరేం కాదు అంటోంది అర్జున్ రాంపాల్ ప్రేయసి. సంప్రదాయబద్ధంగా పెళ్లాడిన జంట కన్నా తామిద్దరం ఎక్కువ రోజులే బంధాన్ని కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేసింది. పెళ్లాడిన దంపతుల కంటే తాము తక్కువేమీ కాదని పేర్కొంది. ‘‘కొంత మంది జంటగా ఉన్నప్పటికి అనేక కారణాల వల్ల పెళ్లి చేసుకోరు. వారి మధ్య ప్రేమ తక్కువగా ఉందని మనం చెప్పలేం. పెళ్లాడనప్పటికి మా మధ్య బంధం చాలా గట్టిగా ఉంది. మాకు ఎవరి ధ్రువీకరణా అవసరం లేదు. పెళ్లి అనేది పెద్ద అంశమేం కాదు. ఆ రిలేషన్‌షిప్ ఒక చాయిస్ మాత్రమే. మేం ఒక ఫ్యామిలీగా కలిసే ఉంటాం ’’ అని గాబ్రియెల్ల స్పష్టం చేసింది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా అర్జున్ రాంపాల్, గాబ్రియెల్ల మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్లకు డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఆ విషయాన్ని అదికారికంగా ప్రకటించారు.

Updated Date - 2022-02-15T02:33:42+05:30 IST