ప్రముఖ Bollywood నటికి అరుదైన వ్యాధి.. ముఖాలను గుర్తుపట్టాలేనంటూ..

ABN , First Publish Date - 2022-06-30T17:47:01+05:30 IST

‘ఇష్క్ విష్క్’, ‘ఢిల్లీ బెల్లీ’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి షెనాజ్ ట్రెజరీ. ఈ 40 ఏళ్ల నటి ఆమెకు ప్రోసోపాగ్నోసియా..

ప్రముఖ Bollywood నటికి అరుదైన వ్యాధి.. ముఖాలను గుర్తుపట్టాలేనంటూ..

‘ఇష్క్ విష్క్’, ‘ఢిల్లీ బెల్లీ’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి  షెనాజ్ ట్రెజరీ. ఈ 40 ఏళ్ల నటి ఆమెకు ప్రోసోపాగ్నోసియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ వ్యాధి ఉన్న వ్యక్తులు ఇతరుల ముఖాలను సరిగ్గా గుర్తుపట్టలేరు. దాన్నే ఫేస్ బ్లైండ్‌నెస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను షేర్ చేసింది. అందులో తనకున్న వ్యాధి మూలంగా చాలామందిని దూరంగా చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపింది.


షెనాజ్ షేర్ చేసిన మొదటి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ‘నేను ప్రోసోపాగ్నోసియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను. నేను కొందరి ముఖాలు ఎందుకు గుర్తించలేకపోతున్నానో ఇప్పుడు అర్థమైంది. ఇది మెదడుకి సంబంధించిన వ్యాధి. నేను ముఖాలను గుర్తించలేనందుకు ఎప్పుడూ సిగ్గుపడుతూ ఉన్నాను. నేను స్వరాలను గుర్తిస్తాను. కానీ ఆ వ్యక్తుల ముఖాలను గుర్తించలేను. చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ ముఖాలను కూడా గుర్తించలేనందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి’ అని రాసుకొచ్చింది.


మరో స్టోరీలో షెనాజ్.. ‘గతంలో చూసిన వ్యక్తి హెయిర్ కట్ చేసుకున్న తర్వాత మళ్లీ కనిపిస్తే చాలామంది పోల్చుకోవడానికి ఇబ్బంది పడతారు. ఫెస్ బ్లైండ్‌నెస్ ఉన్న చాలామంది ఇతరుల హెయిర్ కట్ ఆధారంగానే వారిని గుర్తుంచుకుంటారు. ఒకవేళ మీరు హెయిర్‌కట్‌లో ఛేంజెస్ చేస్తే వారి మెమొరీ పోతుంది. వారికి గుర్తుపట్టడం కష్టమవుతుంది. అందుకే చాలామంది నాకు పొగరని అపార్థం చేసుకున్నారు. నా వ్యాధి గురించి తెలుసుకొని నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది నా వ్యాధి మూలంగానే కానీ.. నాలో ఎలాంటి పొరపాటు లేదని గుర్తించండి’ అంటూ ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.


కాగా.. గత నెలలో ఒక అంతర్జాతీయ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ సైతం ఈ వ్యాధి గురించి మాట్లాడాడు. ఆయన ప్రొసోపాగ్నోసియాతో బాధపడుతున్నట్లు భావిస్తున్నానని తెలిపాడు. అయితే ఆయన వ్యాధి గురించి ఎటువంటి అధికారిక నిర్ధారణ జరగలేదు.

Updated Date - 2022-06-30T17:47:01+05:30 IST