బాలు వడ్డాణం.. సిరివెన్నెల హారం

ABN , First Publish Date - 2022-04-10T05:38:00+05:30 IST

కీరవాణి పాటలే కాదు.. మాటలూ మధురంగా ఉంటాయి.

బాలు వడ్డాణం.. సిరివెన్నెల హారం

కీరవాణి పాటలే కాదు.. మాటలూ మధురంగా ఉంటాయి. ప్రతీ అంశంలోనూ లోతైన విశ్లేషణ దాగి ఉంటుంది. అందలాలు ఎక్కిన ఆడంబరం, అందాల్సింది అందలేదన్న ఆవేదన... ఇవేం ఆయనలో కనిపించవు. జీవితాన్ని ఎలా శ్రుతి చేసుకోవాలో తెలిసిన వ్యక్తి ఆయన. బాధ - సంతోషం.. వీటిని బాలెన్స్‌ చేసుకునే తీరు, గెలుపు - ఓటమి.. వీటిని అర్థం చేసుకునే పద్ధతీ యువతరానికి ఆదర్శం. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’తో మరోసారి తన మార్క్‌ వేసిన కీరవాణిని.. ‘నవ్య’ పలకరించింది. ఇలా మాటల్లో దించింది.


మీకు బాగా ఇష్టమైన బాలుగారు, సిరివెన్నెలగారు ఏడాది వ్యవధిలో వెళ్ళిపోయారు. వారిని మిస్‌ అవుతున్నారా ? 

వాస్తవం చెప్పాలంటే ఇద్దరినీ మిస్‌ అవ్వడం లేదు. ఎందుకంటే బాలుగారు తప్ప ఎవ్వరూ పాడలేరు అనే పాట నేను ఈమధ్య కాలంలో ట్యూన్‌ చేయలేదు. శాస్ర్తి గారు తప్ప ఇంకెవరూ రాయలేరు అనే పాట కంపోజ్‌ చేయలేదు. అలాంటి పాట పుట్టిన రోజున నేనే కాదు.. సంగీత ప్రపంచం మొత్తం వాళ్లని మిస్‌ అవుతుంది.


ఒక సాధారణమైన పాటని కూడా అసాధారణంగా మార్చే ప్రతిభ వాళ్ళ సొంతం కదా ? 

అదే చెబుతున్నా. వాళ్ళ స్థాయి ఇప్పటి పాటకు అవసరం లేదేమో అనిపిస్తోంది. ఇంకా వివరంగా చెప్పాలంటే బాలుగారు ఒక వడ్డాణం, సిరివెన్నెల గారు ఒక హారం.  రెండూ బంగారమే. వయసులో వున్నపుడు అవి అవసరం. ముసలివాళ్లం అయిపోయిన తరవాత.. పళ్ళు ఊడి, చేతిలోకి కర్ర వచ్చిన తర్వాత వాటితో ఏం అవసరం. ఇప్పుడు కావల్సింది తెల్ల చీరలు. అవి మార్కెట్‌లో పుష్కలంగా వున్నాయి.  


ఓ సరదా ప్రశ్నతో ఇంటర్వ్యూ మొదలెడదాం.. సంగీతానికి రాళ్ళు కూడా కరిగిపోతాయని అంటుంటారు. కానీ చాలా వరకూ సంగీత దర్శకులు హార్మోనియం పెట్టెలా నిండుగా ఉంటారెందుకు?  

(నవ్వుతూ) సంగీత దర్శకుల్లో సన్నగావున్న వాళ్ళు కూడా చాలా మంది వున్నారు. సత్యం గారు బాగా బక్కగా వుంటారు. సంగీత దర్శక కులానికి అగ్రగణ్యులైన ఇళయరాజా గారు సన్నమే. మిక్కీ జే మేయర్‌ కూడా అంతే.   అందరూ లావుగా ఉంటారని చెప్పలేం. సంగీత దర్శకులకు బయటికి కదిలే పని వుండదు. స్టూడియోలోనే కూర్చుని పని చేయాలి. ఇదీ ఐటీ జాబ్‌ లాంటిదే. మణిశర్మ లాంటి వాళ్ళు రెగ్యులర్‌గా క్రికెట్‌ ఆడటమో.. కేబీఆర్‌ పార్క్‌లో వాకింగ్‌ వెళ్ళడమో చేస్తారు కాబట్టి కొంత వరకూ ఓకే. కానీ నాలాంటివారు అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఆడటానికి ఆసక్తి చూపరు.  వాళ్ళు భోజనప్రియులైతే ఆటోమేటిక్‌గా లావైపోతారు. 


