‘అసలు ఏం జరిగిందంటే..’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2021-10-03T02:57:02+05:30 IST

‘పెదరాయుడు, ఆహా, పెళ్లి చేసుకుందాం, దేవి’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరోగా చేసిన చిత్రం ‘అసలు ఏం జరిగిందంటే..’. ట్రయాంగిల్ లవ్ స్టొరీతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల తర్వాత మంచి క్రేజ్‌నే ఏర్పరచుకుంది..

‘అసలు ఏం జరిగిందంటే..’ మూవీ రివ్యూ

చిత్రం: ‘అసలు ఏం జరిగిందంటే..’

విడుదల తేదీ: 01, అక్టోబర్ 2021

నటీనటులు: మహేంద్రన్, శ్రీపల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్, కుమనన్ సేతురామన్, హరితేజ, షఫీ తదితరులు

బ్యానర్: ఏబీఆర్ ప్రొడక్షన్స్

సమర్పణ: అనిల్ బొద్దిరెడ్డి

సంగీతం: చరణ్ అర్జున్

ఎడిటింగ్: ప్రతాప్ కుమార్

సినిమాటోగ్రఫీ: కర్ణ ప్యారసాని

నిర్మాతలు: జి.ఎస్. ఫిలింస్

రచన, దర్శకత్వం: శ్రీనివాస్ బండారి


‘పెదరాయుడు, ఆహా, పెళ్లి చేసుకుందాం, దేవి’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరోగా చేసిన చిత్రం ‘అసలు ఏం జరిగిందంటే..’. ట్రయాంగిల్ లవ్ స్టొరీతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల తర్వాత మంచి క్రేజ్‌నే ఏర్పరచుకుంది. ప్రొమోషన్ పరంగా కాస్త వీక్‌గా నడిచినా.. మహేంద్రన్ హీరో అనే పాయింట్ ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. పోస్టర్స్ కూడా ఈ సినిమాలో ఏదో మ్యాటర్ ఉన్నట్లే కనిపించాయి. మరి ఆ మ్యాటరేంటో, ట్రైలర్ తర్వాత వచ్చిన క్రేజ్‌ని.. విడుదల తర్వాత ఈ సినిమా కాపాడుకుందో, లేదో రివ్యూలో చూద్దాం. 


కథ: 

చిన్నప్పటి నుండి వాసు(మహేంద్రన్), సావిత్రి(కారుణ్య చౌదరి)కి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. పెరిగే కొద్ది ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది. అయితే వీరి బంధాన్ని ఇష్టపడని సావిత్రి తరుపు బంధువు(షపీ) వీరిపై లేనిపోని నిందలు వేసి విడిపోయేలా చేస్తాడు. ఆ గ్రామం వదిలి పట్టణం వెళ్లిపోయిన వాసు జాబ్ చేసుకుంటూ ఉన్నా.. సావిత్రిని మరిచిపోలేడు. సావిత్రి కూడా వాసునే మనసులో దాచుకుంటుంది. ఆ తర్వాత వీరిద్దరూ అనుకోకుండా కలిసి, ఒకరినొకరు గుర్తుపడతారు. పెద్దవారిని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతారు. రెండు రోజుల్లో పెళ్లి అనగా బండిపై వెళుతున్న వీరిద్దరికి యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ యాక్సిడెంట్‌లో సావిత్రి చనిపోతే.. వాసు గతం మరిచిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి వాసు లైఫ్‌లోకి సావిక(శ్రీపల్లవి) అనే మరో అమ్మాయి వస్తుంది. గతం మర్చిపోయి ఇబ్బంది పడుతున్న వాసుని కంటికి రెప్పలా కాపాడుతుంటుంది. సావిత్రి, సావిక ఇద్దరినీ సావి అనే పిలుస్తుంటారు. ఇక్కడ రెండోసారి వాసు లైఫ్‌లోకి వచ్చిన సావి ఎవరు? ఎందుకు అతన్ని రక్షిస్తుంది? వాసు, సావిత్రికి యాక్సిడెంట్‌ జరగడానికి కారణం ఏంటి? యాక్సిడెంట్ తర్వాత అసలు ఏం జరిగింది? వీరి కథలోకి మంత్ర విద్యలు కలిగిన కుమనన్ సేతురామన్ ఎందుకు వచ్చాడు? చివరికి వాసు, సావిల ప్రేమకథ ఏమైంది?.. అనే ఆసక్తికర విషయాలకు థ్రిల్లింగ్ అంశాలతో కూడిన సమాధానమే మిగతా కథ.


