చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ ఆలియా భట్ (Alia Bhatt). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ (student of the year) సినిమాతో బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేసింది. ‘హైవే’, ‘రాజీ’ వంటి కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో అభిమానులను మెప్పించింది. తాజాగా ‘గంగూబాయి కతియావాడి’ లో నటించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు అభిమానుల మన్ననలు దక్కించుకుంది. బెర్లిన్ ఇంటర్నేషల్ ఫిలిం ఫెస్టివల్‌లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా ‘గంగూబాయి కతియవాడి’ ని రూపొందించారు.
ఆలియా భట్ త్వరలోనే హాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ (Heart of Stone) చిత్రంలో ఆమె నటించనుంది. ఈ మూవీలో గాల్ గాడోట్ (Gal Gadot), జామీ డోర్నన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆలియా భట్ హాలీవుడ్‌కు బయలుదేరింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులతో పంచుకుంది. ‘‘మొట్ట మొదటి హాలీవుడ్ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు బయలుదేరాను. సినిమా ఇండస్ట్రీలోకీ మరల కొత్తగా ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. నేను నెర్వస్‌గా ఫీలవుతున్నాను. అందరు నాకు శుభాకాంక్షలు చెప్పండి’’ అని ఆలియా భట్ సోషల్ మీడియాలో పేర్కొంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ కు టామ్ హార్పర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గూఢచర్యం నేపథ్యంలో థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ఆలియా భట్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’, ‘డార్లింగ్స్’ ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.