హిందీ భాష విషయంలో కన్నడ స్టార్ హీరో సుధీప్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు అజయ్ దేవగణ్. ఆ కారణంగా ఆయన పేరు వార్తల్లో మార్మోగింది. అయితే, తన తాజా ఇంటర్వ్యూలో అజయ్ మరిన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చేశాడు. అవి మరీ కాంట్రవర్సియల్ కానప్పటికీ జనాల్లో చాలా మందిని మాత్రం ఆశ్చర్యపరుస్తున్నాయి. అజయ్ దేవగణ్ భార్య కాజోల్ యాక్ట్ చేసిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ మూవీ ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’. ‘డీడీఎల్‌జే’గా పిలుచుకునే షారుఖ్ ఖాన్ స్టారర్ దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద ఆడుతూనే ఉంది! అయినా అంతటి విజయవంతమైన చిత్రాన్ని అజయ్ దేవగణ్ ఒక్కసారి కూడా చూడలేదట!
భార్య కాజోల్ నటించిన ఆల్‌టైం హిట్ మూవీ చూడకపోవటం కొంత వరకూ ఓకే... కానీ, తాను నటించిన సినిమాలు కూడా చాలా వరకూ అజయ్ చూడడట! ఈ మధ్య ఆయన కీలక పాత్రల్లో నటించిన రెండు భారీ చిత్రాలు విడుదలయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి కాగా... రెండోది ఆలియా భట్ టైటిల్ రోల్ చేసిన ‘గంగూబాయ్’ సినిమా. అవి కూడా తాను చూడలేదని నిర్మొహమాటంగా చెబుతున్నాడు దేవగణ్. ఇంతకీ, ఆయన అలా చేయటానికి కారణం ఏంటంటారా? అదీ అజయ్ దేవగణే స్వయంగా చెప్పాడు! ఒకసారి ఓ సినిమాలో తాను నటించాక... కొద్ది రోజుల్లోనే ఆ సినిమా చూసేస్తే సరేసరి... లేదంటే ఇక ఆలస్యమైపోయాక దేవగణ్ తన సినిమాలు చూడడట. అలా ఎందుకంటే, ఆయా చిత్రాల్లో అప్పట్లో తాను ఇంకా బాగా నటించి ఉండాల్సిందని ఆయనకు అనిపిస్తుందట. అది ఎలాగూ కుదరదు కాబట్టి తన పాత చిత్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చూడనంటున్నాడు!