Bhanumathi Birth Anniversary: ఇలాంటి డైలాగులేంటని బాలయ్య సినిమాకు నో చెప్పిన భానుమతి.. చివరకు అదే సినిమాలో నటించి..

ABN , First Publish Date - 2022-09-07T18:43:51+05:30 IST

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే నటీమణుల్లో భానుమతీ (Bhanumathi) ఒకరు. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా భానుమతి బహుముఖ ప్రజ్ఞను గుర్తుచేసుకుందాము.

Bhanumathi Birth Anniversary: ఇలాంటి డైలాగులేంటని బాలయ్య సినిమాకు నో చెప్పిన భానుమతి.. చివరకు అదే సినిమాలో నటించి..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే నటీమణుల్లో భానుమతీ (Bhanumathi) ఒకరు. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా భానుమతి బహుముఖ ప్రజ్ఞను గుర్తుచేసుకుందాము. ఆమె నటిగా మాత్రమే కాకుండా నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలుగానూ ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్నారు. మల్లీశ్వరి, సారంగధర, విప్రనారాయణ, బొబ్బిలి యుధ్ధం, మంగమ్మ గారి మనవడు, పెళ్ళికానుక వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు.


భానుమతి 1926, సెప్టెంబరు 7 ప్రకాశం జిల్లా, ఒంగోలులో జన్మించారు. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య. ఆయన శాస్త్రీయ సంగీత ప్రియుడు, కళావిశారదుడు. భానుమతి తన తండ్రి దగ్గరే సంగీతం నేర్చుకున్నారు. 1939 లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో మొదటిసారిగా నటించారు. అప్పటికి ఆమె వయసు 13 ఏళ్ళు మాత్రమే. భానుమతి నటిస్తూనే అనేక పాటలు పాడారు. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా తన గాత్రాన్ని అందించారు. ఇప్పటికీ ఆమె పాటలు వింటూ అలా గాలిలో తెలిపోయేవారున్నారంటే అతిశయోక్తి కాదు.


Bhanumathi: పెళ్ళి విషయంలో కూడా కథానాయికగానే..

భానుమతి పెళ్ళి విషయంలో కూడా కథానాయికగానే వ్యవహరించిందని అంటారు. అంతటి హీరోయిన్ కొనకంటి చూపు సోకితే చాలు అన్నట్టు పోటీపడే చోట ఆమె ఏ ఆస్తిపాస్తులూ లేని ఒక సాదాసీదా అసిస్టెంట్ డైరక్టర్ ని ప్రేమించింది. ప్రేమించిన ఆ అసిస్టెంట్ డైరక్టర్ రామకృష్ణని చేసుకోవడానికి తల్లిదండ్రుల్ని కూడా ఎదిరించింది.


Bhanumathi: ఎలాంటి పాత్రను పోషించిన తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.

ఎలాంటి పాత్రను పోషించిన తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ళకు పైగా ఉన్నప్పటికీ ఆమె నటించిన చిత్రాలు మాత్రం వంద వరకే ఉండడం అనేది కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే, నటనతో పాటు మిగతా విభాగాల మీద దృష్ఠి పెట్టడం వల్ల ఎక్కువ చిత్రాలలో నటించలేకపోయారు. కథ, అందులో తన పాత్ర నచ్చితేనే నటించడానికి ఒప్పుకోవడం కూడా మరో కారణం అని చెప్పాలి. దీనికి ఉదాహరణ దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన మంగమ్మగారి మనవడు సినిమానే. 


Bhanumathi: నాతో ఇలాంటి డైలాగులు చెప్పిస్తే జనాలు ఎలా చూస్తారు

ఇందులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించారు. అయితే, కథ చెప్పినప్పుడు ఆమె కొన్ని డైలాగులు నచ్చలేదని సినిమా చేసేందుకు నిరాకరించారట. నాతో ఇలాంటి డైలాగులు చెప్పిస్తే జనాలు ఎలా చూస్తారు..అసలు నెనెలా ఒప్పుకుంటాననుకున్నావు..? అని కోడి రామకృష్ణతో అన్నారట. పలు సందర్భాలలో ఆయనే ఈ విషయాన్ని చెప్పారు. ఎలాగోలా ఒప్పించి మొదటి రోజు షూటింగ్త్‌లో ఆవిడ చెప్పనన్న డైలాగునే చెప్పించారు. భానుమతి కంఠం కంచుకంఠం. ఆ గాత్రంతో చెప్పిన డైలాగుకి చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లతో పొగడ్తల వర్షం కురిపించారు.


Bhanumathi: నవరసాలను అలవోకగా ప్రదర్శింపగల నటీమణి.. 

ఆ రెస్పాన్స్ చూసి ఆవిడ చాలా ఆనందించారు. ఆ ఉదాహరణను చూపించి రేపు థియేటర్స్‌లో ఇంతకంటే గొప్ప రెస్పాన్స్ వస్తుందమ్మా..అని కోడి రామకృష్ణ చెప్పడంతో మంగమ్మగారి మనవడు సినిమాలో నటించి దర్శకుడు రాసిన డైలాగులను అక్షరం మార్చకుండా అలానే చెప్పారు. ఇలాంటి సందర్భాలు భానుమతి కెరీర్‌లో చాలానే ఉన్నాయి. నవరసాలను అలవోకగా ప్రదర్శింపగల నటీమణి అంటూ ఆమెతో తెరను పంచుకున్న అగ్ర నటీ నటులనుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ చెప్పేవారు. అంతేకాదు, ఒక్కసారి భానుమతితో నటించిన వారెవరైనా మళ్ళీ మళ్ళీ చిన్న పాత్ర చేసే అవకాశం అయినా వస్తుందేమో.. అని ఎదురుచూసేవారు.


Bhanumathi: సంగీతం అందించినా, పాటలు పాడిన అవి సూపర్ హిట్‌..

సంగీతం అందించినా, పాటలు పాడిన అవి సూపర్ హిట్‌గా నిలిచేవి. దర్శకనిర్మాతగానూ ఎన్నో సక్సెస్‌లు చూశారు. తాతమ్మకల సినిమాలో బాలయ్యకు తాతమ్మగా నటించినా, లైలా మజ్ఞు సినిమాలో లైలాగా నటించినా, స్వర్గసీమ సినిమాలో వ్యాంప్ తరహా పాత్రను పోషించినా..మల్లీశ్వరిగా అలరించినా, బామ్మమాట బంగారు బాట సినిమాలో హాస్య ప్రధానమైన పాత్రలో సందడి చేసినా ప్రముఖులంతా ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆమె సినీ, జీవిత కథతో అద్భుతమైన బయోపిక్ తయారవుతుందనడంలో సందేహం లేదు. 

Updated Date - 2022-09-07T18:43:51+05:30 IST