విశ్లేషణ:

వాసుగా మహేంద్రన్ పాత్ర విభిన్నంగా ఉంటుంది. అంతే విభిన్నంగా మహేంద్రన్ ఈ పాత్రలో మెప్పించాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న పట్టు కారణంగా.. మహేంద్రన్ ఈ పాత్రను ఈజీగా చేశాడనిపిస్తుంది. అతని పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సావికగా చేసిన శ్రీపల్లవి చాలా అందంగా కనిపించింది. కరోణ్య కత్రిన్, కారుణ్య చౌదరి పాత్రలు కూడా దర్శకుడు చక్కగా డిజైన్ చేశాడు. వారు కూడా వారి నటనతో ఆకట్టుకుంటారు. రమణా లోడెత్తాలిరా కుమనన్‌కు మరో మంచి పాత్ర పడింది. గంభీరంగా, శాంత స్వభావిగా కుమనన్ ఇటువంటి పాత్రలు కూడా చేయగలనని నిరూపించుకున్నాడు. ఇంకా షఫీ, హరితేజలకు కూడా మంచి పాత్రలు పడ్డాయి. మిగతా ఆర్టిస్ట్‌లందరూ వారి పాత్రల పరిధిమేర నటించారు.


సాంకేతికంగా చరణ్ అర్జున్ ఇచ్చిన నేపథ్య సంగీతం, కర్ణ ప్యారసాని ఫొటోగ్రఫీ సినిమా ప్రేక్షకులకు రీచ్ కావడానికి ప్రధాన స్థానం తీసుకున్నాయి. రెండు పాటలు బాగున్నాయి.. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఓ సాంగ్ బాగా అలరిస్తుంది. పల్లెటూరి వాతావరణాన్ని బహు చక్కగా బంధించాడు కర్ణ ప్యారసాని. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహించాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు సినిమా ఫ్లోకి అడ్డుపడ్డాయనిపిస్తుంది. లొకేషన్లు కొత్తగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు ఇందులో చెప్పాలనుకున్న మెయిన్ అంశం ‘ప్రేమకు మరణం లేదు’ అని చెప్పడమే. ఇదే బ్యాక్‌డ్రాప్‌లో తను ఏదైతే కథ రాసుకున్నాడో దానిని దర్శకుడు శ్రీనివాస్ బండారి తడబడకుండా తెరకెక్కించాడు. ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లీన్‌గా తెరకెక్కించాడు. అతని ప్రయత్నానికి వంక పెట్టలేం కానీ.. సరైనా ఆర్టిస్ట్‌లను చూస్ చేసుకోలేదనిపిస్తుంది. ఇందులోని కొన్ని పాత్రలకు సరైన ఆర్టిస్ట్‌లు పడి ఉంటే ఈ సినిమా స్థాయి వేరేలా ఉండేది. కామెడీ సన్నివేశాలు కావాలని ఇరికించినట్లుగా ఉంటాయి. అంతర్లీనంగా హెల్మెట్‌పై ఆయన ఇచ్చిన మెసేజ్‌‌తో పాటు ‘నీ ప్రేమలో నిజాయితీ ఉంటే సృష్టి సైతం నీ ప్రేమను నీకు మరింత దగ్గర చేయడానికే ప్రయత్నిస్తుంది’ అనే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సినిమా చూస్తున్నంత సేపూ ‘ఎందుకంటే ప్రేమంట, రఘువరన్ బి.టెక్, నిన్నే ప్రేమిస్తా..’ లోని మెయిన్ పాయింట్స్ గుర్తుకు వస్తాయి కానీ.. టైటిల్‌కి తగ్గట్టుగా నెక్ట్స్ ఏం జరుగుతుంది? అనే సస్పెన్స్‌ను ఆడియన్స్‌లో క్రియేట్ చేయడంలో దర్శకుడు తన నైపుణ్యతను కనబరిచాడు. మొత్తంగా చూస్తే కొన్ని సీన్లు డిజప్పాయింట్ చేసినా.. చూస్తున్న ప్రేక్షకుడికి ప్రేమ గురించి చెప్పిన తీరు, సస్పెన్స్ అంశాలు నచ్చుతాయి.

ట్యాగ్‌లైన్: ప్రేమ పవర్‌ని కొత్తగా ఆవిష్కరించే చిత్రం

Updated Date - 2021-10-03T02:57:02+05:30 IST