అన్నదమ్ముల బంధాలు, ఆప్యాయతల పండంటి కాపురం

ABN , First Publish Date - 2022-07-21T05:54:56+05:30 IST

నలుగురు అన్నదమ్ముల మధ్య ఉండే అనురాగం, ఆప్యాయతలు, ఉమ్మడి కుటుంబ బంధాలు, బాధ్యతలు.. ఇటువంటి అంశాలతో హీరో కృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘పండంటి కాపురం’...

అన్నదమ్ముల బంధాలు, ఆప్యాయతల పండంటి కాపురం

నలుగురు అన్నదమ్ముల మధ్య ఉండే అనురాగం, ఆప్యాయతలు, ఉమ్మడి కుటుంబ బంధాలు, బాధ్యతలు.. ఇటువంటి అంశాలతో హీరో కృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘పండంటి కాపురం’. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో ఆ తర్వాత ఎన్ని చిత్రాలు వచ్చినా, వాటిల్లో ఓ ఆణిముత్యంగా నిలిచిన సినిమా ఇది.  ఇందులోని ‘ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు’ పాట ఇప్పటికీ అనేక గృహ ప్రవేశ ఫంక్షన్స్‌లో  వినిపిస్తూనే ఉంది. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో 50 ఏళ్ల క్రితం హీరో కృష్ణ నిర్మించిన ‘పండంటి కాపురం’ చిత్ర వివరాలు.. విశేషాలు..


తెలుగు తెరకు కౌబాయ్‌ను పరిచయం చేసిన ఘనత హీరో కృష్ణది. ఆయన నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఆర్ఠిక విజయం సాధించింది కానీ మహిళా ప్రేక్షకులు మాత్రం ఆ సినిమాకు దూరంగా ఉన్నారు. అందుకే ఈ సారి తీసే సినిమా మహిళలను కూడా ఆకట్టుకోవాలనీ,  ఫ్యామిలీ సెంటిమెంట్‌ చిత్రం తీయాలని కథ కోసం అన్వేషణ ప్రారంభించారు ఘట్టమనేని సోదరులు. రాజేశ్‌ఖన్నా హీరోగా నటించిన ‘దో రాస్తే’ (1969) చిత్రం మీద వారి దృష్టి పడింది. అయితే ఆ సినిమా రీమేక్‌ హక్కుల కోసం ప్రయత్నించారు కానీ ఆ నిర్మాతలు అమ్మడానికి ఇష్టపడలేదు. దాంతో ఆ సినిమా ప్రేరణతో ఓ చిత్రం తీయాలనుకున్నారు. ‘దో రాస్తే’ చిత్రంలో మూడు ప్రధాన పాత్రలు  ఉన్నాయి. వాటిని తీసుకుని ‘ది విజిట్‌’ ఆంగ్ల చిత్రంలోని కొన్ని సన్నివేశాలను కలిపి కథ తయారు చేశారు రచయిత, నటుడు ప్రభాకరరెడ్డి.  ఈ  సినిమాకు ‘పండంటి కాపురం’ అనే టైటిల్‌ పెట్టింది కృష్ణ సోదరుడు హనుమంతరావు. హీరో కృష్ణ సమర్పణలో జయప్రద పిక్చర్స్‌ పతాకంపై హనుమంతరావు నిర్మాతగా లక్ష్మీదీపక్‌ దర్శకత్వంలో  ‘పండంటి కాపురం’ చిత్రం ప్రారంభమైంది. 