అర్జెంట్‌గా సన్నబడిపోవాలనే నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నారా ? 

అర్జెంట్‌గా సన్నబడలేం. అయితే సన్నబడే ప్రయత్నం గత పాతికేళ్ళుగా నిర్విరామంగా జరుగుతూనే ఉంది.  


మీరు భోజన ప్రియులా?

ధూమపానం, మద్యపానం అలవాటు లేనివాళ్లకు సహజంగానే భోజనం అంటే ఇష్టం ఉంటుంది. సారధి అని   నాకో సహాయకుడు వుండేవాడు. తను భోజనం చేేసవాడు కాదు.  వక్కపొడి, టీ, సిగరెట్‌, మందు.. ఇదే తన ఇన్‌ టేక్‌ . ఇందులో ఏదీ కూడా పోషక ఆహరం కాదు. అవే అలవాట్లతో చనిపోయాడు. ఇలా వ్యసనాలు ఉండేవారికి ఫుడ్‌ అంటే ఇష్టం వుండదు. కడుపునిండా తిని ఉంటే సారధి బతికుండేవాడు. అయితే ఫుడ్‌ ఒక్కోసారి ఆల్కాహాల్‌ కంటే దారుణం. ఏదైనా బ్యాలెన్స్‌ గా వుండాలి. పాటని బ్యాలెన్స్‌ చేయడం నేర్చుకున్నా కానీ ఫుడ్‌ బ్యాలెన్స్‌ చేయడం నేర్చుకోలేదు. అది నేర్చుకుంటే సన్నబడతాం.


క్రియేటీవ్‌ ఫీల్డ్‌ లో వున్న వారికి ఏదో ఒక వ్యసనం వుంటుంది. అలా మీకు ఏమైనా వుందా?

మీ ప్రశ్నని కొంచెం మార్చాలి.  క్రియేటివ్‌ ఫీల్డ్‌ లో వున్న వారికి కాదు.. మనిషి అన్నవాడికే ఓ వ్యసనం వుంటుంది. జంతువులకు వ్యసనాలు వుండవు. ప్రకృతి ధర్మం ప్రకారం బతుకుతాయి. అలానే చనిపోతాయి. కానీ మనిషి అలా కాదు.. తను చనిపోయిన తర్వాత కూడా తన తర్వాతి తరాన్ని కష్టపెట్టకూడదు అనుకుంటాడు. అందుకే తనకు కావల్సినదానికంటే ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. అదే అన్నిటికంటే పెద్ద వ్యసనం. దాంతో పోలిస్తే.. తాగడం, తిరగడం, సిగరెట్‌ , మందు, వేట ఇవి పెద్ద వ్యసనాలు కావు. అవసరానికి మించి సంపాదించడం వ్యసనాలకే బాబు లాంటిది. మనకో జన్మ వచ్చింది. దాన్ని హాయిగా అనుభవించాలి. మహా అయితే మన బిడ్డలకు ఒక దారి చూపించాలి. అంతేకానీ పది తరాలు కాళ్ళు మీద కాలేసుకొని దర్జాగా బతకాలని డబ్బు కూడబెట్టడంలో అర్థం లేదు.   


8 మీ వరకూ చెప్పండి.. ఇంతే సంపాదించాలని ఏమైనా మార్జిన్‌ పెట్టుకున్నారా? 

నెల ఖర్చులకు వెళ్లిపోవాలి. అంతకుమించి ఏదీ నిలబడదు. దాన్ని మనం అనుభవించలేం. ఆకాశాన్ని మీకు బహుమతిగా ఇస్తే ఏం చేస్తారు? దాన్ని ఎలా మడతపెట్టుకొని, ఎక్కడ దాచి పెట్టుకుంటారు? దాని బదులుగా ఒక చొక్కా బహుమతిగా ఇస్తే దాన్ని మీరు ఆనందంగా ధరిస్తారు.


రచయిత తన కథ , నిర్మాత తన సినిమా అమ్ముకోవడం బిజినెస్‌. అలాగే సంగీత దర్శకుడు కూడా తన ట్యూన్‌ని సేల్‌ చేయడం వెనుక బిజినెస్‌ సీక్రెట్‌ ఏమైనా వుందా?

