సౌత్‌లో సక్సెస్.. బాలీవుడ్‌లో మాత్రం ఫెయిలైన హీరోయిన్లు

ABN , First Publish Date - 2022-04-09T01:16:35+05:30 IST

ఇండస్ట్రీలకు అతీతంగా హీరోయిన్లకు అభిమానులుంటారు

సౌత్‌లో సక్సెస్.. బాలీవుడ్‌లో మాత్రం ఫెయిలైన హీరోయిన్లు

ఇండస్ట్రీలకు అతీతంగా హీరోయిన్లకు అభిమానులుంటారు. ఈ అందాల భామల సినీ కెరీర్ కూడా తక్కువ కాలమే ఉంటుంది. అందువల్లే కాల్షీట్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ అన్ని భాషలకు చెందిన సినిమాల్లో నటిస్తూ ఉంటారు. కొంత మంది హీరోయిన్లు దక్షిణాదిలో సినీ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించనప్పటికీ, బీ టౌన్‌లో మాత్రం ఆ దూకుడును ప్రదర్శించలేకపోయారు. అలా బాలీవుడ్‌లో పరాజయం పాలైన సినీ తారల జాబితాపై ఓ లుక్కేద్దామా..  


రంభ: 

నిన్నటి తరం హీరోయిన్ రంభ 1990 నాటి వారికీ సుపరిచితమే. ఆమె భాషతో సంబంధం లేకుండా దాదాపుగా 8 ఇండస్ట్రీలకు చెందిన సినిమాల్లో నటించింది. సౌత్‌ సూపర్ స్టార్స్ అందరితోను సినిమాలు చేసింది. బాలీవుడ్‌లో మాత్రం సక్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగించలేకపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్‌తో కూడా సినిమా చేసిన ఆ ప్రయత్నం కూడా ఆమె కెరీర్‌కు ఉపయోగపడలేదు.     


కాజల్ అగర్వాల్: 

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయిక కాజల్ అగర్వాల్. టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన అనేక సినిమాల్లో కాజల్ నటించింది. సూపర్ స్టార్స్ అందరితోను ఆమె చిత్రాలు చేసింది. అయితే, 2004లోనే బాలీవుడ్ తెరపై ఓ చిన్న పాత్రలో కనిపించిన కాజు... 2011లో రోహిత్ శెట్టి తెరకెక్కించిన ‘సింగం’తో బీ-టౌన్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ పక్కన హీరోయిన్‌గా నటించింది. కానీ, ఆ మూవీ అనంతరం ఆమెకు బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ అవకాశాలు లభించలేదు.


పూజా హెగ్డే: 

‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి పూజా హెగ్డే. అనంతరం ‘దువ్వాడ జగన్నాథం’, ‘మహర్షి’ వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. పూజా హెగ్డే ‘మొహంజోదారో’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.  ఈ చిత్రంలో హృతిక్ రోషన్ పక్కన హీరోయిన్‌గా నటించింది. అయినప్పటికీ ఆమె బీ టౌన్‌లో సక్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను మాత్రం కొనసాగించలేకపోయింది. సౌత్‌లో పూజకు విపరీతమైన క్రేజ్ ఉంది. బాలీవుడ్‌లో మాత్రం ఆమెకు ఇంకా స్టార్ స్టేటస్ దక్కటం లేదు. త్వరలో రణవీర్ సింగ్‌తో ‘సర్కస్’ సినిమాలో రొమాన్స్ చేయనుంది. చూడాలి మరి, మన బుట్ట బొమ్మకి ఆ సినిమాతోనైనా బాలీవుడ్‌లో దశ తిరుగుతుందేమో...   


త్రిష కృష్ణన్: 

కోలీవుడ్ ప్రేక్షకులందరూ త్రిషను ‘సౌత్ క్వీన్’ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన అనేక సినిమాల్లో త్రిష నటించింది. బాలీవుడ్‌లో ‘కట్టా మీఠా’ చిత్రంతో ఆమె అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్షయ్ కుమార్ పక్కన హీరోయిన్‌గా చేసినప్పటికీ ఆమె సక్సెస్‌ సాధించలేదు. దాంతో ఆ ఒక్క సినిమా తరువాత మళ్లీ ఎప్పుడూ ముంబై ఫ్లైట్ ఎక్కలేదు చెన్నై బ్యూటీ... 


తమన్నా: 

చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ తమన్నా. ఒకటిన్నర దశాబ్దం గడిచిపోయినా ఆమె హీరోయిన్‌గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. తమన్నాను అభిమానులందరూ మిల్కీ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. అయితే, తన తొలి చిత్రమే హిందీలో 2005వ సంవత్సరంలో చేసిన మన మిల్కీ... 2013లో ‘హిమ్మత్ వాలా’లో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. అయినా అడపాదడపా ట్యామీ బాలీవుడ్ వెళ్లి వస్తుంటుంది. ‘బోలే చూడియా’ అనే సినిమా ఆల్రెడీ పూర్తికాగా తమ్మూ చేతిలో ఇప్పుడు ‘బబ్లీ బౌన్సర్’ అనే మరో హిందీ సినిమా కూడా ఉంది. డైరెక్టర్ మథుర్ బండార్కర్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం... 


కాజల్, తమన్నా, త్రిష, పూజా హెగ్డే లాంటి సౌత్ బ్యూటీసే కాక శ్రియా శరణ్, ఇలియానా లాంటి మరికొందరు దక్షిణాది క్రేజీ హీరోయిన్స్ కూడా ముంబై గ్లామర్ ప్రపంచంలో గతంలో నెట్టుకు రాలేకపోయారు...

Updated Date - 2022-04-09T01:16:35+05:30 IST