విజయ్ బాబుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మరో మహిళ

ABN , First Publish Date - 2022-04-30T02:39:18+05:30 IST

మలయాళీ నటుడు, నిర్మాత విజయ్ బాబు తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని కొన్ని రోజుల క్రితం ఓ యువనటి ఆరో‌పించింది. అతడికి వ్యతిరేకంగా ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది

విజయ్ బాబుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మరో మహిళ

మలయాళీ నటుడు, నిర్మాత విజయ్ బాబు తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని కొన్ని రోజుల క్రితం ఓ యువనటి ఆరో‌పించింది. అతడికి వ్యతిరేకంగా ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా సినీ ఇండస్ట్రీకీ చెందిన మరో మహిళ ఆరోపణలు గుప్పించింది. తనను బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు అతడు ప్రయత్నించాడని పేర్కొంది. ఈ విషయానికి సంబంధించి ఫేస్‌బుక్‌లో ఆమె ఓ పోస్ట్ పెట్టింది.


సినిమాకు సంబంధించిన పనుల మీద విజయ్ బాబుని నవంబర్ 2021లో కలిశానని ఆ మహిళ పేర్కొంది. ‘‘చిత్రాలకు సంబంధించిన కొన్ని విషయాలను మేం మాట్లాడుకున్నాం. అనంతరం వ్యక్తిగత అంశాలు చర్చకు వచ్చాయి. నాకు సహాయం అవసరమని అతడికీ అర్థమైంది. దీంతో నాకు ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు మాతో ఉన్న మరో వ్యక్తి గది నుంచి బయటికి వెళ్లిపోయాడు. కాసేపటికే విజయ్ మద్యం సేవించడం మొదలుపెట్టాడు. నన్ను కూడా తీసుకోమని చెప్పాడు. కానీ, నేను వద్దని చెప్పాను. నా అంగీకారం లేకుండా అతడు అకస్మాత్తుగా నా పెదవుల మీద ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. నేను వెంటనే అతడి నుంచి దూరంగా వెనక్కి జరిగాను. ఆ సమయంలో తదేకంగా అతడి ముఖం చూశాను. ఒక్క ముద్దు ఇవ్వమని కోరాడు. నేను నో అని చెప్పాను. అనంతరం అతడు క్షమాపణలు కోరాడు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దన్నాడు. నేను భయపడి అందుకు ఒప్పుకున్నాను. తర్వాత ఆ గది నుంచి బయటికి వచ్చేశాను. తర్వాత నన్ను ఎప్పుడు బలవంతం చేయలేదు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి నేను సినిమాల్లో పనిచేయడం మానేశాను. మలయాళం ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచనను విరమించుకున్నాను. నన్ను కలసిన 20 నిమిషాల లోపే అతడు ఈ పని చేశాడంటే.. ఎంత మంది మహిళలకు ఇటువంటి భయంకరమైన అనుభవం ఎదురయిందో అని ఆశ్చర్యపోయాను’’ అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.     

 

‘‘విజయ్ బాబు ఓ యువనటిని అత్యాచారం చేశాడని తెలియడంతో నాకు ఎదురయిన అనుభవాన్ని కూడా పంచుకోవాలనుకున్నాను. కొంత మంది ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందువల్ల నేను మౌనంగా ఉండలేకపోతున్నాను. అతడు ఇటువంటి పనులు చేయగలడనే విషయం నాకు తెలుసు. సహాయమనే పేరుతో అతడు మహిళలను లోబర్చుకుంటాడు. అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలి. ఆమెకు న్యాయం అందాలి’’ అని ఆమె చెప్పింది. తనకు వ్యతిరేకంగా కేసు నమోదు కావడంతో ప్రస్తుతం విజయ్ పరారీలో ఉన్నాడు. దీంతో కొచ్చి పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ముందస్తు బెయిల్ కోసం అతడు కేరళ హై కోర్టును ఆశ్రయించాడు.

Updated Date - 2022-04-30T02:39:18+05:30 IST