మెగాస్టార్‌ కెరీర్‌ గ్రాఫ్‌ పెంచిన ‘అడవిదొంగ’

ABN , First Publish Date - 2022-07-07T06:28:58+05:30 IST

ఆ నాటి నంబర్‌ వన్‌ హీరో ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి వెళ్ళడం తో ఆయన అధిష్టించిన అగ్రాసనం ఖాళీ అయింది. అక్కినేని సహా పలువురు అగ్ర తారలు ఉన్నా...

మెగాస్టార్‌ కెరీర్‌ గ్రాఫ్‌ పెంచిన ‘అడవిదొంగ’

ఆ నాటి నంబర్‌ వన్‌ హీరో ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి వెళ్ళడం తో ఆయన అధిష్టించిన అగ్రాసనం ఖాళీ అయింది. అక్కినేని సహా పలువురు అగ్ర తారలు ఉన్నా, పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న హీరో కృష్ణ ఆ స్థానం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ సమయంలోనే ఖైదీ చిత్రం విడుదల అయింది. ఆ సినిమాతో  చిరంజీవికి ఓవర్‌ నైట్‌ స్టార్‌ డమ్‌  వచ్చింది. ఎవరి అండదండలు లేకుండా కృషినే నమ్ముకొని ఎదిగిన చిరంజీవి ఖైదీ తర్వాత మరికొన్ని జనరంజకమైన చిత్రాల్లో నటించి అభిమానుల సంఖ్య పెంచుకున్నారు.ఏడాది తిరగకుండానే హీరో కృష్ణతో పోటీ పడే స్థాయికి చేరుకొన్నారు. అటువంటి నేపథ్యంలో విడుదల అయిన అడవి దొంగ చిత్రం మెగాస్టార్‌ కెరియర్‌ గ్రాఫ్‌ ను మరింత పెంచింది.

ఎన్టీఆర్‌ తరానికి చెందిన భారీ చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు చిరంజీవితో  ‘అడవిదొంగ’ చిత్రం కోసం చేతులు కలపడం తో ఆయన కెరీర్‌ కు మరింత ఊపు వచ్చింది. సోలో హీరోగా చిరంజీవి రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన తొలి సినిమా. ఇది మెగాస్టార్‌ చిత్రాల వ్యాపార పరిధిని బాగా పెంచి బాక్సాఫీసును కొల్లగొట్టింది. ఆ సమయంలో సూపర్‌ స్టార్‌ గా వెలుగుతున్న కృష్ణ చిత్రాలకు సమానంగా ఈ సినిమా బిజినెస్‌ కావడం విశేషం. అలాగే తొలి వారం దాదాపు రూ. 84 లక్షలు  వసూలు చేసి ట్రేడ్‌ పండితుల్ని ఆశ్చర్య పరిచింది. రాఘవేంద్రరావు మార్క్‌ పాటలతో, చిరంజీవి నృత్యాలతో ఒక సరి కొత్త మాస్‌ కాంబినేషన్‌ కు అడవి దొంగ తెర తీసింది. చిరంజీవి సినిమాను ఎంత ఖర్చు పెట్టి తీసినా వసూళ్లకు ఢోకా ఉండదని ఈ సినిమా ప్రూవ్‌ చేసింది. అలాగే ఎన్టీఆర్‌ తో సినిమాలు తీసిన నిర్మాతలు కూడా ఎక్కువ ఖర్చు పెట్టి భారీ సినిమాలు తీయాలంటే చిరంజీవితో నే సాధ్యం అని అడవి దొంగ తో నే ముందుకు రావడం మొదలైంది.

ఈ సినిమాలో చిరంజీవి టార్జాన్‌ పాత్ర పోషించారు. ఇంటర్వెల్‌ వరకూ ఆయనకు మాటలే ఉండవు. ఈ విషయంలో రాఘవేంద్రరావు మెగా అభిమానుల ఆగ్రహానికి గురి అయ్యారు కూడా. రాధ హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రం 1985 సెప్టెంబర్‌ 19న  విడుదల అయింది. హైదరాబాద్‌ లో దేవి, సత్యం, కోణార్క్‌ ,  జ్యోతి థియేటర్ల లో విడుదల చేశారు. విడుదల రోజున నాలుగు థియేటర్ల లో ఐదు షో లు ప్రదర్శించడం హైదరాబాద్‌ సిటీ హిస్టరీ లో అదే తొలి సారి.


Updated Date - 2022-07-07T06:28:58+05:30 IST