ట్యూన్‌ చేసి ‘తనన తనన’ అని వినిపిస్తేఎవరికీ అర్థం కాదు. కొంతమందే ట్యూన్‌ని సరిగ్గా పట్టుకోగలరు. అయితే  డమ్మీ లిరిక్‌ రాయగలిగే కెపాసిటి వుంటే ట్యూన్లు త్వరగా అమ్ముడుపోతాయి. ఎందుకంటే లిరిక్‌ అర్థమైనంత సులవుగా ట్యూన్‌ ఎక్కదు. శ్రోత కనెక్ట్‌ అయ్యేది సాహిత్యానికే. మంచి లిరిక్‌ వున్న పాటలే ఎక్కువుగా హిట్‌ అవుతాయి. మంచి ట్యూన్‌ వున్న పాటలు అరుదుగా హిట్‌ అవుతాయి. 


మీలో ఓ గాయకుడు, గీత రచయిత ఉండడం మీలోని సంగీత దర్శకుడికి ఎంత ప్లస్‌ అయ్యింది? 

 సంగీత దర్శకుడికి రాసి, పాడే సామార్థ్యం వుండటం అంటే డ్రైవింగ్‌ తెలిసి కూడా ఓ డ్రైవర్‌ ని ఉద్యోగానికి పెట్టుకోవడం లాంటింది. నాకు డ్రైవింగ్‌ వేస్త డ్రైవర్‌ నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేయలేడు. అర్థరాత్రి కారు రింగ్‌ రోడ్డుపై ఆపేసి ‘మీరు నా జీతం పెంచేతేనే బండి కదులుద్ది’ అని బెదరించలేడు. నాకు డ్రైవింగ్‌ రాకపోతే మాత్రం వాడు చెప్పినట్లు వినాలి. అందుకే సింగర్లు, రైటర్లు ఆడించే బొమ్మలా కాకుండా.. నాకు నేనుగా ఆడటానికి దేవుడు ఇచ్చిన వరాలే రాయడం, పాడటం. నాకు రాయడం, పాడటం రాదు అనుకోండి. అప్పుడు మాత్రం తలాడించాల్సిన పరిస్థితి వస్తుంది. ఓ గీత రచయిత ఆరు నెలల వరకూ పాట ఇవ్వలేదనుకోండి. చచ్చినట్టు.. ఎదురు చూడాలి. ఓ గాయకుడు డేట్‌ ఇవ్వకపోయినా..ఆగాలి. ఇప్పుడు నాకు ఆ అవసరం లేదు. అలాగని నేను గొప్ప సింగర్‌, రైటర్‌ అని చెప్పడం లేదు. కనీసం బేసిక్స్‌ తెలిసుండాలి.   


మంచి ట్యూన్‌ వచ్చినపుడు మీరే పాడేయాలి అనేస్వార్థాన్ని మీలోని  సంగీత దర్శకుడు ఎలా కంట్రోల్‌ చేస్తుంటాడు? 

ఇలాంటి స్వార్థం ముఫ్పై ఏళ్ళ కెరీర్‌లో ఒకేసారి వచ్చింది. ‘ఈ పాట నేను పాడితేనే న్యాయం జరుగుతుంది’ అనిపించింది. ఆ పాటే.. ‘స్డూడెంట్‌ నెంబర్‌ వన్‌’లోని ‘ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగి’. బహుశా.. చంద్రబోస్‌ గారి సాహిత్యం నన్ను అంత ఆకర్షించిందేమో. తర్వాత మళ్ళీ ఎప్పుడు అలా అనిపించలేదు. పాటకి ఎవరు బావుంటారో వాళ్ళతోనే చేయిస్తా. 


మీలో మాకు తెలియని హిడెన్‌ టాలెంట్‌ ఏమైనా ఉందా?

ఈ మధ్య డబ్బింగ్‌ చెప్పాలనే ఆసక్తి పెరిగింది. నేను డబ్బింగ్‌ బాగా చెప్పగలననే నా నమ్మకం. డబ్బింగ్‌ అరిస్ట్‌ జాబ్‌ నాకు చాలా ఇష్టం. ఏదైనా ఓ పాత్రకి డబ్బింగ్‌ చెబితే ఎలా వుంటుందో అని అనుకుంటున్నాను. కానీ ఇంకా ఎవరినీ అడగలేదు.  


