అనుపమ ట్వీట్‌తో.. అడ్డంగా బుక్కయిన GHMC

ABN , First Publish Date - 2022-06-16T03:04:09+05:30 IST

యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) చేసిన ఓ ట్వీట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఆమె చేసిన ట్వీట్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (GHMC) కూడా కదిలింది. ‘మీకు బాధ్యత లేదా’ అనే విధంగా అనుపమ..

అనుపమ ట్వీట్‌తో.. అడ్డంగా బుక్కయిన GHMC

యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) చేసిన ఓ ట్వీట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఆమె చేసిన ట్వీట్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (GHMC) కూడా కదిలింది. ‘మీకు బాధ్యత లేదా’ అనే విధంగా అనుపమ పరమేశ్వరన్ ‘గుడ్’ మార్నింగ్ అంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో.. హైదరాబాద్‌ (Hyderabad)లోని కొన్ని వీధుల్లో ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయి ఉన్న చెత్త చుట్టూ.. కొన్ని ఆవులు చేరి, వాటిని తింటున్నాయి. ఈ ఫొటోలను పెట్టిన ఆమె గుడ్ మార్నింగ్ అని పోస్ట్ చేసి.. ‘గుడ్’‌ని ప్రత్యేకంగా హైలెట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అవడంతో.. GHMC ట్విట్టర్ అకౌంట్ ‌నుండి ఆమెకు ఓ రిప్లయ్ వచ్చింది.  


‘‘మీరు షేర్ చేసిన ఫొటోలు ఏ ప్రాంతానికి చెందినవో చెప్పండి.. మా టీం వచ్చి సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరిస్తారు’’ అని GHMC ట్విట్టర్ అకౌంట్ నుండి స్పందన వచ్చింది. దీంతో నెటిజన్లు GHMC‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘హైదరాబాద్‌లోని ప్రాంతాలు కూడా మీకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారా?’ అని కొందరు, ‘ఆమె షేర్ చేసిన ఫొటోలలో కూడా అడ్రస్, చెత్త శుభ్రం చేసే వారి వివరాలు కూడా కనిపిస్తున్నా.. మళ్లీ అర్థరహితంగా స్పందన ఇవ్వడం ఏమిటి?’ అని మరికొందరు.. ఇలా GHMC‌ని టార్గెట్ చేస్తూ.. ట్విట్టర్‌లో ఆడేసుకుంటున్నారు.


అలాగే అనుపమ పరమేశ్వరన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చూసినదానిని అలా వదిలేయకుండా.. ఇలా నలుగురికి తెలిసేలా చేయడంతో.. మీ గట్స్‌కి హ్యాట్సాఫ్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మా ప్రాంతంలో కూడా ఇటువంటి సమస్యే అంటూ కొందరు నెటిజన్లు వారి కాలనీలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. మొత్తంగా.. ఆవులను రక్షించాలని, వీధుల్లో చెత్తను శుభ్రం చేయాలనే అర్థం వచ్చేలా అనుపమ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా.. ఆమెను కూడా వార్తలలో నిలిపేలా చేసింది.





Updated Date - 2022-06-16T03:04:09+05:30 IST