Beyond Fest: లాస్ ఏంజెలిస్‌లో ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీనింగ్.. నాటు నాటు పాటకు అమెరికన్ ఫ్యాన్స్ డ్యాన్స్..

ABN , First Publish Date - 2022-10-02T00:54:37+05:30 IST

‘బాహుబలి’ ప్రాంచైజీతో భారత్ అంతట క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS.Rajamouli). అనంతరం ‘ఆర్ఆర్ఆర్’ (RRR)కు దర్శకత్వం వహించి భారతీయ సినిమాల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడు.

Beyond Fest: లాస్ ఏంజెలిస్‌లో ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీనింగ్.. నాటు నాటు పాటకు  అమెరికన్ ఫ్యాన్స్ డ్యాన్స్..

‘బాహుబలి’ ప్రాంచైజీతో భారత్ అంతట క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS.Rajamouli). అనంతరం ‘ఆర్ఆర్ఆర్’ (RRR)కు దర్శకత్వం వహించి భారతీయ సినిమాల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ చిత్రాన్ని థియేటర్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీలో వీక్షిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. హాలీవుడ్ టెక్నిషియన్స్ అనేక మంది జక్కన్న‌ను పొగడ్తలతో ముంచెత్తారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కూడా ఇండియా తరఫున అధికారికంగా ఆస్కార్ నామినేషన్‌కు పంపిస్తే.. ఈ మూవీ అవార్డును తప్పక గెలుచుకుంటుందని చెప్పాడు. కానీ, ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ కు ఛాన్స్ ఇవ్వలేదు. ‘ఛెల్లో షో’ ను అధికారికంగా నామినేషన్‌కు పంపించింది. కానీ, ఆస్కార్‌కు పంపకపోయినప్పటికి ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికి ఈ మూవీకి వెస్ట్రన్ ఆడియన్స్ నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది.


అమెరికాలో తాజాగా హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ ‘బియాండ్ ఫెస్ట్‌’ (Beyond Fest) ను నిర్వహంచారు. అందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు వెర్షన్‌ను లాస్ ఏంజెలిస్‌లో ఐమ్యాక్స్‌లో ప్రదర్శించారు. ప్రముఖ టీసీఎల్ చైనీస్ థియేటర్‌లో స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విదేశీ ప్రేక్షకుల నుంచి సినిమాకు అనూహ్యమైన స్పందన వచ్చింది. థియేటర్ మొత్తం చప్పట్లతో మారు మోగిపోయింది. కొంత మంది ఫ్యాన్స్ అయితే స్క్రీన్ ముందుకు వెళ్లి డ్యాన్స్ చేశారు. సినిమాను చూసిన వారంతా దర్శకధీరుడికి స్టాండింగ్ ఒవియేషన్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను ‘లాస్ ఏంజెల్స్ టైమ్స్’ సోషల్ మీడియా హ్యాండిల్‌లో పంచుకుంది. ఆ వీడియోలో.. ‘నాటు నాటు’ పాట వస్తున్నప్పుడు కొంత మంది ఫ్యాన్స్ స్క్రీన్ ముందుకు వెళ్లి డ్యాన్సులు చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను అనుకరించారు. థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహించారు. అయితే, ‘లాస్ ఏంజెల్స్ టైమ్స్’ చేసిన ట్వీట్‌‌కు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ స్పందించింది. ‘ఇది మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్ కాదు. అమెరికాలో మన సినిమాకు లభించిన స్పందన ఇది. ఎత్తర జెండా’ అని ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. 


‘ఆర్ఆర్ఆర్’ పూర్తయిన అనంతరం దర్శకధీరుడు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాడు. మహేశ్ బాబు (Mahesh Babu) తో చేయబోయే సినిమా విశేషాలను తెలిపాడు. మహేశ్‌తో తెరకెక్కించే సినిమా తన కెరీర్‌లో‌నే పెద్దదని చెప్పాడు. ఇప్పటి వరకు అటువంటి చిత్రాన్ని చేయలేదన్నాడు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా మూవీని రూపొందిస్తానని పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో ట్రెండ్ అవుతుందని స్పష్టం చేశాడు. ‘‘నేను అమెరికాలోని ఫిలిం ఫెస్టివల్‌కు వచ్చాననుకున్నాను. కానీ, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులను చూస్తే ఈ ప్రాంతం హైదరాబాద్‌లోని ఆమిర్‌పేట్‌లా కనిపిస్తుంది’’ అని రాజమౌళి వెల్లడించాడు.





Updated Date - 2022-10-02T00:54:37+05:30 IST