సంగీతం నా వృత్తి. నా ప్రపంచం కాదు. సంగీతం నా ప్రపంచమని ఎప్పుడూ చెప్పలేను. ఒక రెస్టారెంట్‌కి వెళ్లి బిర్యాని ఆర్డర్‌ ఇచ్చి ప్రశాంతంగా తినాలని అనుకుంటాను. అక్కడ లౌడ్‌ గా మ్యూజిక్‌ వినిపిస్తుంటే చిరాకొస్తుంది. ఏంట్రా ఈ దరిద్రం అనిపిస్తుంది. సైలెంట్‌ గా వుంటే  ఫుడ్‌ ఎంజాయ్‌ చేయొచ్చు అనిపిస్తుంది. కానీ హోటల్స్‌ మ్యూజిక్‌ ఎందుకు ప్లే చేస్తారో నాకు తెలీదు.  నా జీవితంలో సంగీతం కేవలం మూడో వంతు. మిగతాది వేరే. కుటుంబం, ేస్నహితులు, రకరకాల వ్యాపకాలు ఉన్నాయి.. ఒక పుస్తకం చదివినప్పుడు సంగీతం వింటే ఒక పేజీకి కూడా ముందుకు కదలదు. సంగీతం నా సర్వస్వం అంటే మొహం కడుక్కునేటపుడు, స్నానం చేేసటప్పుడు , నిద్రపోయేటప్పుడు .. ఇలా నిరంతరం సంగీతం మోగుతూవుండాలి. 


                                                                                                                    అన్వర్‌

  ఫొటోలు: కటకం సింహాచారి



నటనపై ఆసక్తి లేదా ? 

లేదండీ. నాకు నటన చేతకాదు. కెమెరా ఆన్‌ చేయగానే  బిగుసుకుపోతాను.

 

రాజమౌళి ఎప్పుడు అడగలేదా?

లేదు. నేను ఎంత బ్యాడ్‌ యాక్టర్నో రాజమౌళికి తెలుసు. నవ్వుతూ). జేకే భారవి గారు ‘చలం’ బయోపిక్‌ కోసం నన్ను అడిగారు. ‘నో’ చెప్పా. తర్వాత ఎల్బీ శ్రీరామ్‌ గారు ఒక షార్ట్‌ ఫిల్మ్‌లో నటించమన్నారు. వద్దని చెప్పేశా.


ఈ మధ్య సౌండ్‌ డిజైనింగ్‌ అనే పదం కొత్తగా వినిపిస్తోంది. ఒక సినిమాకి సంగీత దర్శకుడు వుండగా మరొకరు వచ్చి సౌండ్‌ డిజైన్‌ చేయడానికి కారణం?

సౌండ్‌ డిజైనింగ్‌ అనేది బండ చాకిరీ. రాత్రి పగలు సౌండ్‌ ఎఫెక్ట్‌ వింటూ  డైలాగుల్ని బ్యాలెన్స్‌ చేస్తూ ఒకదానికి ఒకటి సంధానపరుస్తూ చేయాల్సిన పని. అంత బండ చాకిరీ చేేసంత ఓపిక సంగీత దర్శకుల దగ్గర వుండదు కాబట్టి మరొకరు వస్తారు. ఇందులో శారీరిక శ్రమ వుంటుంది. సంగీత పరిజ్ఞానంతో పాటు స్టామినా కావాలి.


ఇది వరకు సంగీత దర్శకులే ఈ పని చేసేవారు కదా..?  

సింహాద్రికి నేనే చేశా. సౌండ్‌ డిజైనింగ్‌  అంటే ఫైనల్‌ మిక్స్‌ లో కూర్చోవడం.  అట్మాస్‌, డీటీఎస్‌ చేేస ఇంజనీర్లు పక్కన దర్శకుడు, సంగీత దర్శకుడు కూర్చుని పని చేయించుకోవాలి. అప్పుడు నా వయసు తక్కువ. ఇప్పుడు నా వయసు 60. వయసు పైబడే కొద్ది  ప్రతి క్షణం ఉత్సాహం ఉండలేము. నా సినిమాలు కొన్నింటికి కల్యాణీ మాలిక్‌ పనిచేశాడు. ప్రతీ సినిమాకీ సౌండ్‌ డిజైనర్‌ ఉండాలని లేదు. ప్రతిష్టాత్మక చిత్రాలకైతే తప్పని సరి.   


బాలీవుడ్‌లో ఒక్కో పాట ఒకొక్కరితో చేయించుకునే సంప్రదాయం ఉంది. దాన్ని మీరెలా చూస్తారు?