భానుమతి స్థానంలో జమున

ఈ సినిమాలో రాణీ మాలినీదేవి పాత్రను మొదట భానుమతిని దృష్టిలో పెట్టుకుని క్రియేట్‌ చేశారు. అహంభావం, అతిశయం కలిగిన ఆ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతారని యూనిట్‌ అంతా భావించింది. భానుమతి కూడా అంగీకరించి, తను కూడా కథాచర్చల్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆమె హీరో కృష్ణతో ‘అంతా మనమంచికే’ చిత్రం నిర్మిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాతే ‘పండంటి కాపురం’ షూటింగ్‌లో పాల్గొంటానని చివరి క్షణంలో భానుమతి మెలిక పెట్టడంతో అప్పటికప్పుడు ఆమెకు బదులు జమునను ఎంపిక చేశారు కృష్ణ, ఆయన సోదరులు. అహంభావంతో పాటు అందం కూడా జమున కలిగి ఉండడం ఆ సినిమాకు  బాగా ప్లస్‌ అయింది. జమున నట జీవితంలో ‘రాణీ మాలినీదేవి’ ఓ మైలురాయిగా నిలిచింది.


భారీ తారాగణం

నలుగురు అన్నదమ్ముల అనురాగాలకు, ఆప్యాయతలకు  అద్దం పట్టిన చిత్రం ‘పండంటి కాపురం’. ఇందులో పెద్దన్నయ్యగా ఎస్వీ రంగారావు నటించారు. ఆయన షూటింగ్స్‌కు లేట్‌గా వస్తారనే ప్రచారం ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది. అందుకే ఆయన తీసుకునే పారితోషికానికి పదివేల రూపాయలు ఎక్కువ ఇచ్చి పది రోజుల బల్క్‌ డేట్స్‌ తీసుకుని ఆయన వర్క్‌ పూర్తి చేశారు. రంగారావుకు తమ్ముళ్లుగా గుమ్మడి, ప్రభాకరరెడ్డి, కృష్ణ నటించారు. దేవిక, బి.సరోజాదేవి, విజయనిర్మల వీరికి జోడీలు.


బాలనటుడిగా నరేశ్‌కు ఇదే తొలి సినిమా. అలాగే జయసుధకు కూడా ఇదే మొదటి సినిమా. జమున కూతురిగా ఆమె నటించారు. తన అసలు పేరు(సుజాత)తోనే ఆమె ఈ చిత్రంలో నటించారు.


ఆ రోజుల్లో కలర్‌ ఫిల్మ్‌ దొరకడం చాలా కష్టంగా ఉండేది. అయినా అతి కష్టం మీద ఆ ఫిల్మ్‌ సంపాదించి, ఇంతమంది నటీనటులు పాల్గొన్న ఈ చిత్రాన్ని 90 రోజుల్లో పూర్తి చేయడం విశేషం. 150 రోజులు పడుతుందనుకొన్న  ఈ చిత్రం మూడు నెలల్లో పూర్తి కావడం గొప్ప విషయమని ఎస్వీఆర్‌ ప్రశంసించారు కూడా.


పెట్టుబడి రూ 12 లక్షలు.. వసూళ్లు రూ 40 లక్షలు

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ వంటి అగ్ర హీరోలతో చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాతలే బడ్జెట్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న తరుణంలో హీరో కృష్ణ రూ. 12 లక్షలతో ‘పండంటి కాపురం’ చిత్రాన్ని తీస్తున్నారని విని ఆయన సాహసానికి అంతా నివ్వెర పోయారు. అంత బడ్జెట్‌ వర్కవుట్‌ అవుతుందా అని సందేహం కూడా చాలా మందిలో ఉండేది. కానీ 1972 జులై 21న విడుదలైన ‘పండంటి కాపురం’ ఘన విజయం సాదించడమే కాకుండా రూ 40 లక్షలు వసూలు చేసింది. 37 సెంటర్లలో వంద రోజులు, మూడు కేంద్రాల్లో 25 వారాలు ఆడింది. విజయవాడలో జరిగిన శత దినోత్సవానికి ఎన్టీఆర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సభలోనే ఎన్టీఆర్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తానని కృష్ణ ప్రకటించారు. అదే ‘దేవుడు చేసిన మనుషులు’





Updated Date - 2022-07-21T05:54:56+05:30 IST