Ajay Devgn, Kiccha Sudeep హిందీ కాంట్రవర్సీలోకి RGV ఎంట్రీ.. అతడిని సపోర్ట్ చేస్తూ ట్వీట్..

ABN , First Publish Date - 2022-04-28T21:22:29+05:30 IST

దక్షిణాది సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుండటంతో బాలీవుడ్ హీరోలు, సౌత్ స్టార్స్‌పై అసూయతో ఉన్నారని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నాడు.

Ajay Devgn, Kiccha Sudeep హిందీ కాంట్రవర్సీలోకి RGV ఎంట్రీ.. అతడిని సపోర్ట్ చేస్తూ ట్వీట్..

దక్షిణాది సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుండటంతో బాలీవుడ్ హీరోలు, సౌత్ స్టార్స్‌పై అసూయతో ఉన్నారని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నాడు. కన్నడ స్టార్ సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌ల మధ్య హిందీ భాషపై బుధవారం జరిగిన ట్వీట్ వార్‌పై తాజాగా ఆర్జీవీ స్పందించాడు. ‘‘దక్షిణాది, ఉత్తరాది కాదు.. భారతదేశం మొత్తం ఒక్కటే అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రాంతాలు, సంస్కృతులకు అతీతంగా భాషలు ఏర్పడుతాయి. భాష అనేది అందరిని కలిపి ఉంచాలి, విడదీయడానికి కాదు’’ అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ‘‘కన్నడ డబ్బింగ్ చిత్రం ‘కెజియఫ్-2’ బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ సినిమాలకు దీటుగా తొలిరోజే రూ. 50కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో బీ టౌన్ హీరోలు కన్నడ స్టార్స్‌పై అసూయతో ఉన్నారు. రాబోయే రోజుల్లో బాలీవుడ్ సినిమాల వసూళ్లు ఏవిధంగా ఉంటాయో చూద్దాం. కన్నడలో బంగారం ఉందా? లేదా బాలీవుడ్‌లో బంగారం ఉందా? అనేది ‘రన్ వే-34’ కలెక్షన్ల ద్వారా తెలుస్తుంది’’ అని ఆర్జీవీ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. 


అజయ్ దేవగణ్, కిచ్చా సుదీప్ ట్వీట్ వార్: 

కన్నడ స్టార్ సుదీప్ కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ‘కెజియఫ్-2’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ హిందీ ఎంత మాత్రం జాతీయ భాష కాదన్నాడు. ‘‘ఓ కన్నడ సినిమాను పాన్ ఇండియాగా రూపొందించారని అందరూ అంటున్నారు. ఇక్కడ నేను చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నాను. హిందీ ఎంత మాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలు రూపొందిస్తుంది. తమ సినిమాలను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోకి డబ్ చేసినప్పటికీ వారు విజయం సాధించలేకపోతున్నారు. ఈ రోజు మనం తెరకెక్కిస్తున్న చిత్రాలను ప్రపంచం మొత్తం చూస్తుంది’’ అని సుదీప్  చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘నా సోదరుడా.. కిచ్చా సుదీప్.. హిందీ జాతీయ భాష కాదని నువ్వు అంటున్నావు. మరి సినిమాను నీ ప్రాంతీయ భాషలో విడుదల చేయకుండా ఎందుకు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నావు? ఇప్పుడు, ఎల్లప్పుడు హిందీ మాతృ భాష, జాతీయ భాష’’ అని అజయ్ దేవగణ్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. అజయ్ ట్వీట్‌కు సుదీప్ రిప్లై ఇచ్చాడు. ‘‘నేను వేరే సందర్భంలో ఈ మాటలను చెప్పాను. మీరు తప్పుగా నన్ను అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలసినప్పుడు ఆ మాటలను ఎందుకు అన్నానో నేను చెబుతాను. ఎవరినీ బాధపెట్టాలని, రెచ్చగొట్టాలని ఆ వ్యాఖ్యలు చేయలేదు. మీరు హిందీలో చేసిన ట్వీట్ నాకు అర్థమైంది. నాకు హిందీ మీద ప్రేమ, గౌరవం ఉంది కాబట్టే నేర్చుకున్నాను. కానీ, కన్నడలో నేను రిప్లై ఇస్తే పరిస్థితేంటీ అని ఆలోచిస్తున్నాను’’ అని కిచ్చా సుదీప్ ట్విట్టర్‌లో మెసేజ్ షేర్ చేశాడు.













Updated Date - 2022-04-28T21:22:29+05:30 IST