చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యానంటున్న నటి

ABN , First Publish Date - 2021-10-18T20:31:45+05:30 IST

బదాయి‌హో సినిమాలో అయుష్మాన్ ఖురానాకు తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన నటి నీనా గుప్తా. సర్దార్ కా గ్రాండ్ సన్, పంగ, సందీప్ ఔర్ పింకీ పరార్, ముల్క్ వంటి తదితర చిత్రాల్లో నటించింది.

చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యానంటున్న నటి

బదాయి‌హో సినిమాలో అయుష్మాన్ ఖురానాకు తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన నటి నీనా గుప్తా. సర్దార్ కా గ్రాండ్ సన్, పంగ, సందీప్ ఔర్ పింకీ పరార్, ముల్క్ వంటి తదితర చిత్రాల్లో నటించింది. ఆమె తాజాగా తన ఆటో బయోగ్రఫీని ‘‘సచ్ కహు తో’’ పేరుతో విడుదల చేసింది. ఆ ఆటోబయోగ్రఫీలో సంచలన విషయాలు వెల్లడించింది. 


చిన్నతనంలో తను లైంగిక వేధింపులకు గురి అయ్యానని పేర్కొంది. తన తల్లికి కూడా ఆ విషయం గురించి చెప్పలేదని వివరించింది. ఎదిగే వయస్సులో ఒక డాక్టర్, టైలర్ తనను లైంగికంగా వేధించారని  చెప్పింది. ‘‘ నా సోదరుడితో కలిసి నేను ఒక కళ్ల డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అతడు నా సోదరుడిని వెయిటింగ్ రూమ్‌లో ఉండమని చెప్పాడు.  అనంతరం నా కళ్లను పరీక్షించడం మొదలుపెట్టాడు. కళ్లకు సంబంధంలేని భాగాల వైపునకు చేతిని జరపడం మొదలుపెట్టాడు. అతడు ఆ విధంగా చేయడంతో నేను  భయపడ్డాను. ఇంటికి చేరుకున్నాక ఒక గదిలో మూలన కూర్చొని ఏడ్వటం మొదలుపెట్టాను. మా ఇంట్లోని వారు ఎవరూ కూడా నా వైపు తలెత్తి చూడలేదు.  మా అమ్మకు చెప్పడానికి కూడా నేను ధైర్యం చేయలేదు. ఎందుకంటే నేను భయపడిపోయాను. ఈ విధంగా డాక్టర్ల దగ్గర చాలా సార్లు జరిగింది ’’ అని నీనా గుప్తా తెలిపింది.


అటువంటి ఘటనే టైలర్ దగ్గర కూడా ఎదురైందని ఆమె దాని గురించి వివరించింది. ‘‘ నేను ఒక సారి టైలర్ దగ్గరికి వెళ్లాను. అతడు నా శరీర భాగాల కొలతలు తీసుకునేటప్పుడు చేతులతో తడమడం మొదలుపెట్టాడు. టైలర్ దగ్గరకు వెళ్లడం ఇష్టం లేదని చెబితే మా అమ్మ ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు జరిగిన విషయం అంతా చెప్పాలి. మహిళలకు ఇచ్చే స్వాతంత్ర్యమే తక్కువ. ఇటువంటి విషయాల గురించి చెబితే ఆ స్వాతంత్ర్యం కూడా పోతుంది. నాకు వేరే మార్గం లేక మా అమ్మకు కూడా చెప్పలేదు ’’  అని ఆమె వివరించింది. ఒక సారి తన స్నేహితుడి సోదరుడు కూడా అటువంటి ప్రయత్నాలు చేశాడని ఆమె చెప్పింది.


కాలేజీలో చదువుతున్న ఇతర విద్యార్థినులకు కూడా ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయని త్వరలోనే తనకు అర్థమయిందని వివరించింది. కానీ, వారు కూడా తమ తల్లిదండ్రులతో సహా ఇతరులకు వాటి గురించి చెప్పలేదని వాపోయింది. ప్రస్తుత కాలంలో 3 ఏళ్ల వయసు నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెబుతున్నారంది. అప్పట్లో అటువంటి విషయాల గురించి తమకు ఎవరూ నేర్పించలేదని పేర్కొంది.


Updated Date - 2021-10-18T20:31:45+05:30 IST