బెదిరించడం సరైన పద్ధతి కాదు.. కరోనా వ్యాక్సినేషన్‌పై హాలీవుడ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-28T21:29:57+05:30 IST

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది...

బెదిరించడం సరైన పద్ధతి కాదు.. కరోనా వ్యాక్సినేషన్‌పై హాలీవుడ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ తరుణంలో కొన్ని దేశాలు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలనే నిబంధనను విధిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ మీద నమ్మకం లేని కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. దీనికి అగ్ర రాజ్యం అమెరికా కూడా మినహాయింపు కాదు. అక్కడ ఈ ఆందోళనలకు సినీ సెలబ్రిటీలు సైతం మద్దతు పలుకుతున్నారు.


తాజాగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ‘యాంట్ మేన్’ సినిమాలతో.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ఎవాంజెలిన్ లిల్లీ సైతం ఆందోళనకారులకు సపోర్టుగా నిలిచారు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ తన మద్దతు తెలియజేసింది.‘ కెనడియన్ ట్రక్కర్లు దేశం దాటి వేళ్లేందుకు చేస్తున్న శాంతియుత ర్యాలీకి మద్దతు తెలుపుతున్నాను. అందుకోసమే నేను శారీరక సార్వభౌమాధికారం కోసం ర్యాలీ జరుగుతున్న వాషింగ్టన్ డీసీ‌కి వచ్చాను’ అని పోస్ట్‌లో రాసుకొచ్చింది.


అంతేకాకుండా.. ‘దాడి చేస్తామని, అరెస్టులు చేస్తామని, కనీసం విచారణ కూడా చేయకుండా ఖైదు చేస్తామని, ఉద్యోగం పోతుందని, నిరాశ్రయులు అవుతారనీ, ఆకలితో మలమలమాడి చస్తారంటూ, చదువుకునే అవకాశం కూడా కోల్పోతారంటూ, మీ ప్రియమిత్రులకు దూరం అవుతారనీ, సంఘం నుంచి బహిష్కరిస్తామంటూ వివిధ రకాలుగా బెదిరించి భయపెట్టి మభ్యపెట్టి వ్యక్తుల ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను బలవంతంగా వేయడం అనేది సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తున్నాను. ఎవరూ అలా ఒత్తిడి చేయకూడదు. వ్యాక్సిన్ వేయడానికి ఇది అనుసరించదగిన పద్ధతి కాదు. ఇలా బలవంతంగా వ్యాక్సిన్ వేయడం అనేది వాళ్లను ప్రేమించడం అవదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల అంతా ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని నాకు తెలుసు. కానీ, భయపెట్టి ఒత్తిడికి గురిచేయడం అనేది అన్ని సమస్యలకు పరిష్కారం అవదు.’ అని లిల్లీ చెప్పుకొచ్చింది.


కాగా.. వ్యాక్సిన్ వ్యతిరేకంగా తొలుత గళం విప్పింది లిల్లీ కాదు. అంతకు ముందు 2020లోనే బ్లాక్ పాంథర్ సినిమాతో పాపులారిటీ సాధించిన లెటిటియా రైట్ సైతం యాంటీ వ్యాక్సినేషన్‌కి సపోర్టు చేసింది. అందుకు సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లెటిటియా.. అనంతరం దాన్ని డిలీట్ చేసి అందరికీ క్షమాపణలు సైతం చెప్పింది.



Updated Date - 2022-01-28T21:29:57+05:30 IST