S.V.Rangarao: నట యశస్వి

ABN , First Publish Date - 2022-07-03T18:00:02+05:30 IST

ఎస్వీ రంగారావు (S. V. Ranga Rao) కృష్ణా జిల్లా లోని నూజివీడులో, 1918 జూలై 3 వ తేదీన తెలగ నాయుళ్ళ వంశములో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించారు.

S.V.Rangarao: నట యశస్వి

‘మాయాబజార్‌’లో ఘటోత్కచుడిగా మెప్పించినా, 

నర్తనశాలలో కీచకుడిగా భయపెట్టినా

భక్తప్రహ్లాదలో హిరణ్యకశిపుడిగా విశ్వరూపం చూపినా.. 

సహజ నటన, ఆకట్టుకునే ఆహార్యం, 

తెలుగుభాషకే వన్నె తెచ్చే వాక్‌చాతుర్యం విశ్వనట చక్రవర్తి ఎస్‌.వి.రంగారావుకే సొంతం.  

తెలుగు సినీ జగత్తులో ఆయనది ప్రత్యేకశైలి. రంగస్థల నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నటుడిగా, దర్శకనిర్మాతగా తనకంటూ నటనతో  ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నటనా చక్రవర్తిగా మూడు దశాబ్దాలపాటు సినీ రంగాన్ని ఏలారు. ఆదివారం ఎస్‌.వి.రంగారావు జయంతి సందర్భంగా ఆయన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. 



ఎస్వీ రంగారావు (S. V. Ranga Rao) కృష్ణా జిల్లాలోని నూజివీడులో, 1918 జూలై 3 వ తేదీన తెలగ నాయుళ్ళ వంశములో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించారు. తన తాతగారి పేరైన రంగారావునే కుమారుడికి పెట్టారు. కోటీశ్వర నాయుడు. రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యుడు. నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేశాడు. మేనమామ బడేటి వెంకటరామయ్య రాజకీయ నాయకుడు, న్యాయ శాస్త్రవేత్త. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. ఆయనకు వృత్తి రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో, రంగారావు నాయనమ్మ గంగారత్నమ్మ పర్యవేక్షణలో పెరిగాడు. ఈమె భర్త మరణానంతరం మనుమలు, మనుమరాళ్ళతో సహా మద్రాసుకు మారింది. రంగారావు హైస్కూలు చదువు అక్కడే సాగింది. మద్రాసులో ఎస్. ఎస్. ఎల్. సి వరకు చదివారు. ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాలలోనూ, బి. ఎస్. సి కాకినాడలోని పి. ఆర్. కళాశాలలోనూ పూర్తి చేశారు. మద్రాసులో చదువులో అంతంతమాత్రంగా ఉన్న రంగారావు కాకినాడ, విశాఖపట్నానికి వచ్చేసరికి చదువులో ముందుండేవారు. ఇంటర్ పరీక్షకు 45 మంది హాజరయితే అందులో రంగారావు ఒక్కడే ఉత్తీర్ణుడు కావడం విశేషం. మద్రాసు హిందూ హైస్కూలులో తన పదిహేనవ ఏట మొదటి సారిగా నాటకంలో నటించారు. తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడంతో అతనులో నటుడు కావాలన్న కోరికకు బీజం పడింది. తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు. 1936 లో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలలో రంగారావు బళ్ళారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారు. మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు. అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు. వాటిని విశ్లేషించేవారు. రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం 1934లో విడుదలైన లవకుశ. 


