Ajay Devgn: అప్పుడే నయం.. ఇప్పుడు పరిస్థితి చాలా కష్టంగా ఉంది

ABN , First Publish Date - 2022-04-22T16:02:00+05:30 IST

బాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుల్లో అజయ్ దేవ్‌గణ్ ఒకరు. ఈ హీరోలో మంచి నటుడే కాదు, దర్శకుడు కూడా ఉన్నాడు...

Ajay Devgn: అప్పుడే నయం.. ఇప్పుడు పరిస్థితి చాలా కష్టంగా ఉంది

బాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుల్లో అజయ్ దేవ్‌గణ్ ఒకరు. ఈ హీరోలో మంచి నటుడే కాదు, దర్శకుడు కూడా ఉన్నాడు. ఆయన తాజాగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రన్‌వే 34’. ఇందులో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో అజయ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


అజయ్ మాట్లాడుతూ.. ‘గతానికి, ఇప్పటికి సినిమా నిర్మాణంలో చాలా మార్పులు వచ్చాయి. పెద్ద ప్రాజెక్టులు, సినిమాలను తీసేందుకు ఎన్నో సంస్థలు ఉన్నాయి. అయితే బడ్జెట్ కారణంగా డబ్బు, సమయం వృథా కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అయితే.. 1990ల్లో సినిమా నిర్మాణం చాలా సరదాగా ఉండేది. సినిమా వర్కవుట్ అవుతుందా లేదా అనే ఒత్తిడి ఉండేది కాదు. ప్రమోషన్లు ఉండేవి కావు. సోషల్ మీడియా అంతగా లేదు. కాబట్టి ఏమి జరుగుతుందో మాకు ఎక్కువగా తెలిసేది కాదు.


అంతేకాకుండా.. ఈ జనరేషన్‌లో ప్రతి ఒక్కరూ విమర్శకులే. ఫిల్మ్ మేకర్స్‌పై ఒత్తిడి ఎక్కువైంది. అందువల్ల పని మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ స్థాయిలో మన సినిమాలకి ఎక్స్‌పోజర్ వచ్చిన కారణంగా ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీల్లో సినిమా క్వాలిటీపై ఇంట్రస్ట్ పెరిగింది. ఇది మంచిదే. కానీ ఒత్తిడి మాత్రం విపరీతంగా పెరిగింది’ అంటూ చెప్పుకొచ్చాడు.


అలాగే రన్‌వే 34 సినిమా కథ గురించి అజయ్ మాట్లాడుతూ.. ‘ఈ మూవీ నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొందిన థ్రిల్లర్. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకమైంది’ అని తెలిపాడు. అయితే.. ఈ చిత్రం 2015లో జరిగిన జెట్ ఎయిర్‌వేస్ దోహా-కొచ్చి ఫ్లైట్ ఘటన స్పూర్తిగా రూపొందించారు.

Updated Date - 2022-04-22T16:02:00+05:30 IST