'చందమామ' Kajal Agarwal బర్త్ డే స్పెషల్..

ABN , First Publish Date - 2022-06-19T15:12:54+05:30 IST

కాజల్ అగర్వాల్ (Kajal Agarwal)..సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న క్రేజీ హీరోయిన్. ముంబైలో 1985, జూన్ 19 పుట్టారు. ఆమె కుటుంబ నేపథ్యం పంజాబీ.

'చందమామ' Kajal Agarwal బర్త్ డే స్పెషల్..

కాజల్ అగర్వాల్ (Kajal Agarwal)..సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న క్రేజీ హీరోయిన్. ముంబైలో 1985, జూన్ 19 పుట్టారు. ఆమె కుటుంబ నేపథ్యం పంజాబీ. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన కాజల్, 2004లో వచ్చిన హిందీ చిత్రం 'క్యూ....హో గయా నా' (Kyun! Ho Gaya Na) ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ తేజ (Teja) ద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో హీరోయిన్‌గా అడుగుపెట్టారు. నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా తేజ దర్శకత్వంలో రూపొంది 2007లో వచ్చిన 'లక్ష్మీ కళ్యాణం' (Lakshmi Kalyanam) కాజల్ మొదటి సినిమా. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 


అదే సంవత్సరం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishnavamsi) దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' (Chandamama) సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారిన కాజల్ వరుసగా తెలుగు, తమిళ చిత్రాలలో హీరోయిన్‌గా అవకాశాలు అందుకున్నారు. ఇక 2009లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (S S Rajamouli) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కిన 'మగధీర' (Magadheera) సినిమాలో నటించారు. ఈ సినిమాతో కాజల్‌కు సౌత్‌లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక్కడ్నుంచి ఆమె కెరీర్ ఊహించని విధంగా మారిపోయింది.


దాంతో తెలుగు, తమిళ భాషలలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి కాజల్ ఖాతాలో ఎక్కువగా సూపర్ హిట్ సినిమాలే చేరాయి. రామ్ చరణ్, ఎన్.టి.ఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, నితిన్, రామ్ పోతినేని లాంటి యంగ్ హీరోల సరసన మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి లాంటీ సీనియర్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకోవడం, బ్లాక్ బస్టర్స్‌ను తన ఖాతాలో వేసుకోవడం గొప్ప విషయం. 


చిత్ర పరిశ్రమలో కాజల్‌కు ఉన్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. డేట్స్ సర్దుబాటు అవుతాయనుకుంటే తన వద్దకు వచ్చిన ఏ చిత్రాన్ని వదిలేవారు కాదు. 15 ఏళ్ల సినీ కెరీర్‌లో కాజల్‌పై వచ్చిన కాంట్రవర్సీలు కూడా చాలా తక్కువ. అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం ఉండటంతో ఇండస్ట్రీలో అందరూ ఆమెను సొంత వ్యక్తిగానే చూశారు. కాజల్ ఒకే హీరోతో రెండు మూడు చిత్రాలు చేసి కూడా హిట్స్ అందుకున్నవి చాలానే ఉన్నాయి. రామ్ చరణ్ సరసన 'మగధీర' సినిమాలో నటించిన కాజల్, ఆ తర్వాత బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో 'సర్దార్ గబ్బర్‌సింగ్' మూవీలో.. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆయన రీ ఎంట్రీ మూవీ  'ఖైదీ 150'లో హీరోయిన్‌గా నటించడం విశేషం.


సినీ కెరీర్‌కు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో పర్సనల్ లైఫ్‌కు కూడా కాజల్ అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారు. కెరీర్ మంచి ఊపులో ఉండగానే వ్యాపార వేత్త అయిన గౌతమ్ కిచ్లూను ప్రేమించి ఇరుకుటుంబాల సమ్మతితో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతున్న కాజల్ ఇటీవలే పండంటి మగబిడ్దకు జన్మనిచ్చారు. నీల్ కిచ్లూ అని ఆ బాబుకు పేరు పెట్టారు. ప్రస్తుతం తల్లిగా ఆనందకరమైన సమయాన్ని గడుపుతున్న ఆమె మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 


పెళ్లికి ముందు ఒప్పుకున్న సినిమాలు 'ఆచార్య', 'ది ఘోస్ట్', 'ఇండియన్ 2' సహా మరికొన్ని ఉన్నాయి. కానీ, గర్భం దాల్చడంతో 'ఆచార్య', 'ది ఘోస్ట్' సినిమాల నుంచి కాజల్ తప్పుకున్నారు. అయితే, 'ఇండియన్ 2' మాత్రం మేకర్స్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల చాలా నెలలుగా ప్రాజెక్ట్ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. కనుక ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె ఇంకా తప్పుకున్నట్టు ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇక 'ఇండియన్ 2'కు సమస్యలు పరిష్కారం కావడంతో మళ్ళీ సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నారు. 


ఒకవేళ కాజల్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే మాత్రం అది 'ఇండియన్ 2'తోనే అని తెలుస్తోంది. ఇక ఈ చందమామ మళ్ళీ సినిమాలు చేయాలని, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తరగని అందం కాజల్ సొంతం. అందుకే, ఆమె మరికొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతారని పలువురు సినీ తారలు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు అదే కోరుకుంటున్నారు. ఇక నేడు(జూన్ 19) 'చందమామ' కాజల్ అగర్వాల్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు, సినీ ప్రముఖులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Updated Date - 2022-06-19T15:12:54+05:30 IST