ఈ ఏడాది ఇప్పటి వరకు Bollywood లో కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన Best Movies లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-06-28T22:54:37+05:30 IST

కరోనా గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి ఈ ఏడాదే పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరుచుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు భాషల్లో చాలా చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి...

ఈ ఏడాది ఇప్పటి వరకు Bollywood లో కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన Best Movies లిస్ట్ ఇదీ..!

కరోనా గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి ఈ ఏడాదే పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరుచుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు భాషల్లో చాలా చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అందులో కొన్ని చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల మన్ననలు పొందాయి. అందులో పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలూ ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలకి చెందిన కొన్ని చిత్రాలు హిందీలోకి డబ్ అయ్యి.. అక్కడ రికార్డు స్థాయి కలెక్షన్లని కొల్లగొట్టాయి. అలా ఈ ఏడాది ఇప్పటి వరకూ విడుదలై బాలీవుడ్‌లో రికార్డులను నెలకొల్పిన చిత్రాలివే..


RRR

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాహుబలి సినిమాల తర్వాత రాజమౌళి తీసిన ఈ సినిమాపై విడుదలకి ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆ మూవీలో యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్.. దానికితోడు కరెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్లని కొల్లగొట్టగా.. కేవలం హిందీలోనే రూ.250కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.


KGF 2

కన్నడ నటుడు యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కెజియఫ్ చాప్టర్ 2’. 2018లో ఎటువంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల సంచలన విజయం సాధించిన ‘కెజియఫ్ చాప్టర్ 1’ సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాతో కన్నడ సినిమా స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకి పైగా కలెక్షన్లని కొల్లగొట్టింది. అందులో.. హిందీలోనే దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.


Gangubai Kathiawadi

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియాభట్ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘గంగుభాయి కతియావాడి’. ఈ బయోలాజికల్ క్రైమ్-డ్రామాకి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించాడు. హుస్సేన్ జైదీ పుస్తకం ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. సంజయ్ స్టైల్‌ టేకింగ్, కథ, కథనం ఆ సినిమాని సక్సెస్ అయ్యేలా చేశాయి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లకి పైగా కలెక్షనని కొల్లగొట్టింది.


Badhaai Do

మంచి కంటెంట్‌తో వస్తే సాధారణ చిత్రం కూడా అద్భుతాలను సృష్టిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వెండితెరపై 'లావెండర్ వివాహాల' గురించి ఆవిష్కరించిన చిత్రం ‘బదాయి దో’ అలాంటిదే. 2018లో వచ్చిన ‘బదాయి హో’కి సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇందులో రాజ్‌కుమార్ రావ్, భూమి పెడ్నేకర్ స్వలింగ సంపర్కులుగా నటించారు. స్వలింగ సంపర్కుల బాధలపై హాస్యపూరితంగా చూపిస్తూనే.. మంచి సందేశాన్ని అందించింది. ఈ సినిమాకూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లని సాధించింది.


ఇవేకాకుండా.. 1990లలో కాశ్మీరీ పండిట్లపై జరిగిన దురాగతాల ఆధారంగా తెరకెక్కిన ‘ది కశ్మీరి ఫైల్స్’ సైతం మంచి విజయాన్ని సాధించింది. ఫుల్ రన్‌లో దాదాపు రూ.257 కోట్ల వసూళ్లని కొల్లగొట్టింది. అలాగే.. కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా నటించిన హార్రర్ కామెడీ చిత్రం ‘భుల్ భూలయ్యా 2’ సైతం హిట్‌గా నిలిచి, దాదాపు రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించింది.

Updated Date - 2022-06-28T22:54:37+05:30 IST