TFI sequels : సీక్వెల్స్‌కు మంచి రోజులొచ్చాయా?

ABN , First Publish Date - 2022-08-23T22:19:30+05:30 IST

టాలీవుడ్‌లో కొంతకాలంగా సీక్వెల్స్‌కు కాలం కలిసిరావడం లేదు. సూపర్ హిట్ అయి ప్రేక్షకాదరణ పొందిన పలు చిత్రాలకు గతంలో రెండో భాగాలు తెరకెక్కాయి. అయితే అవన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరం పరాజయం పాలయ్యాయి. అవే పాత్రలతో డిఫరెంట్ కథాంశంతో రూపొందేవే సీక్వెల్స్. అయితే మొదటి భాగంలో మంచి కథాంశం ఎంపిక చేసుకొన్న దర్శకులు .. రెండో భాగం దగ్గరకు వచ్చేసరికి పేలమైన కథాంశాలతో సినిమాలు తీశారు.

TFI sequels : సీక్వెల్స్‌కు మంచి రోజులొచ్చాయా?

టాలీవుడ్‌లో కొంతకాలంగా సీక్వెల్స్‌కు కాలం కలిసిరావడం లేదు. సూపర్ హిట్ అయి ప్రేక్షకాదరణ పొందిన పలు చిత్రాలకు గతంలో రెండో భాగాలు తెరకెక్కాయి. అయితే అవన్నీ  బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి. అవే పాత్రలతో డిఫరెంట్ కథాంశంతో రూపొందేవే సీక్వెల్స్. అయితే మొదటి భాగంలో మంచి కథాంశం ఎంపిక చేసుకొన్న దర్శకులు .. రెండో భాగం దగ్గరకు వచ్చేసరికి పేలమైన కథాంశాలతో సినిమాలు తీశారు. దాని కారణంగా ఆ సినిమాల్ని ప్రేక్షకులు తిప్పి కొట్టారు. అందుకే టాలీవుడ్ కు సీక్వెల్ గండం ఉందనే పేరు ఉండిపోయింది. ఇతర భాషల్లో అయితే నాలుగైదు భాగాలు రూపొందినా.. ఏ కథకు ఆకథ ఫ్రెష్ గా వినూత్నంగా ఉండడం వల్ల ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తమిళంలో ‘ముని’ (Muni) సిరీస్, ‘సింగం (Singham)’ సిరీస్ ఏ స్థాయిలో హిట్టయ్యాయో తెలిసిందే. 


శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో సూపర్ హిట్టైన ‘మనీ’ (Money) చిత్రానికి ‘మనీ మనీ’ (Money Money) అంటూ సీక్వెల్ వచ్చింది. కానీ ‘మనీ’ చిత్రంలోలా ఆకట్టుకొనే అంశాలూ, కామెడీ సన్నివేశాలు ‘మనీమనీ’ లో అంతగా లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ‘గాయం’ (Gayam) చిత్రానికి సీక్వెల్ ‘గాయం 2’, అలాగే ఆయన సినిమానే అయిన సూపర్ హిట్ చిత్రం ‘సత్య’ (Satya) కు ‘సత్య 2’ తెరకెక్కగా ఈ రెండు చిత్రాలూ పరాజయం పాలయ్యాయి. ఇంకా అల్లు అర్జున్, సుకుమార్ తొలి కలయికలో రూపొందిన ‘ఆర్య’ (Arya) కు సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్ దాదా యంబీబీయస్’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ‘శంకర్‌దాదా జిందాబాద్’ సైతం అభిమానుల్ని నిరాశపరిచింది. ఇంకా రవితేజ హీరోగా సురేంద్ర రెడ్డి తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ‘కిక్ 2’ చిత్రం కూడా ఘోరపరాజయం పాలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ కు సీక్వెల్‌గా వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా కూడా అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.  


అలా..  కాలం కలిసి రాకపోవడంతో టాలీవుడ్‌లో కొంతకాలం సీక్వెల్స్ తీయడానికి దర్శక నిర్మాతలు భయపడేవారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ సీక్వెల్ గండం నుంచి బైటపడినట్టు చెప్పుకోవచ్చు. వెంకటేశ్ (Venkatesh) హీరోగా గతేడాది ఓటీటీలో విడుదలైన ‘ద‌ృశ్యం 2’ (Drishyam 2) చిత్రం ఏ స్థాయిలో హిట్టయిందో తెలిసిందే. మలయాళ చిత్రానికి రీమేక్ అయినప్పటికీ అందులోని థ్రిల్లింగ్ అంశాల్ని ప్రేక్షకుల్ని మెప్పించాయి. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘పెళ్ళిసందడి’ (Pelli Sandadi) కి సీక్వెల్ గా గతేడాది విడుదలైన ‘పెళ్ళిసందD’ చిత్రం అనూహ్యంగా హిట్టైంది. రివ్యూస్, నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ.. నిర్మాతలకు మంచి లాభాలొచ్చాయి. ఇక ఈ సమ్మర్ కానుకగా విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన ‘ఎఫ్ 3’ (F3) చిత్రం కూడా సూపర్ హిట్టైంది. సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) చిత్రం ఏ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోందో తెలిసిందే. గతంలో సూపర్ హిట్టైన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల్ని బాగా థ్రిల్ చేసింది. త్వరలో ‘హిట్ 2 , గూఢచారి 2, డిజె టిల్లు 2, బింబిసార 2, కార్తికేయ 3, ఎఫ్ 4’ లాంటి సీక్వెల్ చిత్రాలు మరింత ఆసక్తికరమైన కథాంశాలతో రాబోతున్నాయి. వీటిలో ఎన్ని సినిమాలు సూపర్ హిట్టయి పాజిటివ్ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తాయో చూడాలి. 

Updated Date - 2022-08-23T22:19:30+05:30 IST