నాటకరంగం :

ఏలూరులో ఉన్న రంగారావు మేనమామ బడేటి వెంకటరామయ్య మరణించడంతో కూతురికి తోడుగా ఉండటం కోసం రంగారావు నాయనమ్మ తన మకాంను మద్రాసు నుంచి ఏలూరుకు మార్చింది. తమ ఇంట్లో ఎవరూ కళాకారులు లేరు. అందువల్ల అతను బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడాలనేది ఇంట్లో వాళ్ళ కోరిక. కానీ రంగారావుకు మాత్రం నటుడవ్వాలనే కోరిక బలంగా ఉండేది. బాగా చదువుకుంటూనే నటనను కూడా వదిలి పెట్టలేదు. కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. ఇక్కడ అంజలీదేవి, ఆదినారాయణరావు, బి.ఎ.సుబ్బారావు, రేలంగి వంటి వారితో పరిచయం ఏర్పడింది. నాటకాల్లో రంగారావు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. పీష్వా నారాయణరావు వధ నాటకంలో రంగారావు ఇరవై రెండేళ్ళ వయసులో అరవై ఏళ్ళ వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు. ఖిల్జీ రాజ్యపతననం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో, స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించారు. రంగారావుకు ఇంగ్లీషు మీద కూడా పట్టు ఉండటంతో షేక్స్‌పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు. నాటకాలు వేస్తూనే బి. ఎస్. సి పూర్తి చేశారు. తర్వాత ఎం. ఎస్. సి చేయాలనుకున్నారు. కానీ అగ్నిమాపక దళంలో పని చేసే చొలెనర్ అనే అభిమాని సలహాతో అగ్నిమాపక దళంలో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. మద్రాసులో కొన్ని రోజులు శిక్షణ తర్వాత మొదట బందరులో తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసరుగా పనిచేశారు. 


అతను నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన 'వరూధిని' అనే చిత్రం. ఈ సినిమా దర్శకుడు బి. వి. రామానందం. రంగారావుకు దూరపు బంధువు. రంగారావు ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా నటిస్తే, నటి గిరిజ తల్లి దాసరి తిలకం అతనుకు జోడీగా నటించింది. అప్పటి దాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావుకు మొదటి సారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం జానికి వేసింది. అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగారు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు. కానీ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. దాంతో అతనుకు మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా చేరారు. జంషెడ్పూర్ లో పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవారు. వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా, ఊర్వశి నాటకంలో దుర్వాసునిగా అతను వేషాలు వేసేవారు. అదే సమయంలో అతను వివాహం కూడా జరిగింది.


నటనా శైలి :

రంగారావు తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలు కలబోసిన నటుడు. సహజ నటుడిగా పేరుగాంచారు.రంగారావుకు తొలినాళ్ళలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలోని సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకుని అతని మాట తీరుని, ప్రవర్తనా విధానాన్ని అనుకరించారు. సంతానం చిత్రంలో అతను పోషించిన గుడ్డివాని పాత్ర కోసం కొన్నాళ్ళు పాటు అంధుల ప్రవర్తనను గమనించారు. మాంత్రికుడి పాత్ర కూడా అతను పోషించిన పాత్రల్లో బాగా పేరొందింది. నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు గనక తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన షైలాక్ పాత్రలను ఆధారంగా చేసుకుని మరింత రౌద్రరసాన్ని కలిపి తనదైన శైలిలో నటించారు.


రంగారావు యుముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఆయన నటనను అభినందించారు. వాచికం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడురు. రౌడీ పాత్రల్లో నటించేటపుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటిస్తూనే గూట్లే, డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తనదైన శైలిని ప్రవేశపెట్టారు. అతను కళ్ళు, కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలచేవారు.


బిరుదులు :

విశ్వనటచక్రవర్తి

నటసార్వభౌమ

నటసింహ

నటశేఖర

బహుమతులు :

రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం చదరంగం ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు. 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా విడుదలయిన తపాళాబిళ్ళలలో ఒకటి ఎస్వీ రంగారావు మీద విడుదలయింది.


మరణం :

1974 ఫిబ్రవరిలో హైదరాబాదులో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చాడు. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు. నటుడిగా ఆయన చివరి చిత్రాలు చక్రవాకం (1974), యశోద కృష్ణ (1975). యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ ఈ లోపే 1974 జూలై 18వ తేదీన మద్రాసులో మళ్ళీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశారు.

Updated Date - 2022-07-03T18:00:02+05:30 IST