పాలబేబీ పాత్రలో నవ్వులు పంచుతా

ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST

‘‘ఎఫ్‌ 3’ పక్కా పైసా వసూల్‌ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూసిన ప్రేక్షకులకు మూడొందల రూపాయల ఆనందం దక్కుతుంది.

పాలబేబీ పాత్రలో నవ్వులు పంచుతా

‘‘ఎఫ్‌ 3’ పక్కా పైసా వసూల్‌ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూసిన ప్రేక్షకులకు మూడొందల రూపాయల ఆనందం దక్కుతుంది. కొన్ని సన్నివేశాలను చూడడానికి ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వస్తారు. ’’ అని నటుడు అలీ అన్నారు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా అనిల్‌  రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రమిది. దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించారు. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘ఎఫ్‌ 3’ సినిమా, అందులో తన పాత్ర గురించి అలీ మీడియాతో మాట్లాడారు. 


ఈ మధ్యన కొన్ని సినిమాల్లో నేను పోషించిన పాత్రలు నటుడిగా నాకు సంతృప్తిని ఇవ్వలేదు. ‘అలీ ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తున్నాడు’ అని అభిమానులతో అనిపించుకోవడం ఇష్టం లేక కథ, పాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాను. అందుకే సినిమాల సంఖ్య కొంచెం తగ్గినట్లు అనిపిస్తోంది. 


ఈ సినిమాలో ప్రేక్షకులు ఒకప్పటి అలీని మళ్లీ చూస్తారు. నా పాత్ర పేరు పాలబేబీ. అప్పులు ఇచ్చే వ్యాపారి పాత్ర అది. దాదాపు 45 నిమిషాల నిడివి ఉన్న పాత్ర అది. శిరీష్‌ గారు నా పాత్రను బాగా ఆస్వాదించారని అనిల్‌ చెప్పారు. 


సినిమాలో చాలా మంది సీనియర్‌  నటీనటులు ఉన్నారు. ఒకరిని మించి మరొకరు నటించారు. అన్ని పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉంది. చాలామంది ఆర్టిస్ట్‌లు కలసి నటిస్తుంటే కొంచెం ఒత్తిడి ఉంటుంది. కానీ అనిల్‌ రావిపూడిలో అది కొంచెం కూడా కనిపించలేదు. చిన్న వయసులోనే అంతమంది నటులతో ఏకకాలంలో పనిచేస్తూ మంచి అవుట్‌పుట్‌ రాబట్టడం దర్శకుడి సత్తాకు నిదర్శనం. దిల్‌రాజు గారు కూడా ఎంతమంది ఆర్టిస్టులు కావాలంటే అంతమందిని తీసుకొచ్చి ఇచ్చారు. 


వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌తో నా కామెడీ టైమింగ్‌ బాగుంటుంది. గతంలో వెంకటేష్‌ గారితో చాలా కామెడీ చిత్రాల్లో నటించాను. సెట్‌లో మా ఇద్దరి మధ్యలో మంచి అవగాహన ఉంటుంది. సన్నివేశం పండించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. 


ప్రస్తుతం ‘అంటే సుందరానికి’, ‘లైగర్‌’, ‘ఖుషీ’, ‘ఒకే ఒక జీవితం’ చిత్రాల్లో నటిస్తున్నాను. కన్నడలో ధృవ సర్జా మూవీ, ఓ నేపాలి చిత్రంలో నటిస్తున్నాను. తమిళ సిరీస్‌ చేస్తున్నాను. 


ఇప్పుడు దక్షిణాది సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అవుతున్నాయి. ఇక్కడి నటులకు విదేశాల్లోనూ గుర్తింపు వస్తోంది. ఒకప్పుడు మనం ఉత్తరాది నటులను ఎక్కువగా తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు దక్షిణాది నటులకు బాలీవుడ్‌, విదేశీ చిత్రాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. 


ఇండస్ట్రీలో నన్ను హీరోగా నిలబెట్టింది ఎస్వీ కృష్ణారెడ్డి గారు. పొలిటికల్‌ లీడర్‌గా క్రియేట్‌ చేయబోయేది ఎపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి గారే. ఫలానా పదవి ఇస్తామని ఆయన నాకు హామీ ఇవ్వలేదు. కానీ ‘నన్ను నమ్మండి’ అన్నారు. తప్పకుండా ఏదో ఒక రోజు  పిలుపొస్తుందనే నమ్మకం ఉంది. 

Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST