బన్నీతో సినిమా ఎప్పుడని అడుగుతున్నారు

ABN , First Publish Date - 2022-02-13T05:30:00+05:30 IST

అలియా భట్‌... ఓ టాప్‌ స్టార్‌. చాలా తక్కువ వయసులోనే స్టార్‌ హోదా

బన్నీతో సినిమా ఎప్పుడని అడుగుతున్నారు

అలియా భట్‌... ఓ టాప్‌ స్టార్‌. చాలా తక్కువ వయసులోనే స్టార్‌ హోదా దక్కించుకుంది. ఆమె ఎంచుకున్న  సినిమాలూ భిన్నంగా ఉంటాయి. అందుకు మరోసాక్ష్యం ‘గంగూబాయ్‌’. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గురించి అలియా చెప్పిన కబుర్లు..


‘గంగూబాయ్‌’ పాత్ర చేయడానికి మీకు ప్రేరణ కలిగించిన అంశాలేంటి ?

స్ర్కిప్టు చదివినప్పుడు ఈ పాత్ర నేను చేయగలనా? అనే అనుమానం కలిగింది. వయసు పెరుగుతున్నా.. ఇప్పటికీ బబ్లీగానే కనిపిస్తాను. నా మొహం అమాయకంగా కనిపిస్తుంది. గంగూబాయ్‌ ది బరువైన పాత్ర. రఫ్‌గా ఉండాలి. అలాంటి పాత్ర నాతో ఎలా? ఇదే ప్రశ్న దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ ముందు వుంచాను. ‘ఏం భయపడకు. నేను చెప్పింది చేయ్‌ సరిపొతుంది’ అన్నారు. నిజం చెప్పాలంటే నాకు సంజయ్‌ సర్‌ సినిమా అంటే పిచ్చి. తొమ్మిదేళ్ళు వున్నప్పుడు ‘బ్లాక్‌’ సినిమా ఆడిషన్స్‌ కి వెళ్లాను. కానీ సెలెక్ట్‌  కాలేదు. ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేయాలని వుంది. ఇప్పటికి ఆ కల నెరవేరింది.


గంగూబాయ్‌ పాత్ర కోసం దర్శకుడు ఏమైనా సూచనలు చేశారా ?

నా గొంతు కొంచెం లేతగా వుంటుంది. గంగూబాయ్‌ పాత్రకు బేస్‌ వాయిస్‌ కావాలి. డానికి తోడు గంగూబాయ్‌ గుజరాతీ యాస మాట్లాడాలి. ఈ రెండిటి కోసం చాలా కసరత్తులు చేసి చివరికి పాత్రకు కావాల్సినట్టుగా వాయిస్‌, యాస సాధించా.


ఈ పాత్ర కోసం బరువు పెరిగారా ?

బాగా తిని షూటింగ్‌ రమ్మని సంజయ్‌ సర్‌  చెప్పారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎవరూ నాతో ఇలా చెప్పలేదు.. (నవ్వుతూ). షూటింగ్‌ జరిగినంత కాలం బాగా తిన్నాను. ఆ రకంగా కాస్త బరువు పెరిగాను.  


షూటింగ్‌ సమయంలో సవాల్‌ విసిరిన సందర్భాలేంటి?

ఇది ఒక వేశ్య పాత్ర. మొదట ఆ పాత్రతో ప్రేమలో పడాలి. ఆమె ఎలా మాట్లాడుతుంది? ఎలా ఆలోచిస్తుంది ? ఎలా ఫీలౌతుంది ? ఇవన్నీ ఆపాదించుకోవాలి. గంగూబాయ్‌ ప్రపంచం వేరు. ఆ ప్రపంచంలోకి వెళ్ళాలి. నేనూ అదే చేశా. ఈ పాత్రలో ఎంతగా ఇన్వాల్వ్‌ అయ్యానంటే కొన్నిసార్లు ఇంట్లో కూడా గంగూబాయ్‌ లా మాట్లాడేదాన్ని. నన్ను చూసి ‘అమ్మా.. కొంచెం తగ్గు.. నువ్వు గంగూబాయ్‌ కాదు.. అదంతా సెట్లోనే’ అనేవారు.  


పాన్‌ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారా?

నాకు శ్రీదేవి ఆదర్శం. ఆమె ఒక దశలో తెలుగు తమిళ్‌ హిందీ.. మూడు భాషల్లో నంబర్‌ వన్‌ హీరోయిన్‌. నాకు నంబర్‌ గేమ్‌ పై ఆసక్తి లేదు కానీ పాన్‌ ఇండియా ప్రేక్షకుల హృదయాల్లో వుండాలని కోరిక.


