Salman Khan అభిప్రాయం తప్పు అంటూ Yash కామెంట్స్.. Ram Charan స్పందించిన మర్నాడే..

ABN , First Publish Date - 2022-04-12T22:24:31+05:30 IST

బాహుబలి, కేజీఎఫ్, పుష్ప ప్రస్తుతం ఆర్ఆర్ఆర్.. ఈ సౌతిండియన్ సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిందీ బెల్ట్‌లో మంచి విజయాన్ని..

Salman Khan అభిప్రాయం తప్పు అంటూ Yash కామెంట్స్.. Ram Charan స్పందించిన మర్నాడే..

బాహుబలి, కేజీఎఫ్, పుష్ప ప్రస్తుతం ఆర్ఆర్ఆర్.. ఈ దక్షిణాది సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిందీ బెల్ట్‌లో మంచి విజయాన్ని అందుకొని కలెక్షన్లని కొల్లగొట్టాయి. అయితే.. ఇంతవరకు ‘క్రిష్’ సినిమాలు తప్ప ఏ ఇతర బాలీవుడ్ మూవీ కూడా ఇంతవరకు దక్షిణాది రాష్ట్రాల్లో సరైన కలెక్షన్లను సాధించిన దాఖలాలు లేవు. దీనిపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దక్షిణాది చిత్రాలు బాలీవుడ్‌లో అద్భుతమైన వసూళ్లను సాధిస్తున్నాయి. కానీ సౌత్‌లో బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఆడావోనని నాకు ఆశ్చర్యం వేస్తుంది’ అంటూ కామెంట్స్ చేశాడు.


సల్మాన్ కామెంట్స్‌పై తాజాగా టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ స్పందిస్తూ.. ‘కథలో లోపం ఉండడం వల్లే అలా జరుగుతోందని.. దర్శకులు సౌత్ ప్రేక్షకులకి నచ్చేలా స్టోరీలు తయారు చేయాలని’ చెప్పుకొచ్చాడు. చెర్రీ మాట్లాడిన మర్నాడే ‘కేజీఎఫ్‌’ స్టార్ యశ్ సైతం సల్లుభాయ్ కామెంట్స్‌పై స్పందించాడు. యశ్ మాట్లాడుతూ.. ‘సల్మాన్‌ ఖాన్ అభిప్రాయం తప్పు. మొదట్లో ఇక్కడి చిత్రాలకు అక్కడ అంతా ఆదరణ లభించలేదు. అయితే ఇక్కడి నుంచి ఎన్నో సినిమాలు డబ్బింగ్ రూపంలో అక్కడికి వెళ్లాయి. అలా మెల్లగా మా కంటెంట్‌ జనాలకు పరిచయమైంది. ఒక జోక్‌లా ప్రారంభమైనప్పటికీ డబ్బింగ్ సినిమాలు కావడంతో స్థలానికి వారు ప్రాముఖ్యత ఇవ్వలేదు. కొన్నేళ్లుగా ఇది జరుగుతుండడంతో అక్కడి సినీ జనాలకు ఇక్కడి పద్ధతులు పరిచయమై ఇప్పటికి మాకు ఉపయోగపడింది. అదే రాజమౌళి, ప్రభాస్‌ ‘బాహుబలి’కి ఉపయోగపడింది. వాళ్లని ఫాలో అవుతూ మా ‘కేజీఎఫ్’ టీం కూడా ముందుకు వెళ్లింది. అది సినిమా బిజినెస్‌కి ఎంతో సహకరించింది’ అంటూ చెప్పుకొచ్చాడు.


యశ్ ఇంకా మాట్లాడుతూ.. ‘అక్కడికి, ఇక్కడికి సంస్కృతిలో చాలా తేడాలు ఉన్నాయి. అవి మన బలహీనతలుగా కాకుండా మన బలాలుగా మారాలి. అది సరైన పద్ధతిలో జరిగితే బావుంటుంది. అలా జరిగితే ఉత్తరాది నుంచి వచ్చే ఎన్నో సినిమాలు ఖచ్చితంగా ఇక్కడ మంచి విజయాలను అందుకుంటాయి. ఇక్కడ ఎంతోమంది హిందీ నటుల సినిమాలు చూస్తున్నాం. వాటిని ఇష్టపడుతున్నాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. సినిమాని విడుదల చేసి వదిలేయడం కాదు. దానికి ప్రమోషన్స్ చేయండి. దానికోసం జనాలతో కలిసిపోండి. సరైన డిస్ట్రిబ్యూటర్స్‌ని ఎంచుకోండి. సరైన ప్రొడక్షన్ హౌస్‌లతో కలిసి సినిమాని తీసి, సరైన రీతిలో ప్రమోట్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా సినిమాలు మంచి కలెక్షన్లను అందుకుంటాయి. అలా అన్ని భాషల నుంచి పాన్ ఇండియా సినిమాలు రావాలని, వస్తాయని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నాడు.

Updated Date - 2022-04-12T22:24:31+05:30 IST