త్రీడీ టీజర్‌ చూసి చిన్న పిల్లాడ్ని అయిపోయా!

ABN , First Publish Date - 2022-10-07T10:53:16+05:30 IST

‘‘ఆదిపురుష్‌ టీజర్‌ని తొలిసారి త్రీడీలో చూసినప్పుడు నేను చిన్నపిల్లాడ్ని అయిపోయా. నా సినిమా త్రీడీలో రావడం ఇదే తొలిసారి. ఆ విజువల్స్‌ చూసి థ్రిల్‌ ఫీల్‌ అయ్యా...

త్రీడీ టీజర్‌ చూసి చిన్న పిల్లాడ్ని అయిపోయా!

‘‘ఆదిపురుష్‌ టీజర్‌ని తొలిసారి త్రీడీలో చూసినప్పుడు నేను చిన్నపిల్లాడ్ని అయిపోయా. నా సినిమా త్రీడీలో రావడం ఇదే తొలిసారి. ఆ విజువల్స్‌ చూసి థ్రిల్‌ ఫీల్‌ అయ్యా’’ అన్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. ఇటీవల టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌ త్రీడీ వెర్షన్‌ని హైదరాబాద్‌లో పాత్రికేయుల కోసం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతూ ‘‘శుక్రవారం అభిమానుల కోసం 60 థియేటర్లలో త్రీడీ టీజర్‌ని ప్రదర్శిస్తాం. వాళ్లు చూసి ఎలా ఫీల్‌ అవుతారో తెలుసుకోవాలని ఉంది. ఇలాంటి టెక్నాలజీతో సినిమా తీయడం దేశంలోనే ఇదే తొలిసారి. పెద్ద తెర కోసం తీసిన సినిమా ఇది. ఇంకొన్ని వారాల్లో మంచి కంటెంట్‌తో మళ్లీ వస్తామ’’న్నారు. దిల్‌ రాజు మాట్లాడుతూ ‘‘టీజర్‌ కోసం అందరిలా నేనూ ఎదురు చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ‘బాహుబలి’, ‘ఆదిపురుష్‌’లాంటి చిత్రాలు విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసమే చూడాలి. సెల్‌ఫోన్లలోనూ, బుల్లితెరపైనా టీజర్‌ చూసినవాళ్లకు నచ్చకపోవొచ్చు. త్రీడీ ఎఫెక్ట్‌లో చూస్తే ఆ అనుభూతి వేరు. ‘బాహుబలి’ విడుదలైన రోజున నెగిటీవ్‌ కామెంట్లు వచ్చాయి. అవి ఏ సినిమాకైనా సహజమే. కొంతమంది సినిమాని నెగిటీవ్‌ మైండ్‌సెట్‌తో చూస్తారు. కానీ అంతిమంగా నచ్చాల్సింది ప్రేక్షకులకే’’ అన్నారు. 


ఆదిపురుష్‌ను అడ్డుకుంటాం :  ‘ఆదిపురుష్‌’లో శ్రీరాముడు, సీతమ్మ తదితర పురాణ పాత్రలను అవమానించారంటూ విశ్వహిందూపరిషత్‌ అభ్యంతరం తెలిపింది. ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించనివ్వబోమని హెచ్చరించింది. అలాగే అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని సర్వబ్రాహ్మిణ్‌ మహాసభ సంస్థ చిత్ర దర్శకుడు ఓంరౌత్‌కు లీగల్‌ నోటీసులు పంపింది. ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని నిషేధించాలని అయోధ్య రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్రదాస్‌ గురువారం డిమాండ్‌ చేశారు. 


ఆ రాముడు కాపీ!

ప్రభాస్‌కు ముందే తెలుసు

ఆదిపురుష్‌పై మరో వివాదం

వానరసేన స్టూడియోస్‌ అధినేత ఇంటర్వ్యూ

ఆదిపురుష్‌పై మరో వివాదం రాజుకుంటోంది. ప్రభాస్‌ను రాముడిగా చూపిస్తూ విడుదల చేసిన పోస్టర్‌ను కాపీ కొట్టారని ముంబాయికి చెందిన వానరసేన స్టూడియోస్‌ ఆరోపించింది. ఈ చిత్రంపై తమకే కాపీరైట్స్‌ ఉన్నాయని, దాన్ని ప్రభాస్‌ గతంలో తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేశాడని కూడా పేర్కొంటోంది. ఈ వివాదానికి సంబంధించిన అంశాలను వానరసేన స్టూడియోస్‌ వివేక్‌ రామ్‌ చిత్రజ్యోతితో పంచుకున్నారు.


మీరు పెట్టిన ట్విట్టర్‌ పోస్ట్‌లో రెండు బొమ్మల మధ్య సామ్యం ఉంది. కానీ దీనిని కాపీ అని ఎలా చెబుతాం?

శ్రీరాముడిని ఒక విలుకాడుగా చూపించడం కోసం రూపొందించిన చిత్రమిది. 14 ఏళ్ల క్రితమే రూపొందించాం.  శ్రీరాముడిని ఈ తరహా విలుకాడుగా ఏ ఇతర కామిక్స్‌లో కానీ చిత్రాలలో కానీ చూపించలేదు. మా చిత్రంలో వేళ్లు ఎలా ఉన్నాయనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ తరహా చిత్రం వేరొకటి లేదు. అందువల్ల ఆదిపురుష్‌ పోస్టర్‌ను చూసిన వెంటనే కాపీ అని గుర్తించగలిగాం. 


మీ చిత్రానికి కాపీరైట్‌ ఏదైనా ఉందా?

దీనిని 2008లో ఆన్‌లైన్‌లో పబ్లిష్‌ చేశాం. దానిపై నా పేరు కూడా స్పష్టంగా ఉంటుంది. నా కన్నా ముందు ఎవరూ ఈ తరహా చిత్రాన్ని గీయలేదు. ఈ చిత్రానికి చాలా ప్రశంసలు వచ్చాయి కాబట్టి చిత్ర బృందం అలాంటి ప్రశంసలనే కోరుకొని ఉండచ్చు. కొన్నేళ్ల క్రితం ప్రభాస్‌ దసరా రోజున ఫేస్‌బుక్‌లో నా చిత్రాన్ని షేర్‌ చేశారు. అంటే చిత్ర బృందానికి నా చిత్రం ఉందని తెలుసు. 


ఆదిపురుష్‌ టీమ్‌ ఇప్పటి దాకా మిమల్ని కాంటాక్ట్‌ చేశారా?

లేదు. 


Updated Date - 2022-10-07T10:53:16+05:30 IST