అందుకే నాకు సినిమాల‌లో గ్యాప్ వ‌చ్చింది: ఇంద్రజ

ABN , First Publish Date - 2022-03-11T02:48:26+05:30 IST

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది న‌టీమ‌ణులున్నారు. కాంపిటీషన్ బాగా ఉంది. అమ్మ‌, అక్క‌, వ‌దిన పాత్ర‌లు చేసేవారు చాలా మంది ఉన్నారు. బెట‌ర్ అవ‌కాశం రావ‌డాన్ని అదృష్టంగా భావిస్తా. కొత్త‌వి మూడు సినిమాలు చేశాను. అవి త్వరలోనే..

అందుకే నాకు సినిమాల‌లో గ్యాప్ వ‌చ్చింది: ఇంద్రజ

యంగ్ హీరో రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల‌పై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 18న విడుద‌ల‌ కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రంలో తల్లి పాత్రలో నటించిన సీనియ‌ర్ న‌టి ఇంద్ర‌జ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. 


ఆమె మాట్లాడుతూ..

‘‘ఈ చిత్ర కథని ద‌ర్శ‌కుడు శాంటో నాకు ఫోన్‌‌‌లోనే చెప్పారు. చాలా ఆస‌క్తికరంగానూ, స‌రికొత్త‌గానూ అనిపించింది. స‌హ‌జంగా త‌ల్లీ, కొడుకుల మ‌ధ్య రిలేష‌న్, మాట‌లనేవి తండ్రిని స‌పోర్ట్‌గా మాట్లాడేలా ఉంటాయి. కానీ ఈ క‌థ‌లో ద‌ర్శ‌కుడు త‌ల్లి ప్రాధాన్య‌త కుటుంబంలో ఎంత ఉంటుందో తెలిపారు. ముర‌ళీ శ‌ర్మగారు నా భ‌ర్త‌గా న‌టించారు. కానీ ఇంటి బాధ్య‌త నేనే తీసుకుంటాను. భ‌ర్త ద‌గ్గ‌ర ‌లేని క్వాలిటీని కొడుకు ద‌గ్గ‌ర చూడాల‌ని చిన్న‌ప్ప‌టి నుంచీ జాగ్ర‌త్త‌గా పెంచే పాత్ర నాది. అయినా త‌ను తండ్రిలాగానే ఉన్నాడ‌ని తెలిసి బాధ‌ప‌డుతుంటాను. చివ‌రికి కుమారుడు త‌ల్లిని ఏవిధంగా అర్థం చేసుకున్నాడ‌నే ముగింపు చాలా బాగుంటుంది. స‌పోర్టింగ్ పాత్ర‌ల‌నేవి మ‌గ‌వారికి బాగానే వ‌స్తున్నాయి. మ‌హిళ‌ల‌కు స‌రైన పాత్ర‌లు రావ‌డంలేదు. అందుకే నాకు సినిమాల‌లో చాలా గ్యాప్ వ‌చ్చింది. స‌రైన పాత్ర‌లు రాక‌పోవ‌డం ఒక కార‌ణం. రొటీన్ పాత్ర‌లే రావ‌డంతో కొన్ని వ‌దులుకున్నాను.


ఈ చిత్రాన్ని యూత్‌‌తో పాటు త‌ల్లిదండ్రులు కూడా త‌ప్ప‌నిస‌రిగా చూసే విధంగా వుంటుంది. ఇందులో రెండు అంశాలు ద‌ర్శ‌కుడు బాగా చెప్పాడు. యూత్ ప‌ని, ప్యాషన్ అనే అంశాలలో ఏదో ఒక దానికోసం క‌ష్ట‌ప‌డుతుంటారు. అలా కాకుండా త‌మ‌కిష్ట‌మైన ప‌నిని చేస్తూనే ఎలా బ‌త‌క‌వ‌చ్చో ఈ సినిమాలో చూపించారు. భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య రిలేష‌న్ ఎలా ఉండాలి. ఇప్పుడు పిల్ల‌ల‌తో క‌మ్యూనికేష‌న్ గ్యాప్ కూడా వుంది. అందుకే ఇప్పుడున్న జ‌న‌రేష‌న్‌కు అర్థ‌మ‌య్యేలా పాజిటివ్‌గా ద‌ర్శ‌కుడు చెప్పాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది న‌టీమ‌ణులున్నారు. కాంపిటీషన్ బాగా ఉంది. అమ్మ‌, అక్క‌, వ‌దిన పాత్ర‌లు చేసేవారు చాలా మంది ఉన్నారు. బెట‌ర్ అవ‌కాశం రావ‌డాన్ని అదృష్టంగా భావిస్తా. కొత్త‌వి మూడు సినిమాలు చేశాను. అవి త్వరలోనే విడుద‌ల‌ కానున్నాయి. క‌న్న‌డలో ఓ చిత్రం చేశాను. ఇప్పుడు నితిన్‌ చిత్రంలో చేస్తున్నా..’’ అని తెలిపారు.

Updated Date - 2022-03-11T02:48:26+05:30 IST