సంజయ్‌ లీలా బన్సాలీకీ మిగతా దర్శకులకు తేడా ఏం గమనించారు ?

నేను దర్శకులని ఒకరితో ఒకరిని పోల్చను. సంజయ్‌ లీలా బన్సాలీ గ్రేట్‌ ఆర్టిస్ట్‌ ఆయన ఒక మ్యూజిషియన్‌. ఆయన సినిమాలో ప్రతి చిన్న విషయం చాలా వివరంగా వుంటుంది. వెనక నుంచి తీసే షాట్‌లో కూడా ఆయనకు ఒక లెక్క వుంటుంది. నడుస్తున్న షాట్‌ తీస్తున్నామనుకోండి.. ‘నీ వీపు కూడా ఏదో ఎమోషన్‌ కన్వే చేయాలి’ అంటారు. అంత లోతుగా ఆలోచించడం చాలా కష్టం.


చీకటి ప్రపంచం నుంచి వచ్చిన గంగూబాయ్‌ బయోపిక్‌ తీయాలని ఎందుకనిపించింది ?

నిజమే. ఒక వేశ్య బయోపిక్‌ తీయాలని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఆమె ఒక చీకటి ప్రపంచం నుంచి వచ్చింది. అయితే చీకటి ప్రపంచం నుంచి వచ్చిన మాత్రాన ఆమె సమాజం కోసం ఏమీ చేయలేదని అర్ధం కాదు. చీకటి ప్రపంచంలో ఉన్నంతమాత్రాన ఆమె చెడ్డ వ్యక్తి కాదు. ఆమె జీవితంలో పోరాటం వుంది. ఆ పోరాటం ఎవరి కోసం అనేది ఈ సినిమాలో అద్భుతమైన అంశం.



మీ చివరి రెండు చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి. ఆ విషయంలో ఒత్తిడి ఉందా?

సినిమాలని అంచనా వేయలేం. సినిమా అనేది రంగుల రాట్నం. ఎత్తుపల్లాలు కామన్‌. అయితే ఈ సినిమా మాత్రం నిరాశ పరచదు.


నెపోటిజం గురించి బాలీవుడ్‌లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. దీని గురించి ఏం చెప్తారు ?

 సోషల్‌ మీడియాలో ఎక్కువగా నెపోటిజం పై నెగిటివ్‌ చర్చ జరుగుతూ వుంటుంది. ఎవరి అభిప్రాయాలు వారివి. సినిమా కూడా ఒక వ్యాపారం. ప్రేక్షకులు ఇష్టపడితేనే ఇక్కడ వుంటాం. మన చేసేపని నచ్చకపొతే ఇక్కడ ఎవరికీ వుండే అవకాశం లేదు. ఉత్తిపుణ్యాని తమ జేబులో డబ్బులు తీసి ఎవరూ ఖర్చు చేయరు. ప్రేక్షకులకు నచ్చితేనే ఇక్కడ మనుగడ వుంటుంది.

 

ఎన్టీఆర్‌, కొరటాల శివ సినిమా గురించి?

తారక్‌ తో మళ్ళీ పని చేయడం ఆనందంగా వుంది. దర్శకుడి శివగారితో మాట్లాడా. చిరంజీవి గారు, చరణ్‌ తో చేస్తున్న ఆచార్య సినిమా కోసం ఎదురుచూస్తున్నా. కొత్త సినిమా గురించి ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.



‘‘పుష్ప సినిమా చూశా. చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా బన్నీ నటన మరింత నచ్చింది. మా ఇంట్లో అంతా బన్నీ నటన గురించే మాట్లాడుకున్నారు. నన్ను అంతా ఆలూ అని ముద్దుగా పిలుచుకుంటారు. బన్నీని అల్లూ అంటారు కదా..? అందుకే ‘అల్లుతో.. ఆలూ సినిమా ఎప్పుడు’ అని అడుగుతున్నారు. చూద్దాం.. ఆ అవకాశం ఎప్పుడొస్తుందో..? టాలీవుడ్‌లో చాలా పెద్ద స్టార్లు ఉన్నారు. వాళ్లంతా పాన్‌ ఇండియా సినిమాల రూపంలో బాలీవుడ్‌కి రావడం ఆనందంగా ఉంది’’ 


Updated Date - 2022-02-13T05:30:00+05:30 IST