Anurag Kashyap: వరుస ఫ్లాపులతో సతమతం.. నీ సమాధిని నువ్వే తవ్వుకుంటున్నావంటూ అనురాగ్ సంచలన వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2022-08-17T17:58:07+05:30 IST

కోవిడ్ తర్వాత పరిస్థితులు చాలా మారిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ ప్రేక్షకుల ఆలోచన, అభిరుచిలో..

Anurag Kashyap: వరుస ఫ్లాపులతో సతమతం.. నీ సమాధిని నువ్వే తవ్వుకుంటున్నావంటూ అనురాగ్ సంచలన వ్యాఖ్యలు..

కోవిడ్ తర్వాత పరిస్థితులు చాలా మారిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ ప్రేక్షకుల ఆలోచన, అభిరుచిలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది అక్కడ ఎన్నో మూవీస్ రిలీజ్ అయినప్పటి అందులో కేవలం రెండు లేదా మూడు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందులోనూ స్టార్ హీరోలు చేసిన భారీ బడ్జెట్ చిత్రాలు భారీ నష్టాలను చవి చూశాయి. 


వాటిలో ఎక్కువగా నష్టాలను చవిచూసిన సినిమాలు సందీప్ ఔర్ పింకీ ఫరార్, బంటీ ఔర్ బబ్లీ 2, జయేష్‌భాయ్ జోర్దార్, సామ్రాట్ పృథ్వీరాజ్, షంషేరా. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా (Aditya Chopra) ఈ భారీ ఫ్లాప్ సినిమాలను నిర్మించాడు. దీనిపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) స్పందించాడు. అనురాగ్ కశ్యప్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ‘దోబారా’. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిచింది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఈ తరుణంలో మూవీ ప్రమోషన్స్‌ని జోరుగా సాగిస్తోంది చిత్రబృందం. అందులో భాగంగా సాగిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ ఎదుర్కొంటున్న పరిస్థితులపై స్పందించాడు.


అనురాగ్ మాట్లాడుతూ..‘సినీ పరిశ్రమని కొందరూ వ్యక్తులు నియంత్రిస్తున్నారు. అది కూడా ట్రయల్ రూమ్‌లలో పెరిగిన రెండో తరానికి చెందిన వ్యక్తులు. వారికి సాధారణ ప్రజల జీవితం గురించి ఏం తెలియదు. కాబట్టి, వారు సినిమాను రిఫరెన్స్‌గా తీసుకొని వారి బతుకులను అంచనా వేస్తారు. తెరపై కనిపించనిది వారికి సినిమా కాదు. అదే ఇక్కడ పెద్ద సమస్య. వైఆర్ఎఫ్‌పై ఈ ట్రయల్ రూమ్ ఎఫెక్ట్ చాలా ఉంది. మీరు ఒక కథనాన్ని తీసుకొని దాని నుంచి పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్‌ని తయారు చేయాలనుకుంటారు. కానీ అది అటు తిరిగి ఇటు తిరిగి చివరికీ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ అవుతుంది. మీరు ఒక కథను తీసుకొని మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్‌ను తయారు చేయాలనుకుంటారు. అది షంషేరా అవుతుంది. ప్రేక్షకులు ఆలోచనలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. రెండు, మూడేళ్ల క్రితమైతే షంషేరా సక్సెస్ అయ్యిండేది’ అని చెప్పుకొచ్చాడు. 


అనురాగ్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఒక వ్యక్తి గుహలో కూర్చొని ఉన్నాడు. అతనికి బయటి ప్రపంచం గురించి ఏం తెలియదు. కానీ ఇండస్ట్రీలో సినిమాని ఎవరూ ఎలా తీయాలని డిక్టేట్ చేస్తుంటారు. అంటే.. మీ సమాధిని మీరే తవ్వుకుంటున్నట్లు అన్నమాట. మీరు ప్రజలకు ఉపాధి కల్పించాలి. కానీ నియత్రించకూడదు. ఆదిత్య చోప్రా దగ్గర చాలామంది పనిచేస్తూ ఉండొచ్చు. అలాగని నటులను, దర్శకులను నియంత్రించడం కరెక్టు కాదు. నువ్వు నమ్మిన వ్యక్తులను పనిలోకి తీసుకో. వారిని సినిమా తీసేలా ఫ్రీగా వదిలేయి. కానీ అతను అలా చేయడు. అదే అతను చేసే పెద్ద పొరపాటు’ అని తెలిపాడు.

Updated Date - 2022-08-17T17:58:07+05:30 IST