లైగర్‌ ఓ మాస్‌.. మసాలా సినిమా!

ABN , First Publish Date - 2022-08-13T06:03:28+05:30 IST

ఇప్పుడు అందరి దృష్టీ లైగర్‌ పై పడింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా అవతారం ఎత్తాడు.

లైగర్‌ ఓ మాస్‌.. మసాలా సినిమా!

ఇప్పుడు అందరి దృష్టీ లైగర్‌ పై పడింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా అవతారం ఎత్తాడు. ఈనెల 25న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు విష్‌. ‘జోష్‌’లో చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చిన విష్‌... పూరి కనెక్ట్స్‌తో కనెక్ట్‌ అయ్యాడు. ఈ సంస్థకు విష్‌ సిఈఓగా పనిచేస్తున్నాడు. ‘లైగర్‌’తో పూర్తి స్థాయి నటుడిగా తెరపైకొచ్చాడు. ఈ సందర్భంగా విష్‌ చెప్పుకొచ్చిన ‘లైగర్‌’ కబుర్లు.


పూరితో పరిచయం ఎలా మొదలైంది?

పూరి సార్‌కి పెద్ద ఫ్యాన్‌ నేను. కాలేజీ ఎగ్గొట్టి మరీ ఆయన సినిమాల్ని చూసేవాడిని. నేను మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకొన్నా. ఆ వీడియోలు చూసి పూరి సర్‌ నన్ను పిలిపించారు. ‘లైగర్‌’ బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే కథ కాబట్టి, ఆ కథ గురించి నాతో చర్చించారు. ‘ఈ సినిమాలో నీకో పాత్ర ఇస్తా’ అన్నారు. ఈలోగా పూరి కనెక్ట్స్‌లో రూపొందించిన ‘రొమాంటిక్‌’, ‘మెహబూబా’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రాలకు పని చేశా. ‘మెహబూబా’ ప్రొడక్షన్‌ మొత్తం నేనే చూసుకొన్నా. నాపై నమ్మకంతో పూరి కనెక్ట్స్‌కి నన్ను సీఈఓని చేశారు.


ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ, మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ.. ఇలా చాలా బలమైన పాత్రలు ఉన్నాయి. వీటి మధ్య మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

ఓ అహంకార పూరితమైన బాక్సర్‌గా నటించా. ఆల్రెడీ ఓ ఛాంపియన్‌.. తను ఓ అండర్‌ డాగ్‌తో తలపడితే ఎలా ఉంటుంది? అనేది తెరపై చూస్తారు. నేను మార్షల్‌ ఆర్ట్స్‌ నుంచి వచ్చాను కాబట్టి, ఈ పాత్ర పోషించడం కాస్త సులభమైంది. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సాగే సినిమాల్లో నటించడం సామాన్యమైన విషయం కాదు. నిరంతమైన శ్రమ ఉంటుంది. మన బాడీపై ఫోకస్‌ ఉంచాలి. నటనపై కూడా దృష్టి పెట్టాలి. ఇంత పెద్ద సినిమాలో ఛాన్స్‌ రావడం మామూలు విషయం కాదు. దాన్ని నిలబెట్టుకొన్నా.


అండర్‌ డాగ్‌ నుంచి ఛాంపియన్‌ గా ఎదగడం అనేది అన్ని స్పోర్ట్స్‌ డ్రామాల్లోనూ కనిపించేదే. ‘లైగర్‌’లో కొత్తగా ఏముంటుంది?

‘లైగర్‌’ని అందరూ కేవలం ఓ బాక్సింగ్‌ సినిమాగానే చూస్తున్నారు. కానీ.. ఇది పూర్తి స్థాయి మాస్‌, మసాలా సినిమా. అందులో బాక్సింగ్‌ అనేది ఓ నేపథ్యం మాత్రమే. మిగిలినవన్నీ పూరి స్టైల్‌లోనే సాగుతాయి. ఇది బయోపిక్‌ లాంటి కథ కాదు. జస్ట్‌.. పూర్తి స్థాయి కమర్షియల్‌ సినిమా. చిన్న పిల్లలకు సైతం నచ్చే అంశాలు ఇందులో చాలా ఉంటాయి.


ఈ ప్రాజెక్ట్‌లోకి మైక్‌ టైసన్‌ ఎలా వచ్చారు?

పూరి కలలన్నీ పెద్ద సైజులో ఉంటాయి. బాక్సింగ్‌లో ఛాంపియన్‌ అనగానే మైక్‌ టైసనే గుర్తొస్తారు. ఆయన్ని ఈ కథలోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది? అని అనుకొన్నారు. అంతే... తీసుకొచ్చారు. ఆలోచన పూరిది అయితే ఆచరణ మొత్తం ఛార్మి గారిది. ఆమె ఫాలో అప్‌ వల్లే.. టైసన్‌ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు.


మైక్‌ టైసన్‌తో పని చేశారు కదా. ఆయన దగ్గర్నుంచి ఏం నేర్చుకొన్నారు?

ప్రపంచాన్ని చూసిన వ్యక్తి ఆయన. చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయన్ని కలవగానే నేను అడిగిన ప్రశ్న... ‘ఏంటి సార్‌.. ఇంత సింపుల్‌గా ఎలా ఉండగలుగుతున్నారు?’ అని అడిగా. ‘నేను చూడని ప్రపంచం లేదు..’ అని నవ్వుతూ సమాధానం చెప్పారు. పదేళ్ల చిన్న పిల్లాడు ఎలా ఉంటాడో.. అలా ఉన్నారాయన. గొప్ప వ్యక్తులెవరూ జీవితం గురించి క్లాసులు పీకరు. ఇలా ఉండు.. అలా ఉండు అని చెప్పరు. ‘నీకు నచ్చినట్టు నువ్వుండు’ అంటారు. మైక్‌ కూడా అదే చెప్పారు.


జనగణమనలో కూడా మీరు ఉన్నారా?

ఆ సినిమాలో నేను లేను. నాకు సరిపడే పాత్ర అందులో లేదు. ఉంటే పూరి సర్‌ తప్పకుండా నాకు అవకాశం ఇచ్చేవారు. అయితే ‘లైగర్‌’ ట్రైలర్‌ బయటకు రాగానే నాకు కొత్త అవకాశాలు రావడం మొదలయ్యాయి. కరణ్‌ జోహార్‌ ఆఫీసు నుంచి ఫోన్‌ వచ్చింది. ‘కథ ఉంది.. వచ్చి కలవండి’ అన్నారు. ‘లైగర్‌’ పనులు పూర్తవ్వగానే ముంబై వెళ్తా.


హీరో, విలన్‌... ఎలాంటి పాత్రలంటే ఇష్టం?

ఏ పాత్ర చేసినా మనదైన గుర్తింపు ఉండాలి. ఈ పాత్రతో మంచి పేరొస్తుంది అనుకొంటే ఎలాంటి పాత్ర అయినా చేస్తా. ఇప్పుడు కొన్ని సినిమాలు ఒప్పుకొన్నా. వాటి విషయాలు త్వరలో చెబుతా. 

Updated Date - 2022-08-13T06:03:28+05:30 IST