‘అల్లు స్టూడియోస్‌’.. ఓ స్టేటస్‌ సింబల్‌

ABN , First Publish Date - 2022-10-02T07:12:16+05:30 IST

‘‘అల్లు స్టూడియోస్‌ లాభాపేక్షతో స్థాపించలేదు. ఇది ఒక స్టేటస్‌ సింబల్‌. అల్లు రామలింగయ్య ఘనమైన కీర్తికి గుర్తింపు’’ అన్నారు చిరంజీవి. శనివారం ఉదయం హైదరాబాద్‌ శివార్లలోని కోకాపేటలో...

‘అల్లు స్టూడియోస్‌’.. ఓ స్టేటస్‌ సింబల్‌

‘‘అల్లు స్టూడియోస్‌ లాభాపేక్షతో స్థాపించలేదు. ఇది ఒక స్టేటస్‌ సింబల్‌. అల్లు రామలింగయ్య ఘనమైన కీర్తికి గుర్తింపు’’ అన్నారు చిరంజీవి. శనివారం ఉదయం హైదరాబాద్‌ శివార్లలోని కోకాపేటలో కొత్తగా నిర్మించిన అల్లు స్టూడియోస్‌ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఎంతోమంది నటులు ఉన్నా, కొంతమందికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అలాంటి వారిలో అల్లు రామలింగయ్య ఒకరు. ఆయన బాటలోనే ఆయన కుటుంబం నడుస్తోంది. ఆ కుటుంబంలో నేనూ ఓ భాగమైనందుకు గర్వంగా ఉంద’’న్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘ఈ స్టూడియో వెనుక వ్యాపార దృక్పథం ఏమీ లేదు. తరాలుగా ఉండిపోయే ఓ జ్ఞాపికలా భావిస్తున్నాం. గీతా ఆర్ట్స్‌, అల్లు స్టూడియోస్‌ బాధ్యతల్ని నా తరువాతి తరానికి అప్పగిస్తున్నా. వాళ్లు ఈ సంస్థల్ని దిగ్విజయంగా ముందుకు నడుపుతారన్న నమ్మకం ఉంద’’న్నారు. ‘‘ఇది మా తాతయ్య గారి కల. ఆయన జ్ఞాపకంగా నిర్మించాం. మా నాన్నగారికి వాళ్ల నాన్నపై ఉండే ప్రేమని  చూస్తే ముచ్చటేస్తుంది. ఆ ప్రేమకు నిదర్శనం ఈ అల్లూ స్టూడియోస్‌’’ అన్నారు అల్లు అర్జున్‌. 


ఉత్తమ హాస్యానికి నిర్వచనం అల్లు రామలింగయ్య

ఎం.వెంకయ్య నాయుడు

స్వాతంత్య్ర సమరయోధులుగా ఉండి చిత్రరంగంలోకి వచ్చిన అతి కొద్దిమందిలో అల్లు రామలింగయ్య ఒకరనీ, ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, ఉత్తమ హాస్యాన్ని అందించిన వ్యక్తి ఆయన అనీ మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కొనియాడారు. పద్మశ్రీ అల్లు రామలింగయ్య శత జయంతి సందర్బంగా ఆయన తనయుడు అల్లు అరవింద్‌ రూపొందించిన పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. తొలి ప్రతిని మెగాస్టార్‌ చిరంజీవి స్వీకరించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ సభ్యులు, హాస్య నటులు పాల్గొన్నారు. ఈ సభలో వెంకయ్య నాయుడు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘సినిమా సమాజాన్ని ప్రతిబింబించాలి. వాస్తవానికి దూరంగా వెళ్లకూడదు. మూఢ నమ్మకాలకు, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేయాలి. రామలింగయ్యగారు మూఢ నమ్మకాలను వ్యతిరేకించడమే కాకుండా వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వ్యక్తి. ఆయన చూపిన బాటలో పయనించి ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించాలి’ అని హాస్య నటులను కోరారు. ఈ కార్యక్రమంలో అల్లు రామలింగయ్య అవార్డును చిరంజీవి దర్శకుడు త్రివిక్రమ్‌కు అందజేశారు. ఆయన చేతికి అల్లు అర్జున్‌ బంగారు కంకణం తొడిగారు. 50 ఏళ్ల నట జీవితంలో అల్లు రామలింగయ్య పోషించని పాత్రంటూ లేదనీ, ఆయన అవార్డును అందుకోవడం గొప్ప సత్కారంగా భావిస్తున్నానని త్రివిక్రమ్‌ అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ ‘రామలింగయ్య గారు ఒక వ్యక్తి కాదు నడిచే విజ్ఞాన సరస్వం. ఎన్నో పార్వ్సాలు కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అందరికంటే ఆయనతో నాకే ఎక్కువ అనుబంధం ఉంది’ అంటూ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలను ఈ సభలో వివరించారు. 


Updated Date - 2022-10-02T07:12:16+05:30 IST