Aryan Khan లాయర్ కొత్త డిమాండ్.. ఆమెను ఇబ్బందులు పెడుతున్నారంటూ..

ABN , First Publish Date - 2022-05-31T18:28:05+05:30 IST

క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే...

Aryan Khan లాయర్ కొత్త డిమాండ్.. ఆమెను ఇబ్బందులు పెడుతున్నారంటూ..

క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అతని వద్ద ఎటువంటి డ్రగ్స్ లభ్యం కాలేదరని, ఇతర నిందితులతో కలిసి డ్రగ్స్ వాడినట్లు ఎటువంటి రుజువులు లేవని ఎన్‌సీ‌బీ తెలిపింది. సీనియర్ లాయర్ సతీష్ మనేషిండే ఆర్యన్ ఖాన్ కేసును వాదించారు. ఆయనే నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) కేసును సైతం 2020లోనే టేకప్ చేశారు. ఈ కేసును, ఆర్యన్ కేసును పోల్చుతూ రియా కేసు విషయంలోనూ ఇలాంటి విచారణే జరగాలని డిమాండ్ చేశారు.


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) 2020లో మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో డ్రగ్స్ యాంగిల్ ఉందని ఆరోపిస్తూ ఎన్‌సీజీ నటి రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసింది. ఆ సమయంలో నటిని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకొన్న ఎన్‌సీబీ.. నెల తర్వాత విడుదల చేసింది. ఈ కేసును ఆర్యన్ ఖాన్ కేసుతో లింక్ చేస్తూ లాయర్ సతీష్ మనేషిండే మాట్లాడారు.


సతీష్ మనేషిండే మాట్లాడుతూ.. ‘ఇప్పటికే రియా చక్రవర్తి కేసులో ఆర్యన్ ఖాన్ కేసు తరహాలోనే విచారణ జరగాలని నేను సోషల్ మీడియాలో డిమాండ్ చేశాను. ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి ఈ కేసును కూడా ఫ్రెష్‌గా, వేగంగా విచారించాలి. ఇలాంటి కేసుల విషయంలో వాట్సాప్ చాట్‌లను కోర్టు పరిగణలోకి తీసుకోదని ఎస్‌ఎన్ ప్రధాన్, డీజీ, ఎన్‌సీబీ ఇటీవలే తెలిపారు. రియా చక్రవర్తి దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. ఆమెకు ఎలాంటి పరీక్షలు చేయలేదు. కాబట్టి ఈ కేసు విషయంలో ఆమె ఎందుకు ఇబ్బంది పడాలి?. నటి కేసులోనూ ఆర్యన్ ఖాన్ కేసును విచారించిన అధికారుల బృందమే ఉంది. కేసును వేగంగా విచారించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను, PMOను నేను అభ్యర్థిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.


మనేషిండే ఇంకా మాట్లాడుతూ.. ‘ఆర్యన్ ఖాన్ కేసును పూర్తిగా విచారించేందుకు ఎస్‌ఎన్ ప్రధాన్, డిప్యూటీ డీజీ సంజయ్ సింగ్ సిట్‌ను ఏర్పాటు చేసి నిజాలను వెలికితీయడం చాలా సంతోషాన్ని కలిగించింది. రియా చక్రవర్తి కేసు విషయంలో కూడా వారు అదే చేయాలి. నిజానికి ఇలాంటి కేసులన్నింటికీ వారు ఇదేవిధంగా విచారణ చేయాలని కోరుకుంటున్నా. దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్‌ కూడా ఎన్‌సీబీ కార్యాలయానికి వచ్చి వెళ్లారు. ఎన్‌సీబీ ఈ విషయంపై కూడా దర్యాప్తుని వేగవంతం చేయాలి’ అని తెలిపారు.

Updated Date - 2022-05-31T18:28:05+05:30 IST