నాకు మంచే జరిగింది: ‘భీమ్లా నాయక్’ దర్శకుడు

ABN , First Publish Date - 2022-03-01T01:04:00+05:30 IST

‘అయ్యారే’ సమయంలో సినిమా తీయాలనే తపన తప్ప ఇంకేం తెలీదు. ప్రొడక్షన్‌ ఎలా చేయాలి... ఎలా ముందుకెళ్లాలి అన్న సంగతి తెలీదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో పరిచయాలు పెరిగాయి, కొంత అవగాహన వచ్చింది. ఒక అడుగు ముందుకెళ్లేలా చేసింది. ఇక ‘భీమ్లానాయక్‌’ నన్ను మరో మెట్టు ఎక్కించింది. ఈ మూడు సినిమాల..

నాకు మంచే జరిగింది: ‘భీమ్లా నాయక్’ దర్శకుడు

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, రానా కాంబినేషన్‌లో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌. కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు- స్ర్కీన్‌ప్లే అందించిన ఈ చిత్రం తాజాగా విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. సినిమా సాధించిన సక్సెస్‌‌తో చాలా సంతోషంగా ఉన్నానని చిత్ర దర్శకుడు సాగర్ కె. చంద్ర తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు.


ఆయన మాట్లాడుతూ..

‘‘ ‘వకీల్‌సాబ్‌’ సినిమా సెట్‌లో కల్యాణ్‌గారిని వన్‌ టు వన్‌ కలిశా. అప్పుడు కోర్టు రూమ్‌ సీన్‌ చేస్తున్నారు. సినిమా గురించి మాట్లాడుతుండగా ‘బాగా తీయ్‌.. బాధ్యతగా పని చేయ్‌’ అని చెప్పారు. అంతే ఎనర్జీతో టీమ్ అంతా పని చేశాం. ఆ తర్వాత జర్నీ అంతా అందిరికీ తెలిసిందే. ‘అయ్యారే’ సమయంలో సినిమా తీయాలనే తపన తప్ప ఇంకేం తెలీదు. ప్రొడక్షన్‌ ఎలా చేయాలి... ఎలా ముందుకెళ్లాలి అన్న సంగతి తెలీదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో పరిచయాలు పెరిగాయి, కొంత అవగాహన వచ్చింది. ఒక అడుగు ముందుకెళ్లేలా చేసింది. ఇక ‘భీమ్లానాయక్‌’ నన్ను మరో మెట్టు ఎక్కించింది. ఈ మూడు సినిమాల వల్ల నాకు మంచే జరిగింది. స్టార్‌తో సినిమా అంటే బలమైన కథ కావాలంటారు? మలయాళంలో ఈగో అనే అంశంతో సినిమా తీసి హిట్‌ అందుకున్నారు కదా? అది ప్రాంతాలను బట్టి.. ఉంటుంది. మన ప్రేక్షకుల అభిరుచి మేరకు మన కథలుంటాయి. పైగా మన సినిమాల స్పాన్‌ పెద్దది. దానికి తగ్గట్లే కథలు ఉంటాయి. మార్పులు చేర్పులు హంగులు జోడిస్తారు. గ్లామర్‌ లుక్‌ ఉంటుంది. 


ఒక సినిమా సక్సెస్‌ అయితే ‘తెలిసినవాళ్లు.. తెలియనివాళ్లు ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు’ అని సినిమా టీమ్‌ చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది. వీళ్ల నంబర్‌ జనాలకు ఎలా తెలుసని నవ్వుకునేవాడిని. ఇప్పుడు దానికో లాజిక్‌ ఉందని అర్థమైంది. తాజాగా ఆ అనుభవం నాకు ఎదురైంది. చాలామంది ఫోన్‌ చేసి మెచ్చుకుంటున్నారు. సినిమా చూసి సుకుమార్‌గారు, హరీశ్‌ శంకర్‌గారు‌, సురేందర్‌ రెడ్డిగారు, క్రిష్‌‌గారు.. ఇలా దర్శకులు ఫోన్‌ చేసి కమర్షియల్‌ హిట్‌ కొట్టావ్‌ అంటుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇదొక గొప్ప జ్ఞాపకం. 


చినబాబుగారు, వంశీ నా వ్యక్తిగత జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తులుగా మారారు. సినిమా తీసే విషయంలో ఆయన ఇచ్చే సపోర్ట్‌ మరచిపోలేం. కష్టం తెలియకుండా చూసుకుంటారు. కరోనా వల్ల షూటింగ్‌ లేట్‌ అయ్యి ఇబ్బంది పడ్డాం. కానీ మిగతా ఏ విషయంలోనూ మేం ఇబ్బంది పడలేదు. ఇబ్బందులు ఏమీ మా దగ్గరకు రాకుండా చినబాబుగారు చూసుకున్నారు. త్వరలో హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకులకు కొత్త కథ చెప్పాలనే ఉంటుంది. కానీ నాకు ఇంకా చాలా కెరీర్‌ ఉంది. చాలా అవకాశాలు అందుకోవాలి. ఈసారి డెఫినెట్‌గా స్ట్రెయిట్‌ సినిమా చేస్తా. ‘భీమ్లానాయక్‌’ సినిమా కంటే ముందు వరుణ్‌ తేజ్‌తో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లో ఓ సినిమా ప్రకటించారు. అనుకున్న బడ్జెట్‌ దాటడంతో అది పక్కకు వెళ్లింది. తర్వాత సినిమాగా ఆ కథతో చేస్తానా.. లేదా ఇంకోటి చేస్తానా? అనేది త్వరలోనే క్లారిటీ ఇస్తాను..’’ అని తెలిపారు.

Updated Date - 2022-03-01T01:04:00+05:30 IST