‘అతిథిదేవోభ‌వ‌’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2022-01-08T02:30:11+05:30 IST

అభయ్ (ఆది సాయికుమార్)కు పుట్టుకతోనే మోనోఫోబియా అనే సమస్య వస్తుంది. మోనోఫోబియా అంటే.. మారుతి సినిమాలలో హీరోలకి ఉండే మతిమరువు, అతి శుభ్రత, అతి భయం వంటిదే. కాకపోతే ఇది కాస్త ప్రమాదకరమైనదన్నమాట. అంటే..

‘అతిథిదేవోభ‌వ‌’ మూవీ రివ్యూ

చిత్రం: ‘అతిథిదేవోభ‌వ‌’

న‌టీన‌టులు: ఆది సాయికుమార్‌, నువేక్ష‌, రోహిణి, స‌ప్త‌గిరి, ఆదర్శ్‌ బాల‌కృష్ణ, రఘు త‌దిత‌రులు 

విడుద‌ల తేదీ: 07, జనవరి 2022

సమర్పణ: రాం సత్యనారాయణ రెడ్డి

బ్యానర్: శ్రీనివాస సినీ క్రియేషన్స్

సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌ 

ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్ 

సినిమాటోగ్రఫీ: అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి 

నిర్మాతలు: రాజాబాబు మిర్యాల‌, అశోక్ రెడ్డి మిర్యాల‌

ద‌ర్శ‌క‌త్వం: పొలిమేర నాగేశ్వ‌ర్‌ 


‘మాతృదేవోభవ’, ‘పితృదేవోభవ’, ‘అతిథిదేవోభవ’ వంటి పదాలు భారతీయతకు పెట్టని కోటలు. ఇప్పుడు ‘అతిథిదేవోభవ’ అనే టైటిల్‌తో ఆది సాయికుమార్ ఓ చిత్రం చేస్తున్నాడు అనగానే.. ఇదేదో చక్కని ఫ్యామిలీ కథా చిత్రమనే భావన అందరిలో వచ్చేసింది. పోస్టర్స్, ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమాలో ఏదో కొత్త విషయం చెబుతున్నారనేది స్పష్టమైంది. ఇక కరోనా ఒమైక్రాన్ రూపంలో చిన్న సినిమాలకు మంచి స్పేస్ దొరికినట్లయింది. ఈ స్పేస్‌ని వినియోగించుకునేందుకు నేడు(శుక్రవారం) థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో సమీక్షలో తెలుసుకుందాం.  


కథ:

అభయ్ (ఆది సాయికుమార్)కు పుట్టుకతోనే మోనోఫోబియా అనే సమస్య వస్తుంది. మోనోఫోబియా అంటే.. మారుతి సినిమాలలో హీరోలకి ఉండే మతిమరువు, అతి శుభ్రత, అతి భయం వంటిదే. కాకపోతే ఇది కాస్త ప్రమాదకరమైనదన్నమాట. అంటే ఒంటరితనం భరించలేకపోవడం. పక్కన ఎవరైనా లేకపోతే చనిపోవాలని అనిపించడం వంటి లోపం ఉన్న అభి, ఎప్పుడూ మరో మనిషి తోడు ఉండాలని భావిస్తుంటాడు. అతని లోపం కారణంగా ఒకసారి లవ్ ఫెయిల్ అవుతుంది. అలాంటి అతని జీవితంలోకి వైష్ణవి (నువేక్ష) వస్తుంది. ఇద్దరూ ప్రేమించుకుంటున్న తరుణంలో.. వారి ప్రేమకు కూడా అతనికి ఉన్న లోపం అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. తన లోపం గురించి అభయ్ తన ప్రియురాలికి అసలు నిజం చెప్పాడా? ఆమె ప్రేమను పొందడం కోసం చేసే ప్రయత్నాల్లో తనకున్న లోపం తెచ్చిపెట్టిన సమస్యలు ఏమిటి? చివరకు ఈ జంట కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:

ఈ సినిమా చూస్తున్నంత సేపూ డైరెక్టర్ మారుతి చిత్రాలు గుర్తుకు రాకమానవు. మారుతి పరంగా చెప్పాలంటే.. ఈ పాయింట్‌తో ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేసి మంచి హిట్ కొట్టవచ్చు. కానీ దర్శకుడు మారుతి వే లో వెళ్లకుండా కొత్తగా ట్రై చేయాలని చూశాడు. సినిమా పేరు చూసి అంతా ఇదేదో మంచి క్లాసిక్ టచ్ ఉన్న చిత్రమని భావిస్తారు. హీరో తన పక్కన ఎప్పుడూ ఒక మనిషి తోడు కోరుకుంటాడు కాబట్టే.. ఈ చిత్రానికి ‘అతిథిదేవోభవ’ అనే టైటిల్ పెట్టి ఉంటాడు దర్శకుడు. కాకపోతే ఈ సినిమా నడిచిన తీరు మాత్రం అలా ఉండదు. సైకో థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ వస్తుంది. సినిమా చూసే ప్రతి ఒక్కరూ ఈ పాయింట్‌తో మారుతి అయితేనా.. అని అనుకుంటారు. దర్శకుడు పొలిమేర నాగేశ్వ‌ర్‌ కూడా కథకు అనుగుణంగా తను రాసుకున్న సన్నివేశాలను అంతే సిన్సియర్‌గా తెరకెక్కించారు. నటీనటుల నుండి మంచి నటనను రాబట్టాడు. డిఫరెంట్ వేరియేషన్స్‌లో ఆది సాయికుమార్‌ నటన ఆకట్టుకుంటుంది. ఇంతకుముందు ఆది ఈ తరహా పాత్ర చేయలేదు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో తన మార్క్ నటనని ఆది ఇందులో ప్రదర్శించాడు. గ్లామర్ విషయంలోనూ, ప్రేమ సన్నివేశాల్లో నువేక్ష హావభావాలు బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే హీరోయిన్‌గా ఆమె పేరు ఇంకొన్ని సినిమాలకు వినబడే అవకాశం ఉంది. ఆది తల్లి పాత్రలో రోహిణి నటన మెప్పిస్తుంది. ఆమెకి చాలా మంచి పాత్ర పడింది. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా సప్తగిరి మరోసారి తన మార్క్‌ని ప్రదర్శించాడు. ప్రేక్షకులను కాసేపు కడుపుబ్బా నవ్విస్తాడు. రఘు కారుమంచి, రవిప్రకాశ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ వంటి మిగిలిన నటీనటులందరూ తమకిచ్చిన పాత్రల్లో బాగానే నటించారు. సాంకేతికత పరంగా ఈ చిత్రానికి సంగీతం పెద్ద ఎస్సెట్. పాటలు అలాగే నేపథ్య సంగీతం బాగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ కూడా మంచి ఫీల్‌‌ని ఇస్తోంది. ఎడిటింగ్ విషయంలో కత్తెర పడే సీన్లు చాలా ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ పరంగా సినిమాకి ఏది కావాలో అది నిర్మాతలు సమకూర్చారు. ఈ కథకి మెయిన్ పాయింట్‌ అయిన ‘మోనోఫోబియా’ని సరికొత్తగా ప్రజంట్ చేయాలనే విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు కానీ.. ప్రేక్షకులు దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపైనే ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంది.


ట్యాగ్‌లైన్: కొత్తగా ట్రై చేశారు.. కానీ!!

Updated Date - 2022-01-08T02:30:11+05:30 IST