‘అఖండ’లో చేసింది నేనేనా.. అని నాకే డౌట్ వచ్చింది: బాలయ్య

ABN , First Publish Date - 2021-12-04T02:19:20+05:30 IST

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన‌ హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని హైద‌రాబాద్‌లోని

‘అఖండ’లో చేసింది నేనేనా.. అని నాకే డౌట్ వచ్చింది: బాలయ్య

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన‌ హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని హైద‌రాబాద్‌లోని ఏఎంబి మాల్‌లో ప్ర‌త్యేకంగా వీక్షించిన అనంతరం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, తమన్, మిర్యాల రవిందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఆనాడు రామాయణానికి రూపం ఇచ్చింది వాల్మీకి. ఈనాడు ‘అఖండ’ సినిమా ఇంత బాగా తీర్చిదిద్దాడు బోయపాటి. ఒకనాడు భక్తిని బతికించింది రామారావుగారు. ఈనాడు సినిమాను బతికించింది భక్తి. ఆ విషయం చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమాను ఇంత విజయాన్ని చేకూర్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి సినిమా ఎప్పుడూ వచ్చినా కూడా ఆదరిస్తారు అని చెప్పడానికి ఈ చిత్రమే నిదర్శనం. ఇది చలనచిత్ర పరిశ్రమ విజయం. ఈ సినిమా కోసం 21 నెలలు కష్టపడ్డాం. ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి, ఎంతో ఓపికపట్టి చేశారు. రకరకాల లొకేషన్లలో సినిమాను షూట్ చేశాం. కరోనా ఎంత ప్రాణాంతకమైనా.. లెక్కచేయలేదు. మంచి సినిమా చేస్తున్నాం.. చిరస్థాయిగా నిలిచిపోతామన్న సంకల్పంతో పని చేశాం. దానికి ఈ ఫలితమే నిదర్శనం. 


అఖండ ఓ పౌరాణికి చిత్రం. భగవంతుడిని కరుణించమని అడుగు.. కనిపించమని కాదు వంటి ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం యావత్ ఇండస్ట్రీ ఎదురుచూసింది. ఈ అఖండకు అఖండమైన విజయం చేకూర్చారు. సినిమాను ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్పను. అభినందనలు తెలియజేస్తాను. ఇలాంటి సినిమాలను ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులకు అభినందనలు. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. తిరిగి రాయాలన్నా మేమే.. ఆనాడు రామారావు గారు సినిమా మాధ్యమం ద్వారా భక్తిని కాపాడారు. మున్ముందు తరాలకు కూడా భక్తి అంటే ఏంటో చూపిస్తాం. భక్తి అంటే విల్ పవర్. ధృడ సంకల్పం. ఇప్పుడే సినిమాను చూశాను. ఇందులో చేసింది బాలకృష్ణనా? అని నాకే డౌట్ వచ్చింది. మంచి చిత్రాలతో, మంచి పనులతో సమాజానికి సేవ చేసేందుకు నాకు అదృష్టం దొరికింది. తమన్ మంచి సంగీతాన్ని అందించారు. చేసే పనిలోనే దైవం ఉంటుంది. మేం ఆ పనినే నమ్ముకుంటాం. ఈ ఇండస్ట్రీనే నమ్ముకుని ఉంటాం. సినిమాయే మాకు దైవం..’’ అని అన్నారు.

Updated Date - 2021-12-04T02:19:20+05:30 IST