ఇంతకంటే మాస్‌ చిత్రం.. ఇక చేయలేనేమో!: అల్లు అర్జున్

ABN , First Publish Date - 2021-12-15T04:43:28+05:30 IST

పుష్ప చిత్రం ఊరమాస్ కాదు.. అంతకంటే ఎక్కువే. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఇది నేల మాస్‌ సినిమా. ఇంతకంటే మాస్‌ నేను భవిష్యత్తులో కూడా చేయలేనేమో..? అని అన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా

ఇంతకంటే మాస్‌ చిత్రం.. ఇక చేయలేనేమో!: అల్లు అర్జున్

పుష్ప చిత్రం ఊరమాస్ కాదు.. అంతకంటే ఎక్కువే. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఇది నేల మాస్‌ సినిమా. ఇంతకంటే మాస్‌ నేను భవిష్యత్తులో కూడా చేయలేనేమో..? అని అన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా.. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో అల్లు అర్జున్ చిత్రజ్యోతితో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ..


24 నెలల ప్రయాణం

‘‘సుకుమార్‌తో రెండు సినిమాలు చేశాను. ఆర్య.. నా కెరీర్‌లో తొలి మైలురాయి. నా స్టైల్‌ చాలా మార్చిన సినిమా. ఆ తర్వాత ఆర్య 2 చేశాం. అప్పటి నుంచీ.. మూడో సినిమా చేయాలని అనుకుంటూనే ఉన్నాం. ఒకసారి.. ‘పుష్ప’ ఐడియా చెప్పాడు. చాలా బాగా నచ్చింది. అలా ఈ ప్రయాణం మొదలైంది. దాదాపుగా 24 నెలల ప్రయాణం ఇది. మధ్యలో కొవిడ్‌ వచ్చింది. అయినా పుష్ప మైండ్‌ నుంచి పోలేదు. అలాంటి సమయంలో కూడా మేం పుష్ప గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. 


‘పుష్ప’ అనగానే కొత్తగా అనిపించింది

ఈ సినిమాకి మేము అనుకున్న టైటిల్‌ ఇదొక్కటే. ఓసారి సుకుమార్‌ వచ్చి.. ‘డార్లింగ్‌ మన సినిమా పేరు పుష్ప’ అన్నాడు. భలేగుందే అనిపించింది. అదే చెప్పాను. ‘నాకు తెలుసు.. ఈ పేరు నీకొక్కడికే నచ్చుతుందని, అందుకే ముందు నీకే చెప్పా’ అన్నాడు. పుష్ప అనేది సహజంగా అమ్మాయిలకు పెట్టుకునే పేరు. ఓ మాస్‌ వ్యక్తికి ఆ పేరు పెట్టడం నిజంగా కొత్తగా అనిపిస్తుంది. టైటిల్‌‌ని ఫస్ట్‌లుక్‌తో పాటు రివీల్‌ చేద్దాం.. అప్పుడే కిక్‌ వస్తుంది అని సుకుమార్‌ చెప్పడంతో అలానే చేశాం. 


మిగిలిన భాషల్లో ప్రచారం విషయంలో ప్లానింగ్ తప్పింది

నిజంగా ఈ ఒక్క విషయంలోనే కాస్త మా ప్లానింగ్‌ తప్పింది. డిసెంబరు 17న సినిమా రావాలని ఫిక్సయ్యాం. నెల రోజుల ముందే షూటింగ్‌ పూర్తవుతుంది కాబట్టి.. ప్రమోషన్లకు సమయం దొరుకుతుందనిపించింది. కానీ.. డిసెంబరు 8 వరకూ షూటింగ్‌ చేస్తూనే ఉన్నాం. అలా.. ప్రమోషన్లకు టైమ్‌ దొరకలేదు. కాకపోతే... దొరికిన ఈ కాస్త సమయంలోనే వీలైనంత గట్టిగా ప్రమోషన్లు చేస్తున్నాం. చెన్నై, కొచ్చి, ముంబై.. ఇలా ఈ నాలుగు రోజులూ తిరుగుతూనే ఉంటా.


నేల మాస్ సినిమా

ఊరమాస్ కాదు.. అంతకంటే ఎక్కువే. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఇది నేల మాస్‌ సినిమా. ఇంతకంటే మాస్‌ నేను భవిష్యత్తులో కూడా చేయలేనేమో..?


మారేడుమిల్లి అడవి చూసి ఆశ్చర్యపోయా..

మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్‌ చేయడం చాలా కష్టం అనిపించింది. మన చుట్టుపక్కల ఇంత దట్టమైన అడవి ఉందా? అని నేనే ఆశ్చర్యపోయా. గుడిసె అనే ఊర్లో షూటింగ్‌ చేశాం. ఆ ఊర్లో రెండు మూడు కిలోమీటర్ల మేర రోడ్‌ లేదు. మేమే ఓ రోడ్‌ వేశాం. అయితే వర్షాలు పడితే.. ఆ రోడ్‌ కొట్టుకుని వెళ్లిపోయేది. ప్రొడక్షన్ నుంచే దాదాపు 400 వాహనాలు ఉండేవి. చుట్టూ జనం. రాత్రయితే.. చిన్న చిన్న దోమలు, కీటకాలు కుడుతూ ఉండేవి. వాటి మధ్య షూటింగ్‌ చేశాం.


‘పుష్ప 2’ షూటింగ్ అప్పుడే

నాకు అర్జెంటుగా బ్రేక్‌ కావాలి. ఒక నెలరోజుల పాటైనా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. తిరిగొచ్చాక పుష్ప 2 షూటింగ్ మొదలెడతాం. 

Updated Date - 2021-12-15T04:43:28+05:30 IST