ఇక్కడ ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాకి అలానే జరిగీంది. ఆ సినిమాకి నలుగురు సంగీత దర్శకులు పనిచేశారు. ఈ సినిమాకి మ్యూజిక్‌ ఎవరని అడిగితే.. నేనే.. ‘సకోమికి’ అనేవాడ్ని. అంటే జపనీస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కాదు. సలీం సులేమాన్‌, కోటి, మిక్కీ జే మేయర్‌, కీరవాణి. (నవ్వుతూ) అయితే ఈ సంప్రదాయం వల్ల సంగీత దర్శకుడు సినిమాని ఓన్‌ చేసుకోలేడు. ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా వుంటుంది. 


సినిమాలకు పాటలే అవసరం లేదని సీతారామశాస్ర్తిగారు ఓ సందర్భంలో అన్నారు. మీరు దాంతో ఏకీ భవిస్తారా?

ఆయన ఏ సందర్భంలో అన్నారో తెలీదు. కానీ నాకు తెలిసి.. డ్యాన్స్‌ పాటలు వద్దు అని ఉంటారు. దాని వల్ల బడ్జెట్‌ పెరుగుతుంది తప్ప, పెద్దగా ఉపయోగం ఉండదు. ‘కొత్తబంగారు లోకం’లో ‘నీ ప్రశ్నలు నీవే’ అనే పాట వుంది. దానికేం ఖర్చు వుంటుంది. పైగా ఆ పాట కథని ముందుకు తీసుకెళుతుంది  


ఓ గాయకుడిగా మీ అబ్బాయి కాలభైరవకి ఎన్ని మార్కులేస్తారు?  

మా అబ్బాయికి నేను మార్కులు వేయకూడదు. నాకు నేను మార్కులేసుకోవడం ఎంత సమంజసం కాదో మా అబ్బాయికి మార్కులేయడం కూడా అంతే అసమంజసం.

 

పోనీ.. ఓ తండ్రిగా ఎలాంటి సలహా ఇస్తారు?

వాళ్లకి అన్నీ తెలుసు. వాళ్ళ ఈడు వాళ్లతో తిరిగుతున్నాడు. నేర్చుకుంటున్నాడు. అయితే సహనంగా ఉండమని చెబుతాను. ఇక్కడ ఆవేశం పనికిరాదు. ఎంత సహనంగా వుంటే అంత మంచిది. 


సహనాన్ని మీరు ఎలా అలవాటు చేసుకున్నారు ? 

నాకు సహనం లేదండీ( నవ్వుతూ). లేదు కాబట్టే నాకు తగిలిన దెబ్బల గురించి చెబుతుంటాను. నా సక్సెస్‌ నుంచే కాదు. ఫెయిల్యూర్‌ నుంచి కూడా నేర్చుకోవచ్చు. 


పుస్తకం రాేస ఆలోచన ఉందా ? 

 ఆలోచన వున్నా కార్యరూపంలో పెట్టే పరిస్థితి లేదు. బుక్‌ రీడింగ్‌ కూడా బాగా తగ్గిపోతోంది. ఏం చెప్పినా సినిమా ద్వారా, వీడియోల ద్వారా చెప్పాలి.

 

ఈ మధ్య చదివిన పుస్తకం ? 

మృణాళిని గారు రాసిన తాంబూలం చదివా. బావుంది. నా అనుభావాలు ఎప్పుడైనా రాస్తే.. ఇలా వ్యాస రూపంలో రాయాలని ఉంది. కొంచెం హాస్యం జోడించిన రచనలంటే అంటే ఇష్టం. ముళ్లపూడి వారి రాజకీయ బేతాళ పంచవింశతి పూర్తిగా చదివా. కోతికొమ్మచ్చి కొంత చదివా.


రాజమౌళిని ఒక సంగీత దర్శకుడిగా, ప్రేక్షకుడిగా, ఇంట్లో సభ్యుడిగా చూసినప్పుడు ఏమైనా తేడా వుంటుందా? 

 నేను ప్రేక్షకుడిగా ఎప్పుడూ చూడలేదు. మొదటి రోజు మొదటి అట చూేస వరకూ సినిమా గురించి ఏమీ తెలియకపోతే ప్రేక్షకుడు అంటాం. కానీ రాజమౌళి చేేస ప్రతి సినిమా నాకు మొదటి నుంచి అంతా తెలుసు. ఇక సంగీత దర్శకుడిగా, ఇంట్లో సభ్యుడిగా వేరువేరుగా చూడటం అంటూ వుండదు. కాఫీ తాగినపుడు కాఫీ పౌడర్‌, పంచాదార, పాలు.. విడదీసి చూడలేం. ఇది కూడా అంతే.


                                                                                                                        

Updated Date - 2022-04-10T05:38:00+05:30 IST