Sivaranjani: సావిత్రి జీవితంలోని ఓ సంఘటనతో తెరకెక్కిన సినిమా!

ABN , First Publish Date - 2022-08-21T01:26:00+05:30 IST

చిత్ర పరిశ్రమ నేపథ్యంగా ఎన్ని చిత్రాలు వచ్చినా.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండే చిత్రం ‘శివరంజని’ (Sivaranjani). దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) ఈ చిత్రం తీయడానికి ప్రేరణ మహా నటి..

Sivaranjani: సావిత్రి జీవితంలోని ఓ సంఘటనతో తెరకెక్కిన సినిమా!

చిత్ర పరిశ్రమ నేపథ్యంగా ఎన్ని చిత్రాలు వచ్చినా.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండే చిత్రం ‘శివరంజని’ (Sivaranjani). దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) ఈ చిత్రం తీయడానికి ప్రేరణ మహా నటి సావిత్రి (Savitri). శివరంజని సినిమాలోని కొన్ని సంఘటనలు ఆమె జీవితానికి దగ్గరగా ఉంటాయి. దాసరిని తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచేవారు సావిత్రి. తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను తీరిక దొరికినప్పుడల్లా దాసరికి ఆమె చెప్పేవారు. వాటిల్లో ఒక సంఘటన దాసరిని కదిలించింది. అదే శివరంజని సినిమా తీయడానికి ఆయన్ని ప్రేరేపించింది.


తనే నిర్మాతగా మారి శివరంజని చిత్రాన్ని నిర్మించారు దాసరి. ఎన్టీఆర్ (NTR), ఏయన్నార్(ANR) వంటి అగ్ర హీరోలతో సినిమా స్కోప్‌లో చిత్రాలు తీయడానికి నిర్మాతలు వెనుకాడుతున్న తరుణంలో జయసుధ (Jayasudha), సుభాషిణి (Subhashini), మోహన్ బాబు (MohanBabu), హరిప్రసాద్ (Hari Prasad) వంటి చిన్న తారాగణంతో ‘శివరంజని’ చిత్రాన్ని స్కోప్‌లో తీసి రికార్డ్ క్రియేట్ చేశారు దాసరి.


ఈ సినిమాలో హీరో వేషం చిరంజీవి (Chiranjeevi)కి వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. ఆ ఛాన్స్ ఆయన రూమ్‌మేట్ హరిప్రసాద్‌కు దక్కింది. ఇందులో సినిమా హీరోయిన్‌గా నటించిన జయసుధకు ఎంతో పేరు వచ్చింది. అలాగే విలన్ పాత్రధారి మోహన్ బాబు ఈ సినిమాతో మరింత పాపులర్ అయ్యారు. తిరుపతిలో లడ్లు.. సినిమా స్టార్ల దగ్గర డబ్బులు లేవంటే ఎవరూ నమ్మరు.. అంటూ ఆయన చెప్పిన డైలాగ్ వైరల్ అయింది. 


1978 సెప్టెంబర్ 27 న విడుదల అయిన శివరంజని సూపర్ హిట్ అయింది. బెంగళూరులో ఈ చిత్రం 52 వారాలు ఆడడం విశేషం. ఈ సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన వేడుకకు ఎన్టీఆర్, ఏయన్నార్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ హాజరయ్యారు.

-వినాయకరావు

Updated Date - 2022-08-21T01:26:00+05:30 IST